అంబరీష చక్రవర్తి! Bhakta Ambarisha


అంబరీష చక్రవర్తి!
కార్తీక మాసంలో అంబరీషోపాఖ్యానం వింటే ఏం జరుగుతుంది?

ప్రతిరోజూ ఉదయం లేవగానే రామాయణం, మధ్యాహ్నం భోజనానంతరం భారతం, రాత్రి నిద్రించే మందు భాగవతం చదవాలనీ, లేదా చదివించుకుని వినాలనీ పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుత కాలంలో అందరికీ అంత వెసులుబాటు లేక పోయినప్పటకీ, కొందరు ప్రవచనకర్తల ద్వారా కొన్ని పురాణ గాథలను వినగలుగుతున్నాము. భాగవతంలో ఎన్నో కథలు ప్రాశస్త్యంలో ఉన్నాయి. అటువంటి వాటిలో ముఖ్యమైనవిగా, ధ్రువ చరిత్ర, ప్రహ్లద చరిత్ర, గజేంద్ర మోక్షం, అంబరీషోపాఖ్యానం వంటివి చోటుచేసుకుంటాయి. భాగవతం, కార్తీక పురాణాలలో పేర్కోనబడిన అంబరీషోపాఖ్యానం ఎంతో ప్రాముఖ్యత చెందినది. గొప్ప విష్ణు భక్తుడిగా పేరుగడించిన అంబరీషుడి వృత్తాంతం ఏమిటి? మాంధాత, ముచికుందుడి వంశంలో జన్మించిన అంబరీషుడు, మహా చక్రవర్తిగా ఎలా పేరుగడించాడు? దుర్వాస మహామునిని సైతం పరుగులు పెట్టించిన అంబరీషుడి శక్తి ఎటువంటిదో, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. మీలో ఎవరైనా షోడశ రాజులలో ఒకరైన మాంధాత మాహారాజు వృత్తాంతాన్నీ, ఇక్ష్వాకు వంశంలో, త్రేతా యుగంలో జన్మించి, ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడికి సహాయం చేసిన ముచికుంద మహారాజు చరిత్రనూ గనుక తెలుసుకోనట్లయితే, వారికి సంబంధించిన వీడియో లింక్స్, ఐ కార్డ్స్ లో పొందుపరిచాను.. ప్రతి వీడియోలో కామెంట్ చేస్తూ, వీడియోను లైక్ చేస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సాహిస్తున్న సహృదయులందరికీ, పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ESTXE40Ben0 ]


అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు. శ్రేష్ఠుడైన అంబరీషుడు, ఏడు దీవులతో కూడిన భూమండల భారాన్ని, తన భుజస్కంధాల మీద మోసి శుభాలను పొంది, అఖండ రాజ్యసంపదలను కలిగి, చెడు నడతలకు లోనుకాకుండా, విష్ణుపూజలతోనే కాలాన్ని వెళ్ళబుచ్చి, విష్ణు సాన్నిధ్యాన్ని చేరి, ప్రశస్తి పొందాడు. సూర్యవంశములో సుప్రసిద్ధుడైన అంబరీషుడు, హరి పూజా దురంధరుడు, సద్గుణ సంపన్నుడు, నిరాడంబరుడు, పరిపాలనా దక్షుడు. పూర్వ జన్మ సుకృతం వల్ల, అతనిలో బాల్యం నుంచీ హరి భక్తి ఏర్పడింది. మనోవాక్కాయ కర్మలతో మహా విష్ణువునే ఆరాధించడం, అతనికి నిత్యకృత్యం అయింది. విష్ణు భక్తులను ఆదరిస్తూ, విష్ణు కీర్తనలను ఆలపిస్తూ, విష్ణు మందిరాన్ని పరిశుభ్రం చేస్తూ అతడు కాలం గడిపేవాడు. ఫలాపేక్ష లేకుండా, సరస్వతీ నదీ తీరంలో అనేక యజ్ఞాలు గావించి, రాజర్షి అనే పేరును కూడా పొందాడు అంబరీషుడు. కొంతకాలానికి అంబరీషుడు సంసార బంధాలకు అతీతుడై, సత్యమార్గంలో, ధర్మ నిష్టతో ప్రవర్తింపసాగాడు. విష్ణువు అతని భక్తికి మెచ్చి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయగల సుదర్శన చక్రాన్ని అతనికి ప్రసాదించాడు. అంబరీషుడు విష్ణుదేవుని కరుణా కటాక్షాలకు పొంగి పులకించాడు.

ఒకసారి అంబరీషుడు తన తోడూనీడ అయిన అర్థాంగి లక్ష్మితో కలసి, ద్వాదశ వ్రతాన్ని ఆచరించాడు. వ్రతాన్ని సంపూర్ణం చేయడానికి, కార్తీక మాసంలో మూడు రాత్రులు ఉపవాసం వుండి, విష్ణువును షోడశోపాచారాలతో అర్చించాడు. బ్రాహ్మణులకు గోవులను దానమిచ్చాడు. యధావిధిగా, వేదవేత్తలను ఆరాధించి, ద్వాదశీ పారాయణ చేయటానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో, భాసుర తపో విలాసుడూ, నిరంతర యోగాభ్యాసుడూ అయిన దుర్వాస మహర్షి అక్కడకు విచ్చేశాడు. అనుకోకుండా భోజన సమయానికి అరుదెంచిన అతిధి, సాక్షాత్తు విష్ణుమూర్తితో సమానమని పెద్దల ఉవాచ. తన ఇంటికి వచ్చిన అతిథికి అంబరీషుడు స్వాగతం పలికి, తగిన మర్యాదలు చేసి, తన ఆతిధ్యాన్ని స్వీకరించమని వేడుకున్నాడు. అందుకు ఎంతగానో సంతసించి, స్నానం చేసి వస్తానని యమునా నదికి వెళ్ళాడు, దుర్వాసుడు. అక్కడ స్నానానికై నీటిలోకి దిగి జపం మొదలుపెట్టి, ఆలస్యం చేశాడు. ఎండ మండిపోతున్నది. ద్వాదశీ పారాయణకు సమయం మించిపోతున్నది. ఆ సమయంలో పారాయణ చేయకపోతే, చేసిన వ్రతం అంతా వ్యర్దమైపోతుంది.

అటువంటి క్లిష్ట సయంలో ఏం చేయడానికీ తోచక, అంబరీషుడు పండితులనందరినీ పిలిపించి, విషయాన్ని వివరించాడు. తగిన ఉపాయాన్ని సూచించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడా విద్వాంసులందరూ ఆలోచించి, అతిధి రాలేదని అంబరీష మహారాజు, ద్వాదశీ పారాయణం మానకూడదు. ఆలాగని భోజనం చేయకూడదు. కనుక మధ్యేమార్గంగా జలపానం చేసినట్లయితే, ద్వాదశీవ్రత ఫలితం దక్కుతుందని, అతని ధర్మసందేహాన్ని తీర్చారు. అందుకు సంతోషించి, అంబరీషుడు నీటిని మాత్రమే కొద్దిగా త్రాగి, వ్రతాన్ని పూర్తి చేశాడు. కొంతసేపటికి తన అనుష్టానం ముగించుకుని దుర్వాసుడు రానే వచ్చాడు. జరిగిన సంగతి తెలుసుకుని, ఆగ్రహోదగ్రుడయ్యాడు. నన్ను భోజనానికి పిలిచి, నేను రాకముందే పారాయణ చేసి కూర్చుంటారా? అని పళ్ళు పటపట కొరికాడు. కనుబొమలు ముడివేసి, పెదవులు అదరుచుండగా, తన జట నొకదానిని ఊడపెరికి మంత్రించి, దానిని కృత్య అనే రాక్షసిగా మార్చాడు. అపార్ధంతో కూడిన అహంకారంతో హుంకరించి, ఆ కృత్యను అంబరీషుని మీదకు ప్రయోగించాడు. ప్రళయాగ్నిలాగా విజృంభించి, పెద్ద శూలాన్ని ధరించి, కృత్య భయంకర ఆకారంతో అంబరీషుని పైకి దూకింది.

అంతలోనే వెర్రిమొర్రి కోపంతో కేకలు పెడుతున్న దుర్వాసుడి దురహంకారాన్ని తుత్తునియలు చేయమని, మహావిష్ణువు తన చక్రాయుధాన్ని పంపించాడు. చక్రం రివ్వున వచ్చి, క్షణకాలంలో కృత్యను భస్మం చేసింది. అంతటితో ఆగక, అవక్రపరాక్రమము గల ఆ చక్రం, దుర్వాసుడి వెంట పడింది. ఆ ముక్కోపి దిక్కుతోచక, భయంతో పరుగెత్తసాగాడు. అతడు ఎక్కడెక్కడకు వెళ్ళితే, ఆ చక్రం అక్కడకు వెళ్ళింది. పాతాళానికి వెళితే పాతాళానికీ, సముద్రంలోకి ప్రవేశిస్తే సముద్రంలోనికీ, ఆకాశానికి వెళితే ఆకాశానికీ, దిక్కులకు పోతే దిక్కులకూ వెన్నంటి పోసాగింది. సుదర్శన చక్రపు అగ్నిజ్వాలలకు తట్టుకోలేక, గిలగిల కొట్టుకుంటూ, దుర్వాసుడు పరుగెత్తుతూ పోయి, సత్యలోకం చేరాడు. కాపాడమని బ్రహ్మదేవుని ప్రార్థించాడు. ఆయన సుదర్శన చక్రాన్ని మరల్చే శక్తి తనకు లేదన్నాడు. ఈశ్వరుడు, చక్రాన్ని ఉపసంహరించాలంటే ఆ చక్రధరుడే రావాలన్నాడు. దుర్వాసునికి దిక్కు తోచలేదు. విష్ణుమూర్తిని శరణు వేడడం కంటే, వేరే మార్గం లేదని నిర్ణయించుకున్నాడు.

శోకంతో ఆక్రోశిస్తూ, వెంటనే వైకుంఠానికి చేరాడు. లక్ష్మి సమేతుడైయున్న శ్రీమహావిష్ణువుకు, దుర్వాసుడు మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీహరి, "దుర్వాసా, నేను భక్త పరాధీనుణ్ణి. గోమాత వెంటనంటి నుండే గోవత్సలులాగా, నేను నా భక్తులను అనుసరిస్తుంటాను. అందువలన ఆ చక్రాన్ని ఉపసంహరించే శక్తి నాకంటే ఎక్కువగా, ఆ అంబరీషుడికే వుంది. వెంటనే వెళ్ళి అతన్ని ఆర్దించు" అని పంపించాడు. దుర్వాసమహర్షి తన అహంకారినికీ తన ప్రవర్తనకూ ఎంతగానో పశ్చాత్తాపపడ్డాడు. ఇక తప్పేదేముంది? అంబరీషుడే శరణ్యం. లేకుంటే చక్రజ్వాలామాలికలు తనను కాల్చివేస్తాయి. చకచకామని వెళ్ళి, అంబరీషుడిని "పాహి పాహి" అని ప్రార్థించాడు. సహజంగానే సాధు స్వభావుడైన అంబరీషుడు, దాయార్ద్ర హృదయుడై, దుర్వాసుణ్ణి ఓదార్చాడు. శాంతించమని చక్రాయుధాన్ని పరి పరి విధాలా స్తుతించాడు. చక్రం శాంతించి, ఆరోగమించగా, దుర్వాసుడి ప్రాణాలు కుదుటపడ్డాయి. ఆ ముని తన అవివేకానికి సిగ్గుపడ్డాడు. భక్తి ప్రభావాన్ని కన్నులారా చూశాడు. భక్తులంటే ఏమిటో, వారి శక్తి ఎంత గొప్పదో తెలుసుకొనగలిగాడు.

వెంటనే చేతులెత్తి, తనను క్షమించమని అంబరీషుడిని వేడుకున్నాడు. అంబరీషుడు దుర్వాసమహర్షికీ, వేదవేత్తలైన బ్రాహ్మణులకూ తృప్తిగా భోజనం పెట్టి, అనంతరం తన భార్యతో కలసి భుజించాడు. ద్వాదశీవ్రతం విజయవంతంగా పరి సమాప్తమయ్యింది. అంబరీషుని వద్ద సెలవు తీసుకుని, దుర్వాసుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. భక్తునికి భగవంతుడు ఏవిధంగా లోబడివుంటాడో, వారిద్దరికీ గల బంధం ఎటువంటిదో, అంబరీషుడి వృత్తాంతం వెల్లడిస్తుంది. అంతేకాదు, భగవంతునికంటే ఒక్కొక్కసారి, భక్తుడే శక్తిమంతుడని కూడా మనకు స్పష్టమవుతుంది. భగవంతుడిని ప్రభువుగా భావించి, సర్వకర్మలనూ ఆయనకే అంకితం చేయడం, నవవిధ భక్తి మార్గాలలో ఒకటైన ‘దాస్య భక్తి’గా పిలువబడుతుంది. దాస భక్తితో, స్వామికి దాసుడననే భావముతో సేవిస్తూ, భగవంతునికి దాసుడై, సర్వమూ ఆ భగవంతునికి అర్పించడమే దాస్యం. సప్తద్వీప విశాల భూభారాన్ని వహించి, విష్ణు సేవతో కాలం గడిపి, సద్గుణ సంశోభితుడైన అంబరీష చక్రవర్తి భక్తి, అటువంటి దాస్య భక్తికి ఒక ఉదాహరణ.

ఓం నమో భగవతే వాసుదేవాయ!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History