Roman Empire Gold Found in Sri Padmanabhaswamy Vaults! | రోమ్ పతనానికి మన భారత దేశమే కారణమా?


అనంత పద్మనాభుడి గుప్త నిధులలో రోమన్ నాణాలు ఏం నిరూపిస్తున్నాయి?
రోమ్ పతనానికి మన భారత దేశమే కారణమా?

ప్రపంచంలోనే అతిగొప్ప నాగరికత కలిగిన ప్రదేశంగా ‘రోమ్’ని అభివర్ణిస్తారు, పాశ్చాత్య చరిత్రకారులు. వారి నిర్మాణ శైలి, పాలనా విధానం, వారికున్న విజ్ఞానం మరెక్కడా లేదన్నట్లు చెప్పుకొస్తారు. ఇక ఆ రోమన్ జాతిలో పుట్టిన అలెగ్జాండర్ ని ఈనాటికీ విశ్వవిజేతగా అభివర్ణిస్తారు. ఈ విషయంపై మనం గతంలో చేసిన వీడియో లింక్ description లోనూ, icards లోనూ పొందుపరుస్తున్నాను. చూడనివారు తప్పక చూడండి. ఇక మన దేశం విషయానికొస్తే, ఆ పాశ్చాత్య చారిత్రకారులలో చాలా మంది, నేటికీ భారత దేశానికీ ఆఫ్రికా ఖండంలోని ఆటవిక రాజ్యాలకూ తేడా లేదనీ, రెండు ప్రాంతాలవారూ అడవులలో జీవించే వారిగానూ, పెద్దగా నాగరికత తెలియని మనుష్యులుగానూ భావిస్తుంటారు. వారి అహంకారాన్నీ, అంచనాలనూ తల్లక్రిందులు చేసే ఆధారాలు నేడు వెలుగులోకి వచ్చాయి. ఎంతో గొప్ప నాగరికతకు చిహ్నంగా భావిస్తున్న రోమ్ పతనం, మన భారత దేశం వల్లనే జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్న వీడియో ప్రకారం, వారి గొప్ప రాజైన అలెగ్జాండర్ కూడా మన దేశంలో ఘోర పరాజయం ఎలా ఉంటుందో రుచి చూశాడు. అలెగ్జాండర్ విషయం తెలుసిందే కానీ, రోమ్ పతనానికి భారత దేశం ఎలా కారణం అయ్యింది..? మన రాజులు రోమ్ పై దండ యాత్ర చేశారా, లేక మరేదైనా కారణాలున్నాయా..? అంత గొప్ప నాగరికత గల రోమ్ రాజ్యం, భారత దేశం వల్ల ఎలా నాశనమైంది..? వంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/95H973TONE4 ]


ఈ ప్రపంచంలోని అనేక నాగరికతలలో రోమన్ నాగరికతకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వారి ఆమోఘమైన కట్టడాలూ, ఆవిష్కరణలూ, భారీ సైన్యాలూ, యుద్ధాల గురించీ చరిత్రకారులు విశేషంగా చెబుతారు. ఆ కాలంలోనే యూరోప్ లో గల ఇటలీ, ఫ్రాన్స్ వంటి ఎన్నో ప్రాంతాలతో పాటు, ఈజిప్ట్ వరకు రోమ్ చక్రవర్తులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు చరిత్రద్వారా తెలుస్తోంది. అయితే, అంత గొప్ప సామ్రాజ్యం భారత దేశం వల్ల ఎలా నాశనం అయ్యిందనే సందేహానికి సమాధానం తెలియాలంటే, ఈ నాడు మన పాఠ్య పుస్తకాలలో ఉన్న చరిత్ర కాకుండా, మన భారత దేశానికి సంబంధించిన అసలైన చరిత్రను తెలుసుకోవాలి.

మన దేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది పోర్చుగీస్ కి చెందిన Vasco da Gama అనీ, అప్పటి వరకు భారతీయులు సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి సముద్రాన్ని వాడేవారు కాదనీ, అసలు మనకు నౌకాయానం పై పెద్దగా అవగాహన లేదనీ చెబుతూ వచ్చారు. కానీ అవన్నీ మన దేశ అసలు చరిత్రను దాచడానికి అల్లిన కట్టుకథలని నేడు బయటపడుతున్న చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి.

అసలు మన దేశానికీ, రోమ్ సామ్రాజ్యానికీ ఉన్న సంబంధం గురించి, నేటి భారతావనికి తెలిసేలా చేసింది, కేరళలోని అనంత పద్మనాభ స్వామి అని చెప్పుకోవచ్చు. కొన్నేళ్ళ క్రితం ఆ ఆలయంలోని నేలమాళిగలో దాగి ఉన్న బంగారాన్ని తీసి లెక్కలు కడుతున్న సమయంలో, కొన్ని నాణాలు అక్కడున్న అధికారుల దృష్టిని ఆకర్షించాయి. వాటిని బాగా పరీక్షించిన మీదట, అవి సామాన్య శకం కంటే ముందు మొదటి శతాబ్దంలో రోమన్స్ విరివిగా వాడిన Aureus అనే బంగారు నాణేలని తేలింది. దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం, ఎక్కడో ఉన్న రోమ్ లో అత్యంత విలువగల ఆ నాణాలు, వందల సంఖ్యలో మన దేశంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగలోకి ఎలా వచ్చాయనే సందేహం తలెత్తింది. ఆ ప్రశ్నే, కొన్ని వందల ఏళ్లుగా అణచబడి, కొన్ని దశబ్దాలుగా కుహనా మేధావుల చేత దాచబడిన అసలు చరిత్రను వెలికితీసేలా చేసింది.

ఈ క్రమంలో కొన్ని దశబ్దాల క్రితం, కేరళలో జరుగుతున్న పురావస్తు త్రవ్వకాలలో దొరికిన ఒక పురాతన డాక్యుమెంట్ వైపుకు, అందరి దృష్టీ మళ్ళింది. Muziris Papyrus గా పిలవబడే ఆ డాక్యుమెంట్, ప్రసూతం Vienna నగరంలో గల Austrian National Library లో ఉంది. ఆ డాక్యుమెంట్ ని ఎంతో జాగ్రత్తగా పరీక్షించిన చరిత్రకారులకు, తల తిరిగిపోయే నిజం తెలిసింది. Muziris Papyrus అనే డాక్యుమెంట్ నిజానికి ఒక shipping invoice అని తేలింది. అంటే ఒక ఓడ సరుకుతో ఒక చోట నుంచి మరో చోటుకి వెళ్తున్నప్పుడు, ఆ ఓడలో ఎలాంటి సరుకుంది? అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతోంది? ఏఏ దేశాలలో ఆ సరుకును దించబోతోందనే విషయాలన్నీ, ఆ shipping invoice లో ఉంటాయి. Muziris Papyrus ని పరిశీలించినప్పుడు, అది Hermapollon అనే అతి భారీ ship కి సంబంధించిన Invoice అనీ, ఆ ఓడలో దాదాపు రెండు టన్నుల బరువు ఉండే ఏనుగు దంతాలతో చేసిన ఆభరణాలూ, వివిధ రకాల వస్తువులూ, రోమన్స్ నల్ల బంగారంగా పిలుచుకునే నల్ల మిరియాలూ, పట్టు, సుగంధ ద్రవ్యాలలో ఉపయోగించే Nard అని పిలవబడే గడ్డి వంటి వస్తువులన్నీటినీ టన్నుల కొద్దీ తీసుకుని, కేరళ నుంచి ఈజిప్ట్ లోని Alexandria కి export చేస్తున్నట్లు లిఖించబడివుంది.

Muziris Papyrus లో ఉన్న విషయాలు చూసి ఖంగుదతిన్న పాశ్చాత్య చరిత్రకారులు, రోమ్ కీ భారత దేశానికీ ఉన్న సంబంధం గురించి మరింత లోతుగా పరిశీలించగా, మతి భ్రమించే ఎన్నో విషయాలు బయట పడ్డాయి. కొన్ని వేల ఏళ్ల క్రితమే భారత దేశానికి చెందిన వర్తకులు, రోమ్ లో భారీ ఎత్తున వర్తక వ్యాపారాలు చేసేవారు. ప్రతి సంవత్సరం కొన్ని వందల భారీ ఓడలు భారత దేశం నుంచి సుగంధ ద్రవ్యాలూ, పట్టు, కలప వంటి ఎన్నో వస్తువులు రోమ్ కి ఎగుమతి చేయబడేవని తెలిసింది.

ఆ కాలంలో నల్ల మిరియాలు, Nard అనే గడ్డి, భారత దేశంలో దొరికే పట్టు, పసుపు, అనేక సుగంధ ద్రవ్యాలు, ఆఖరికి అక్కడి శ్రీమంతులు, రాజులు, సైన్యాధికారులు వాడే విలువైన కత్తులు కూడా మన దేశం నుంచే వెళ్లేవి. ఇవన్నీ చాలా ఖరీదైన వస్తువులుగా రోమ్ లో పేరు పొందాయి. అంతేకాదు, ఆ కాలంలో భారత దేశం నుంచి వచ్చిన వస్తువులంటే రోమన్ లలో చాలా క్రేజ్ ఉండేదని తెలుస్తోంది. అవి ఎంతో ఖరీదైన వస్తువులు కావడంతో, కేవలం అక్కడి ధనికుల ఇళ్ళల్లో మాత్రమే ఉండేవి. ఆ వ్యామోహమే మన దేశ రాజులను మరింత ధనవంతులను చేస్తే, రోమ్ సామ్రాజ్య పతనానికి కారణమయ్యింది కూడా.

భారత దేశంలో దొరికే వస్తువులకు అక్కడ బాగా ప్రజాదరణ ఉండటంతో, రోమ్ వాసులు భారీ ఎత్తున మన వస్తువులను దిగుమతి చేసుకునేవారు. ఆ కాలంలో వస్తుమార్పిడి పద్ధతి బాగా అమలులో ఉండేది. మన దేశంలోని వస్తువు ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు, రోమ్ వాసులు వారి వస్తువులను ఇచ్చి తీసుకోవలసిన పరిస్థితి. అయితే  రోమన్లు తయారు చేసిన వస్తువులలో కేవలం కొన్ని రకాల పరికరాలు, ఇళ్ళల్లో అలంకరణకు వాడే వస్తువులు తప్పితే మన వారికి అవి ఏవీ పెద్దగా నచ్చేవి కావు. పైగా అవి మన సరుకు విలువకు సరితూగేవి కావు. దానితో రొమాన్లు వాటి విలువకు సరిపడే బంగారు నాణాలూ, ఆభరణాలూ, బంగారపు విగ్రహాలనూ ఇచ్చి, మన దగ్గరనుంచి వస్తువులను కొనుక్కునే వారు.

ఇంత గొప్ప చరిత్ర నేటి తరాలకు ఎందుకు తెలియదనే ప్రశ్న కలగవచ్చు. అందుకు సమాధానం, గత కొన్ని శతాబ్దాలుగా అన్ని విధాలుగా మనపై జరిగిన దాడులని చెప్పవచ్చు. ముస్లిం రాజుల పాలన మన దేశంలో మొదలైన తర్వాత, మన వారు తమ మాన ప్రాణాలనూ, ధర్మాన్నీ రక్షించుకోడానికే ఎక్కువ సమయాన్ని వెచ్చించారు. ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ పాలకులు, ఇక్కడ లభించిన సంపదను మొత్తం తమ దేశానికి తరలించి, మన వారిని కటిక దారిద్ర్యంలోకి నేట్టివేశారు. ఫలితంగా జీవన పోరాటంలో రోజులు ఎలా నెట్టుకు రావాలనే అయోమయంలో పడిపోయారు. ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చినా, ప్రభుత్వ పెద్దలూ, అధికారులూ, పాశ్చాత్యులకు తొత్తులుగా వ్యవహరించి, వారి కనుసన్నలలో ఇక్కడ పాలనా విధానాలను కొనసాగించారు. దానికి తోడుగా కుహనా మేధావులు మన పాఠ్య పుస్తకాలను సిద్ధం చేయడం, అసలు చరిత్రను దాచేయడం, ఏమిటని ప్రశ్నించిన వారిని అన్ని విధాలుగా అణచివేయడం, మరీ ఎదురు తిరిగితే ప్రాణాలను హరించివేయడం వంటివి చేసినట్లు ఆధారాలు బయటపడుతున్నాయి.

అసలు బ్రిటీషర్ల పాలనాకాలంలో కూడా మన దేశానికీ రొమన్స్ కీ వ్యాపార సంబంధాలు బాగుండెవని తెల్లతోళ్ళకి బాగా తెలుసు. వారు ఇక్కడి సంపదలను దోచుకు వెళ్ళే సమయంలో, రోమన్స్ కాలం నాటి బంగారు, వెండి నాణాలు, విలువైన Artefacts చాలా కనిపించాయి. వాటిని బ్రిటిష్ తొత్తులు సగటు భారతీయులకు తెలియకుండా దాచి ఉంచారు. 1842 లో, బ్రిటిష్ అధికారి అయిన Walter Elliot ఆధ్వర్యంలోని బృందం, తమిళనాడులోని కోయంబత్తూర్ లో కొన్ని చారిత్రక ప్రదేశాలలో త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు, వారికొక పెద్ద మందసం నిండా రోమన్ కాలం నాటి బంగారు నాణాలు దొరికాయి. ఎవ్వరికీ తెలియకుండా వారు ఆ నాణాలను బ్రిటన్ కి తరిలించేశారు. 1940 లలో Sir Mortimer Wheeler అనే అధికారి పాండిచ్చేరి లోని Arikamedu దగ్గరి పురాతన పోర్ట్ ప్రాంతంలో త్రవ్వకాలు జరిపించగా, అక్కడ ఎన్నో రోమన్ Artefacts, నగలు, ముత్యాల హారాల వంటివి బయటపడ్డాయి. వాటిపై పరిశోధన చేయగా, అవన్నీ దాదాపు మొదటి, రెండవ శతాబ్ద కాలానికి చెందినవని తేలింది. Arikamedu లో దిరికిన ఈ ఆధారాలు, భారత దేశానికీ రోమ్ సామ్రాజ్యానికీ మధ్య ఉన్న సంబంధాలపై మరింత లోతుగా అన్వేషణ జరిగేలా చరిత్రకారులను ప్రేరేపించింది.

ఈ క్రమంలో Periplus of the Erythraean Sea అనే పుస్తకం, పరిశోధకులకు దొరికింది. Koine Greek భాషలో రాయబడిన ఆ పుస్తకంలో, రోమన్ సామ్రాజ్యానికీ భారత దేశానికీ మధ్య జరిగిన ట్రేడ్ గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అంతేకాదు, సామాన్యశక పూర్వం 27 వ సంవత్సరంలో రోమ్ సామ్రాజ్యాన్ని పాలించిన King Augustus కాలంలో కూడా, వారికి భారత దేశంతో వ్యాపార లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగినట్లు చరిత్రకారులు గుర్తించారు. ఏనుగు దంతాలూ, వాటితో చేసిన వివిధ ఆభరణాలూ, వస్తువులూ, నల్ల మిరియాలూ, యాలకులూ, దాల్చిన చెక్క, పసుపు, Nard, చందనం, ఎర్ర చందనం, అల్లం వంటి వాటితో పాటు, నాడు మన దేశంలో మాత్రమే దొరికే వజ్రాలు, రంగు రాళ్ళు, ముత్యాలు, పట్టు వస్త్రాలు, మరియూ పట్టు దారాలు కూడా ఎగుమతి చేసేవారు. నాడు రోమ్ పాలకులూ, ధనవంతులూ ధరించిన వస్త్రాలన్నీ, భారత దేశం, అలాగే చైనా నుంచి దిగమతి చేసుకున్న పట్టు దారాలతో నేసినవే అని, చరిత్రకారులు చెబుతున్నారు. ఇక అక్కడి మహిళలు భారత దేశంలో దొరికే ముత్యాలంటే బాగా ఇష్టపడేవారు. వారి అభారణాలన్నీ మన దేశం నుంచి దిగుమతి చేసుకున్న వజ్రాలు, విలువైన పచ్చలు, కెంపులు, నీలాలు వంటి రంగు రాళ్ళతో తయారు చేయించుకునేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే, రోమన్స్ మన దగ్గర నుంచి కొనుక్కున్న వస్తువుల చిట్టా చాలా పెద్దదే.

అప్పట్లో ఈ వ్యాపారం మొత్తం రెండు విధాలుగా జరిగేది. ఒకటి రోడ్డు మార్గంలో సిల్క్ రోడ్డు ద్వారా ఉత్తర భారత దేశంలోకి వచ్చి, అక్కడి నుంచి వారికి కావాల్సిన వస్తువులు పట్టుకు వెళ్ళేవారు, లేదా ఈజిప్ట్ లోని Alexandria నగరం నుంచి దక్షిణ భారత దేశంలోని అనేక పోర్ట్ సిటీస్ కి, మన దేశ వర్తకులూ, రోమన్ వర్తకులూ ఓడల ద్వారా వర్తకం చేసేవారు. Alexander ఈజిప్ట్ ని మొత్తం తన గుప్పెట పెట్టుకుని, Alexandria నగరాన్ని స్థాపించక ముందు, Egyptian వర్తకులూ, భారతీయ వర్తకులూ ఈ వ్యాపారం చేసేవారు. ఇలా ఈజిప్ట్ వరకు వెళ్ళిన వస్తువులు, వివిధ మార్గాల ద్వారా రోమన్ ప్రజలకు చేరేవి. అయితే, Alexander తరువాత నేరుగా రోమన్ వర్తకులే భారత దేశంతో వర్తకం అభివృద్ధి చేసుకున్నారు.

మరి ఇంత గొప్పగా వ్యాపారం జరుగుతున్నప్పుడు, రోమ్ మన వల్ల ఎలా నాశనం అయ్యిందనే సందేహం కలుగుతుంది. దానికి సమాధానం కూడా ఈ వర్తకంలోనే ఉంది. ఆ కాలంలో రొమాన్స్ కి భారతీయ వస్తువులపై విపరీతమైన క్రేజ్ ఉండేది. దాంతో వారు పెద్ద ఎత్తున మన దగ్గర నుంచి వస్తువులు తీసుకు వెళ్ళేవారు. కానీ మనం ముందుగా చెప్పుకున్నట్టు, మన దేశంలో రోమన్ గూడ్స్ కి పెద్దగా ఆకర్షణ లేకపోవడంతో, వాళ్ళు మన దగ్గర తీసుకున్న ప్రతి వస్తువుకూ బంగారం, లేదా వెండి నాణాలు ఇచ్చి తీసుకు వెళ్ళేవారు. దానితో మన దేశానికి భారీగా ఆదాయం వచ్చేది కానీ, రోమ్ కి మాత్రం పెద్దగా లాభాలు ఉండేవి కావు. దీనినే trade deficit గా నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని లెక్కల ప్రకారం, ఆ కాలంలో రోమ్ నుంచి భారత దేశానికి కేవలం బంగారం మాత్రమే, 13 నుంచి 14 టన్నుల వరకు వచ్చేదని చరిత్రకారులంటున్నారు. ఇలా ఎన్నో వందల ఏళ్లు, ఇంకా చెప్పాలంటే రెండు వేల ఏళ్ల పాటు ట్రేడ్ జరిగిందని, ఆధారాలు లభ్యమయ్యాయి. ఇలా రోమ్ లోని బాగారు నిల్వలు పెద్ద ఎత్తున కరిగిపోతూ వచ్చాయి.

మన దగ్గరకి వచ్చిన రోమన్ బంగారు, వెండి నాణాలను కరిగించి ఆభరణాలు చేయడం, వాటిపైనున్న రోమన్ అక్షరాలను చెరిపేసి, ఆయా రాజ్యాల నాణాలుగా చలామణీ చేయడం మొదలు పెట్టారు. ఇలాంటి నాణాలు మన దేశంలో ఎన్నో దొరికాయి. అయితే, ఈ trade deficit ని పసిగట్టిన రోమన్ పెద్దలు, అక్కడి అధికారులనూ, ధనవంతులనూ భారత్ నుంచి ట్రేడ్ చేయవద్దని ఎన్నో సార్లు ఆదేశించారు. ఒకానొక సమయంలో భారత్ తో వ్యాపారాన్ని బ్యాన్ చేసినట్లు కూడా చరిత్రకారులు గుర్తించారు. అప్పట్లో రోమ్ పాలన మొత్తం ధనవంతుల చేతుల్లోనే ఉండేది. వారి అండ లేకపోతే ఏ రాజూ ఎక్కువ కాలంపాటు పాలన కొనసాగించలేకపోయేవాడు. ఆ ధనవంతులకు భారతీయ వస్తువులపై విపరీతమైన మోజు ఉండటంతో, వారిని ఆపడం అక్కడి నాయకుల వల్ల కాలేదు. భారత దేశంతో జరుగుతున్న వ్యాపారాలను కట్టడి చేయడంలో, రోమన్ రాజులు విఫలమవ్వడానికి మరో కారణం, ఆ ట్రేడ్ ద్వారా వచ్చే పన్నులని చెప్పుకోవచ్చు. కొన్ని లెక్కల ప్రకారం, నాటి రోమ్ ఆదాయంలో దాదాపు మూడవ వంతు భారత దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై వేసే పన్నుల ద్వారానే వచ్చేదని, చరిత్రకారులు గుర్తించారు.

నాటి రోమన్ కమాండర్, రచయిత, Pliny The Elder అనే వ్యక్తి, భారత దేశం వల్ల రోమ్ నాశనం అవుతోందని ఆవేదన చెందేవాడు. ఈ విషయాన్ని అతను రాసిన Naturalis Historia అనే పుస్తకంలో పొందు పరిచాడు. అయినా అతని మాటను ఎవరూ పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే, రోమ్ లో బలహీన పడుతున్న నాయకత్వం, అంతర్గతంగా జరుగుతున్న గొడవలు, యుద్ధాలు, మరో పక్క భారీ ఎత్తున వర్తకం రూపంలో బంగారం భారత దేశానికి తరలిపోవడంతో, సామాన్యశకం మూడవ శతాబ్దికాలానికి బంగారం కొరత ఏర్పడింది. దానితో అక్కడి నాయకులు బంగారం, వెండికి బదులు.. ఇత్తడి, రాగి నాణాల ముద్రణ చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ నాణాలకు భారత దేశంలో విలువ లేకపోవడంతో, క్రమక్రమంగా రోమ్ తో ఉన్న వ్యాపారం మందగిస్తూ వచ్చింది.

ఇదే క్రమంలో రోమ్ లో జరిగిన యుద్ధాలూ, ఇతర రాజ్యాలు బలం పుంజుకోవడంతో, వైభవోపేతమైన రోమ్ నాగరికత సమూలంగా తుడిచిపెట్టుకుపోయింది. దానితో పశ్చిమ దేశాలకూ, మనకూ మధ్య జరుగుతున్న వ్యాపారాలు కూడా దాదాపుగా పడిపోయాయి. అదే సమయంలో మన దేశంపై జరిగిన ముస్లిం దండయాత్రలు, రోమ్ తో మనకున్న సంబంధాలను పూర్తిగా చెరిపేసినట్లు చరిత్రకారుల అభిప్రాయం.

🚩 ॐ నమో నారాయణాయ 🙏

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess