The Lost Vedic Temple Found in Turkey? | 12,000 Year Old Mystery Explained in Telugu గోబెక్లీ టెపే

 

The Lost Vedic Temple Found in Turkey? | 12,000 Year Old Mystery Explained in Telugu

12000 ఏళ్ల నాటి రహస్యం: గోబెక్లీ టెపే మరియు వేదాల మధ్య ఉన్న సంబంధం!
చరిత్ర గతిని మార్చిన గోబెక్లీ టెపే: వైదిక సంస్కృతికి మూలాలు అక్కడే ఉన్నాయా?
The Lost Vedic Temple Found in Turkey? | 12,000 Year Old Mystery Explained in Telugu

మనం చిన్నప్పటి నుంచి చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నది, మానవ నాగరికత సుమారు 5,000 లేదా 6,000 ఏళ్ల క్రితం మెసొపొటేమియాలోనో, ఈజిప్టులోనో మొదలైందనీ, మనుషులు అంతకుముందు కేవలం వేటగాళ్లుగా అడవుల్లో తిరిగేవారని మనకు నూరిపోశారు.

కానీ... ఆ చరిత్ర అంతా తప్పు అని చెబితే?

టర్కీలోని అనటోలియా ప్రాంతంలో దొరికిన కొన్ని రాతి కట్టడాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. అదే 'గోబెక్లీ టెపే' (Göbekli Tepe). ఇది ఈజిప్ట్ పిరమిడ్ల కంటే 7,000 ఏళ్లు పురాతనమైనది. స్టోన్‌హెంజ్ కంటే 6,000 ఏళ్లు పాతది.

అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఈ గోబెక్లీ టెపే నిర్మాణ శైలికీ, అక్కడ దొరికిన చిహ్నాలకూ, మన భారతీయ వైదిక సంస్కృతికీ (Vedic Culture) మధ్య ఆశ్చర్యకరమైన పోలికలు ఉన్నాయి.

ఈరోజుటి మన వీడియోలో, సుమారు 12,000 ఏళ్ల క్రితం నాటి ఈ అద్భుతమైన కట్టడం వెనుక మన సనాతన ధర్మం లేదా వైదిక సంస్కృతి ఆనవాళ్లు ఉన్నాయా? చరిత్రకారులు దాస్తున్న ఆ సంబంధం ఏంటి? వంటి విషయాలను డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాము.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/lcSxPp7vV4Q ]


ముందుగా అసలు గోబెక్లీ టెపే అంటే ఏంటో తెలుసుకుందాము. 1994లో క్లాస్ స్కిమ్మిడ్ట్ అనే జర్మన్ ఆర్కియాలజిస్ట్ బృందం, టర్కీలోని ఒక కొండపై త్రవ్వకాలు జరిపారు. అప్పుడక్కడ బయటపడిన దృశ్యం చూసి ప్రపంచం నివ్వెరబోయింది.

వందల కొద్దీ భారీ రాతి స్తంభాలు (Pillars) ఉన్నాయక్కడ. ఒక్కోటి 20 అడుగుల ఎత్తు, దాదాపు 10 టన్నుల బరువు. ఇవన్నీ ఒక వృత్తాకారంలో (Circle) అమర్చబడి ఉన్నాయి. కార్బన్ డేటింగ్ చేస్తే తేలింది, అవి సామాన్యశక పూర్వం 9600 సంవత్సరాల నాటివని! అంటే ఇప్పటికి సుమారు 11,600 ఏళ్లు గడచినట్లు.

ఆధునిక సైన్స్ పరంగా ఆ కాలంలో మనిషికి వ్యవసాయం తెలియదు, లోహాలు (Metals) తెలియవు, చక్రం (Wheel) కూడా కనుగొనబడలేదు. మరి సుత్తి, ఉలి లేకుండా ఇంత భారీ రాళ్లను ఎలా చెక్కారు? అసలు ఎందుకు కట్టారు? స్కిమ్మిడ్ట్ దీనిని 'The World's First Temple' అంటే, ‘ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం’ అని పేర్కొన్నారు.

కానీ ఈ దేవాలయంలో ఉన్న బొమ్మలు... రాబందులు (Vultures), పాములు (Snakes), ఎద్దులు (Bulls)... ఇవే ఇప్పుడు మన టాపిక్‌కి ప్రధాన ఆధారం.

ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. గోబెక్లీ టెపేకీ, వైదిక సంస్కృతికీ లింక్ ఎక్కడ ఉంది? నేను చెప్పే ఈ 3 పాయింట్స్ నీ గమనించండి.

Point 1: T-Shaped Pillars & Yupa Stambha

గోబెక్లీ టెపేలో ఉన్నవన్నీ 'T' ఆకారపు రాతి స్తంభాలు. ఇవి చేతులు, బెల్టులు చెక్కి ఉన్నాయి కాబట్టి, మనుషులకు ప్రతీకలు అని ఆర్కియాలజిస్టులు నమ్ముతున్నారు. మన వేదాల్లో 'యజ్ఞం' చేసేటప్పుడు 'యూప స్తంభం' (Yupa Stambha) అని ఒక స్తంభాన్ని పాతుతారు. అది కూడా దేవతలను ఆహ్వానించడానికి వాడే ఒక స్తంభం. గోబెక్లీ టెపే డిజైన్, ప్రాచీన వైదిక యజ్ఞశాలల డిజైన్‌ను పోలి ఉందని కొంతమంది పరిశోధకుల వాదన.

Point 2: The Animals (Vahana Concept)

అక్కడ పిల్లర్స్ మీద రకరకాల జంతువుల బొమ్మలు ఉన్నాయి. ముఖ్యంగా రాబందు (Vulture), పాము (Snake), ఎద్దు (Bull).

రాబందు: మన పురాణాల్లో గరుత్మంతుడిని (Garuda) పోల్చుతున్నారు.
పాము: దేవతా సర్పం (Nagas) లేదా కుండలిని శక్తి.
ఎద్దు: నంది లేదా వృషభం. ఇవి కేవలం జంతువులు కాదు, నక్షత్ర మండలానికి అంటే, Constellations కి సంకేతాలని ఒక థియరీ ఉంది. భారతీయ జ్యోతిష శాస్త్రంలో కూడా జంతువులను రాశులుగా, నక్షత్రాలుగా పోల్చడం మనకు తెలిసిందే..

Point 3: The 'Saptarishi' Connection

గోబెక్లీ టెపేలో 7 ప్రధానమైన పిల్లర్స్ లేదా ఎన్‌క్లోజర్స్ ఉన్నాయనీ, ఇవి సప్తర్షుల (Seven Sages) కాన్సెప్ట్‌కి దగ్గరగా ఉన్నాయనీ, ఆల్టర్నేటివ్ హిస్టరీ పరిశోధకులు అంటున్నారు. మంచు యుగం (Ice Age) చివరలో, అంటే సైన్స్ పరంగా సా.శ.పూ 10,000 సంవత్సరాల సమయంలో, సప్తర్షులు జ్ఞానాన్ని పంచారని మన పురాణాలు చెబుతున్న విషయాన్ని పేర్కొంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఈ టెంపుల్ కట్టబడింది. ఇది కాకతాళీయమా?

ఇప్పటిదాకా మనం రాళ్లను చూసాము. కానీ గోబెక్లీ టెపే రహస్యం భూమి మీద లేదు... అది మన తలల పైన, ఆకాశంలో ఉంది!

దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం Pillar 43 దగ్గరకు వెళ్లాలి. దీన్నే ఆర్కియాలజిస్టులు 'The Vulture Stone' అని పిలుస్తారు. దీని మీద ఒక వింతైన చిత్రం ఉంది. ఒక రాబందు (Vulture), ఒక తేలు (Scorpion), ఒక బాతు, మరియు తల లేని ఒక మనిషి బొమ్మ.

సాధారణ చరిత్రకారులు ఇవి కేవలం వేట దృశ్యాలు అనుకున్నారు. కానీ, ఎప్పుడైతే మార్టిన్ స్వెట్‌మన్ (Martin Sweatman) అనే ఇంజనీర్ దీన్ని ఆస్ట్రానమీ సాఫ్ట్‌వేర్‌తో డీకోడ్ చేశారో... మైండ్ బ్లోయింగ్ నిజం బయటపడింది.

ఈ పిల్లర్ మీద ఉన్న ప్రతి జంతువు... ఒక నక్షత్ర రాశికి (Constellation) సంకేతం!

ఇక్కడ ఉన్న తేలు (Scorpion)... మన వృశ్చిక రాశిని (Scorpio Constellation) పోలి ఉంది. ఇక్కడ ఉన్న రాబందు... సిగ్నస్ (Cygnus) లేదా లైరా (Lyra) నక్షత్ర మండలం. మధ్యలో ఉన్న ఆ గుండ్రటి చక్రం... సూర్యుడు!

కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే... ఈ నక్షత్రాలన్నీ ఈ పొజిషన్‌లో ఎప్పుడు ఉన్నాయి? అని కంప్యూటర్‌లో రివర్స్ చేసి చూస్తే... అది కచ్చితంగా సామాన్యశక పూర్వం 10,950 నాటి ఆకాశం! అంటే, సరిగ్గా 'యంగర్ డ్రైయాస్' (Younger Dryas) అనే మంచు యుగం మొదలైన రోజు అది. ఒక భారీ తోకచుక్క (Comet) భూమిని ఢీకొట్టిన సమయం అది.

మరి దీనికీ మన వేదాలకూ సంబంధం ఏంటి? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.

స్వాతంత్ర్య సమరయోధులు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, గొప్ప ఖగోళ శాస్త్రవేత్త (Astronomer) కూడా. ఆయన రాసిన 'The Orion' అనే పుస్తకంలో ఒక సంచలనాత్మక విషయం చెప్పారు.

ఋగ్వేదంలోని అనేక శ్లోకాలు, ఆ నాటి గ్రహ స్థితులను (Planetary Positions) వర్ణిస్తాయి. తిలక్ గారి ప్రకారం, వేదాల్లోని కొన్ని సంఘటనలు జరగాలంటే, వసంత ఋతువు అంటే Vernal Equinox అనేది మృగశిర నక్షత్రం అంటే, Orion లో జరిగి ఉండాలి. అంటే, సుమారు సా.శ.పూ 4,500 నుండి 6,000 సంవత్సరాల మధ్య కాలం.

కానీ గోబెక్లీ టెపే అంతకంటే పాతది. అయితే, ఇక్కడ ఉన్న ఇంట్రెస్టింగ్ లింక్, 'ప్రజాపతి' (Prajapati).

ఐతరేయ బ్రాహ్మణం (Aitareya Brahmana) లో ఒక కథ ఉంది. ప్రజాపతి అంటే సృష్టికర్త ఒక ఆడ జింక రూపంలో ఉన్న తన కూతురిని మోహించినప్పుడు, దేవతలు కోపించి రుద్రుడిని సృష్టించారు. రుద్రుడు బాణం ఎక్కుపెట్టి ప్రజాపతిని వెంబడించాడు.

ఇది పురాణ కథలా అనిపించొచ్చు. కానీ ఆస్ట్రానమీ ప్రకారం చూస్తే... ప్రజాపతి అంటే ఓరియన్ లేక మృగశిర (Orion/Mrigasira), రుద్రుడు అంటే సిరియస్ లేక ఆరుద్రా (Sirius/Ardra) నక్షత్రం.

ఆకాశంలో సిరియస్ నక్షత్రం ఎప్పుడూ ఓరియన్‌ ను తరుముతున్నట్టే ఉంటుంది. గోబెక్లీ టెపేలో ఉన్న ప్రధానమైన పిల్లర్స్ అన్నీ కూడా దక్షిణం వైపు, అంటే ఈ ఓరియన్ మరియు సిరియస్ నక్షత్రాలు ఉదయించే దిశగానే కట్టబడ్డాయి!

దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతోంది? టర్కీలో ఉన్న ఈ పురాతన మానవులు, మన వేద ఋషులను పోలి ఉన్నారు. ఇద్దరూ ఒకే ఆకాశాన్ని, ఒకే నక్షత్రాలను, ఒకే కథతో ఆరాధించారా? గోబెక్లీ టెపే ప్రజలు ఆరాధించిన ఆ 'ఆకాశ దేవుడు' మరెవరో కాదు, వైదిక రుద్రుడా?

ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గోబెక్లీ టెపేలో పిల్లర్స్ మీద, చేతులు పొట్ట మీద పెట్టుకున్నట్లు ఉంటాయి. సరిగ్గా ఇదే భంగిమలో మనకు హరప్పా, మొహంజదారోలో దొరికిన 'పశుపతి' (Pashupati) విగ్రహం ఉంటుంది. అంతెందుకు, వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారి విగ్రహంలో ఎడమ చేయి కూడా ఇదే పొజిషన్‌లో కనిపిస్తుంది.

ఇది కేవలం యాదృచ్ఛికమా? లేక, 12,000 ఏళ్ల క్రితం ఒక గొప్ప ప్రళయం వచ్చినప్పుడు, ఆ విజ్ఞానాన్ని రాబోయే తరాలకు అందించడానికి, మన ఋషులు ఈ రాతి కట్టడాలను లైబ్రరీలాగా మార్చారా?

గోబెక్లీ టెపే పిల్లర్ 43 అనేది... మనిషి రాసిన మొట్టమొదటి 'హచ్చరిక లేఖ' (Warning Letter). 'ఆకాశం వైపు చూడండి, ప్రమాదం అక్కడి నుంచే వస్తుంది' అని వాళ్లు చెప్పకనే చెప్పారు. మన వేదాల్లో ఇంద్రుడు 'వజ్రాయుధంతో' పర్వతాలను పగులగొట్టాడని ఉంటుంది. ఆ వజ్రాయుధం భూమిని ఢీకొట్టిన ఆ తోకచుక్కేనా?"

అందుకేనేమో... గోబెక్లీ టెపేని ఎవరో దాడి చేసి పడగొట్టలేదు. ఆ ప్రజలే స్వయంగా, చాలా జాగ్రత్తగా, టన్నుల కొద్దీ మట్టిని తెచ్చి ఆ గుడిని కప్పేశారు. భవిష్యత్తులో ఎప్పుడైనా మనిషి మళ్ళీ జ్ఞానాన్ని పొందినప్పుడు, దీన్ని తవ్వి అసలు నిజాన్ని తెలుసుకుంటాడని వాళ్ళ ఆశ కావచ్చు. ఆ నిజం ఇప్పుడు మన కళ్ల ముందు ఉంది.

బాల గంగాధర్ తిలక్ గారు రాసిన 'The Arctic Home in the Vedas' పుస్తకంలో, రుగ్వేదంలోని శ్లోకాలను బట్టి, ఆర్యులు లేదా వైదిక ప్రజలు ఒకప్పుడు ధృవ ప్రాంతాలకు దగ్గరగా ఉండేవారని ఆయన ప్రతిపాదించారు.

గోబెక్లీ టెపేలో ఉన్న 'Vulture Stone' (Pillar 43) మీద ఉన్న చిత్తరువులు, ఆనాటి నక్షత్రాల స్థితిగతులను (Star map) చూపిస్తున్నాయని సైంటిస్టులు ఈ మధ్యే కనుగొన్నారు. అది కచ్చితంగా సా.శ.పూ 10,950 ఏళ్ల నాటి ఆకాశం. మన వేదాల్లో 'ప్రజాపతి'ని (Creator) మృగశిర నక్షత్రం లేదా ఓరియన్ (Orion) రూపంలో ఆరాధిస్తారు. గోబెక్లీ టెపే ఓరియన్ బెల్ట్‌కి అనుగుణంగా కట్టబడిందని ఒక బలమైన వాదన ఉంది. అంటే, ఆనాటి ప్రజలు, మన వేదాల్లో చెప్పబడిన ఖగోళ శాస్త్రాన్నే (Astronomy) ఫాలో అయ్యారా?

చివరగా, దీని అర్థం గోబెక్లీ టెపేని కట్టింది భారతీయులేనా? అని మీరు అడగవచ్చు. దానికి కచ్చితమైన ఆధారం లేదు. కానీ... చరిత్ర మనం అనుకున్నంత సరళమైనది కాదు. వేదాలు కేవలం మత గ్రంథాలు కాదు. అవి అంతకు ముందు ఉండి, అంతరించిపోయిన ఒక గొప్ప నాగరికత (Lost Civilization) తాలూకు విజ్ఞాన సర్వస్వం అని అర్ధమవుతోంది. వేదాలు సృష్టి ఆది నుంచీ ఉన్నాయని మనకు తెలిసినా, ఇలా చెప్పుకోవడం, సైన్స్ పరమైన చర్చ మాత్రమే అని సహృదయులు గమనించాలి.

అయితే, అసలు భారతదేశంలోని వైదిక సంస్కృతి టర్కీ దాకా ఎలా వెళ్ళింది? దీనికి సమాధానం మన శ్రీమద్భాగవత పురాణంలోనే దొరుకుతుంది.

భాగవతం ప్రకారం, ఎప్పుడైతే క్షత్రియులు ధర్మం తప్పి ప్రవర్తించడం మొదలుపెట్టారో, అప్పుడు శ్రీ మహావిష్ణువు పరశురాముడిగా అవతరించాడు. ఆయన ఇరవై ఒక్క సార్లు భూమండలంపై దండయాత్ర చేసి, దుర్మార్గులైన రాజులను శిక్షించాడు.

ఆ సమయంలో... పరశురాముడి గొడ్డలి దెబ్బకు భయపడి, భరతవర్షం (India) నుండి అనేకమంది క్షత్రియ రాజులు ప్రాణభయంతో విదేశాలకు పారిపోయారు. మన పురాణాలు వీరినే 'మ్లేచ్ఛులు' (Mlechas) లేదా 'యవనులు' (Yavanas) అని పేర్కొన్నాయి.

సైన్స్ ప్రకారం చూసినా, చరిత్ర ప్రకారం చూసినా... బహుశా గోబెక్లీ టెపే నిర్మించింది ఆ పారిపోయిన రాజులే కావచ్చు కదా? వారు తమతో పాటు వైదిక సంస్కృతిని, యజ్ఞయాగాదుల పద్ధతులను అక్కడికి తీసుకెళ్లారు. కానీ కాలక్రమేణా, ఆ సంప్రదాయాలు మార్పులకు లోనై, ఇలా రాతి కట్టడాలుగా మిగిలిపోయి ఉండవచ్చు.

అంటే, సనాతన ధర్మం ఒకప్పుడు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు, అది ప్రపంచమంతటా విస్తరించి ఉండేది అని తెలుస్తోంది. కాల గర్భంలో కప్పబడిపోయిన ఆ గొప్ప చరిత్రకు గోబెక్లీ టెపే ఒక మౌన సాక్ష్యం మాత్రమే! సింధు నాగరికత (Indus Valley) కంటే వేల ఏళ్ల ముందే, ఒక గొప్ప జ్ఞానం ప్రపంచమంతా ఉందని మరోసారి నిరూపితమవుతోంది.

దీనిపై మీ అభిప్రాయం ఏంటి? గోబెక్లీ టెపే, వైదిక సంస్కృతికి ప్రతిరూపమా? కామెంట్స్‌లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ హిస్టరీ మిస్టరీల కోసం మన ఛానెల్‌ని సబ్స్‌క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి.

జై హింద్! లోకా సమస్తా సుఖినో భవంతు..

Comments

Related articles

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి? Garuda Puranam

అష్టదిగ్బంధనం! Ashta Digbandhanam - Arunachaleswara, Tiruvannamalai

11 భయంకరమైన అస్త్రాలు! మహాభారతం Mahabharatam

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!

37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? Siva Ratri Puja

గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka