A Fight, A Boon & A Curse led to MAHABHARATA War
ఒక యుద్ధం, ఒక వరం, ఒక శాపం!
ఈ మూడే కురుక్షేత్ర సంగ్రామానికి అసలు కారణాలా?
భారతీయ చరిత్రలో ఓ ఉత్కృష్ట ఘట్టం, 5000 ఏళ్ల పూర్వం సంభవించిన ‘కురుక్షేత్రం’. ప్రపంచ మానవాళి గతిని మార్చిన ఘట్టమది. ఈ భూమిపైనున్న రాజ్యాలన్నిటి సేనలనూ ఒక్క చోటికి చేర్చిన ఘట్టం.. మానవ జీవన విధానాన్ని సమూలంగా మార్చేసిన ఘట్టం, కలియుగారంభానికి బాటలు వేసిన ఘట్టం.. ఇలా కురక్షేత్ర సంగ్రామం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. అంతటి మహోన్నత ఘట్టానికి దారి తీసిన విషయాలు మాత్రం, ఒక యుద్ధం, ఒక వరం, ఒక శాపం అని ఎంతమందికి తెలుసు? ఈ మాటలు వినగానే, అదేంటి? దుర్యోధనుడు శకునితో కలిసి పన్నిన మయోపాయం కారణంగా ధర్మ రాజు జూదంలో ఓటమి పాలై, చివరకు కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసిందని మన గ్రంధాలు చెబుతున్నాయి కదా! మరి ఈ యుద్ధం, వరం, శాపం కారణంగా కురుక్షేత్ర యుద్ధానికి బాటలు పడడమేమిటి? అనే సందేహం కలగడం సహజం. అది ఎలాగో తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/GO-ga4EWTfI ]
భారత దేశ చరిత్రలో జరిగిన మహోన్నత చారిత్రక ఘట్టం మహాభారతం. కురు వంశ మూల పురుషుడైన పురూరవుడి ప్రేమ గాథ నుంచి, కరుక్షేత్ర యుద్ధం వరకు జరిగిన ఎన్నో సంఘటనలూ, మధురమైన ప్రేమ గాథలూ, మహా యుద్ధాలూ, చరిత్ర ఎరుగని నిర్ణయాలూ, ఇలా సంపూర్ణ వ్యాస లిఖిత మహా భారతం ఆద్యంతం అమోఘం, మహాద్భుతం. మాహాభారతమంటే, కేవలం కురు పాండవుల మధ్య తగాదా మాత్రమే కాదు.. యుగయుగాల చరిత్ర, మానవ లోకానికి నాంది, ధర్మాధర్మ విచాక్షణను తెలియజేసే వాస్తవిక గాధలకు అది మూల శాస్త్రం. దేవతల నుంచి మొదలై, చంద్రవంశ స్థాపనతో ఒక దారికి వచ్చి, అభిమన్యుడి కొడుకైన పరీక్షిత్తు మహారాజు దగ్గర దాదాపుగా ముగిసింది ద్వాపర యుగం.
పరీక్షిత్తు మహారాజు తర్వాత కూడా చంద్ర వంశం కొనసాగినా, ఆ చరిత్రను మహాభారత కావ్యంలో ప్రస్తావించలేదు. ఒక విధంగా చెప్పాలంటే, పరీక్షిత్తు మహారాజు మరణంతోనే కలియగం మొదలై, కలి తన ప్రభావాన్ని మానవ లోకంపై పూర్తిగా వ్యాప్తి చేయడం మొదలు పెట్టినట్లు, మహాభారత, భాగవత గ్రంధాలు పేర్కొంటున్నాయి. మహాభారతం యొక్క సంపూర్ణ చరిత్రను గురించిన కనీస అవగాహన ఉంటేనే, కురుక్షేత్ర యుద్ధానికి కారకమైన ఆ మూడు విషయాల వెనకవున్న కారణాలు తెలుస్తాయన్న ఉద్దేశంతో ఇవన్నీ క్లుప్తంగా చెప్పుకున్నాము.
ఇక కరుక్షేత్ర ఘట్టానికి దారి తీసిన ఆ మూడు కారణాల విషయానికి వస్తే, ప్రతి ఒక్కరికీ తెలిసిన ఘట్టం, దుర్యోధన, ధర్మ రాజుల మధ్య జరిగిన మాయాజూదం. మనం చెప్పుకోబోతున్న ఆ మూడు విషయాలకూ మూలం ఒక విధంగా ఇక్కడి నుంచే మొదలైంది. చిన్న తనం నుంచీ పాండవులపై అమిత ఈర్ష్యాద్వేషాలను పెంచుకున్న దుర్యోధనుడు, వాళ్ళను ఎప్పటికైనా తుదముట్టించి, కురు సామ్రాజ్యాన్ని పూర్తిగా తానొక్కడే ఏలాలని కలలు కనేవాడు. ఈ క్రమంలో ఎన్నో సార్లు వారిపై హత్యా యత్నాలు కూడా చేయించాడు. అయితే ధర్మపరులైన పాండవులను ఎప్పటికప్పుడు దేవతలే కాపాడుతూ వచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే.
లక్క గృహ దహనంతో పాండవులు చనిపోయారని అందరూ భావించారు. కానీ, ఆ విపత్తు నుండి బయటపడిన పాండవులు కొంత కాలం అజ్ఞాతంగా జీవించి, ద్రౌపది పరిణయంతో తిరిగి తమ బలాన్ని పుంజుకుని, అత్యంత శక్తి వంతులుగా మళ్ళీ కౌరువుల ముందుకు వచ్చారు. అలా తిరిగి వచ్చిన పాండవులు ఇంద్రప్రస్థాన్ని నిర్మించుకుని, తమ బ్రతుకులు తాము బ్రతకడం మొదలు పెట్టారు. అయితే తన కుయుక్తి దెబ్బతినడం, పైగా అతిలోక సుందరి అయిన ద్రౌపదిని వారు సొంతం చేసుకోవడం, ఇంద్రప్రస్థాన్ని నిర్మించుకోవడం వంటివి చూసి సహించలేక పోయిన దుర్యోధనుడు శకునితో కలసి పన్నిన దుష్ట పన్నాగమే మాయాజూదం.
ఎంతటి మహా పురుషుడిలోనా ఏదో ఒక లోపం ఉన్నట్లు, ధర్మరాజులో కూడా ఒక లోపం ఉంది. అదే జూదంపై ఉన్న మక్కువ. ఆ బలహీనతను గురించి తెలిసిన శకుని, స్వతహాగా తంత్ర శాస్త్ర నిపుణుడై ఉండటం చేత, తాను చెప్పినట్లు ఆడే పాచికలను తయారు చేసి, అవి దుర్యోధనుడికి ఇచ్చి, వాటి చేత ధర్మ రాజును ఓడించడం లోక విదితమే. ఆ సమయంలో పాండవుల ఆస్తిపాస్తులన్నీ హస్తగతం చేసుకోవడమే కాకుండా, వారిని అత్యంత అమానవీయంగా అవమానించాడు. ఇక్కడ అందరనీ విస్మయపరిచే మరో విషయం ఏమిటంటే, ఆ దుర్మార్గపు ప్రక్రియలో ప్రముఖ భూమికను పోషించినవారిలో కర్ణుడు కూడా ముఖ్యుడన్నది, కర్ణుడి గుడ్డి అభిమానులకు తెలియాల్సిన కఠోర సత్యం. ఈ మధ్య కర్ణుడిని గొప్పవాడిగా, పాండవులను అన్యాయ పరులుగా చూపించే కలి ప్రభావిత ప్రయత్నంలో, అరకొర జ్ఞానంతో పని చేసే దర్శక రచయితలు చాలా మందే ఉన్నారు. వారికి తెలియని విషయం ఏమిటంటే, నాడు ద్రౌపదికి జరిగిన అవమానంలో, ఒక మహిళను నిండు సభలో అత్యంత దారుణంగా, అందరికంటే ఎక్కువగా దూషించిన వ్యక్తి కర్ణుడు. ఇలా ఓటమితో, అవమాన భారంతో అడవి బాట పట్టిన పాండవులు, జూదంలో ఓడి, ఇచ్చిన మాట ప్రకారం 12 సంవత్సరాలు అరణ్య వాసం, 1 ఏడాది అజ్ఞాత వాసం చేశారు.
అలా వారు వనవాసానికి వెళ్ళిన 13 మాసాల తర్వాత ఒక నాటి సాయంత్రం, పాండవ పరివారమంతా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా, ద్రౌపది, భీముడు, కౌరవులతో యుద్ధం చేసి తమ రాజ్యాలను తామెందుకు దక్కించుకోకూడదన్న సందేహాన్ని వెలిబుచ్చారు. శకుని మాయతో తమను మోసం చేసి గెలిచినా, ఆ షరతులకు ఒప్పుకుని వనవాసానికి వచ్చి 13 మాసాలు గడిపేసిన తరువాత, అప్పుడు వాళ్ళతో యుద్ధానికి వెళ్ళడం ధర్మం కాదని వారించాడు, ధర్మరాజు. పైగా ఆ సమయంలో యుద్ధం చేస్తే అది దుర్యోధనుడికే లాభిస్తుందనీ, తాము చిత్తుగా ఒడిపోతామనీ విశ్లేషించి చెప్పాడు. దుర్యోధనుడు అధికారంలో ఉన్నాడు, పైగా అతడి పక్షాన, సర్వాస్త్ర సంపన్నులైన భీష్మ పితామహుడూ, ద్రోణాచార్యుల వంటి వారితో పాటు, కర్ణుడు, భూరిశ్రవుడు, జరాసంధుడు, అశ్వత్థామ వంటి అనేక పరాక్రమ వంతులున్నారు. తమ పక్షాన పనిజేసిన సమర్ధవంతమైన అధికారులనూ, మిత్రులను సైతం కానుకలతో మభ్యపెట్టో, భయపెట్టో తన వైపుకు తిప్పుకున్నాడు దుర్యోధనుడు. అలా పరిస్థితులు తమకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆవేశం తగదనీ, తమ పరాక్రమం చూపించడానికది సరైన సమయం కాదనీ నచ్చజెప్పాడు ధర్మజుడు. అన్నగారి మాటలకు వారు అంగీకరించినా, తమ రాజ్యాన్ని తాము తిరిగి పొందడానికి మునుముందు వారు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న విషయాలపై చర్చలను కొనసాగించారు.
ఆ సమయంలో అక్కడికి వచ్చిన వ్యాస భగవానుడు, ధర్మ రాజుతో ఏకాంతంగా మాట్లాడాలని ఆయనను పక్కకు తీసుకెళ్ళాడు. దైవం ఎప్పుడూ ధర్మం వైపే ఉంటుందని చెప్పి, రానున్న యుద్ధం చరిత్రలో ఎన్నడూ చూడని మహా సంగ్రామం. అందుకు వారు ముందునుంచే సిద్ధంగా ఉండాలని చెప్పి, “ప్రతి స్మృతి” అనే విద్యను నేర్పించాడు, ధర్మరాజుకు. ఆ విద్యను సరైన సమయంలో అర్జునుడికి నేర్పించమని ఆదేశించాడు. ఆ విద్యతో అర్జునుడు దేవతలను మెప్పించి, అనేక వరాలనూ, దివ్యాస్త్రాలనూ పొందగలడని తెలియజేశాడు. వాటి సహాయంతో యుద్ధంలో విజయం వారి వైపే ఉంటుందని సెలవిచ్చాడు.
ఆ తర్వాత వ్యాసుడి ఆదేశం మేరకు, పాండవులు అప్పుడు వారున్న ద్వైత వనాన్ని విడిచి పెట్టి, కామ్యక వనం అనే మరో కారడివిలో తమ బసను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఒక రోజు అర్జునుడిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి, వ్యాసుడు తనకు ప్రసాదించిన రహస్య విద్యను బోధించి, ఆయన వివరించిన విషయాల గురించి చెప్పాడు. ఆ తరువాత అర్జునుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయడం మొదలు పెట్టాడు. ఇంద్రుడు అర్జునుడి దీక్షా తత్పరతను పరీక్షించ దలచి, ఒక ఋషి రూపంలో అక్కడికి వచ్చాడు. ప్రతి జీవికీ అంతిమ లక్ష్యం మోక్షమేననీ, ఆ మోక్షాన్ని నేరుగా ప్రసాదించే శక్తి తనకు ఉందనీ, గాండీవాన్ని విడిచి పెడితే అతడికి మోక్షం ప్రసాదిస్తాననీ చెప్పాడు. వీరుడైన వాడు తుది శ్వాస వరకూ తన ఆయుధాన్ని విడువకూడదనే సూత్రానికి కట్టుబడిన అర్జునుడు, ఋషి ప్రసాదిస్తానన్న వరాన్ని తిరస్కరించాడు. అర్జునుడి సంకల్పబలానికి సంతోషించిన ఇంద్రుడు తన నిజరుపాన్ని ధరించి, దివ్యాస్త్రాల కోసం పరమ శివునికై తపస్సు చేయమని ఉపదేశించాడు.
ఇంద్రుడి ఉపదేశం మేరకు ఇంద్రకీలాద్రి పర్వతంపై, తన కాలి బొటన వేలిపై నుంచుని, ఘోర తపస్సు చేయడం మొదలు పెట్టాడు అర్జునుడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు అర్జునుడిని పరీక్షించదలచి, పార్వతీ సమేతంగా కిరాతుడి రూపంలో అక్కడికి వచ్చాడు. అదే సమయంలో ఒక రాక్షసుడు అడవి పంది రూపంలో అర్జునుడిని చంపడానికి వచ్చాడు. అది గమనించిన అర్జునుడు దానిని సంహరించడానికి పూనుకున్నాడు. సమాంతరంగా కిరాతుడు కూడా బాణం వేయడంతో, వారి రెండు బాణాలూ ఒకేసారి ఆ వరాహం ప్రాణాలను బలిగొన్నాయి. అది చూసి వారిద్దరి మధ్యా వాదోపవాదాలు పెరిగి, పోరుకు సమాయత్తమయ్యారు. భీకర పోరు కొనసాగింది.
అర్జునుడు కిరాతుడిని ఏమీ చేయలేకపోయాడు. తనవద్దనున్న దివ్యాస్త్రాలను వాడినా, ఆఖరికి బ్రహ్మాస్త్రమే ప్రయోగించినా, అన్నీ కిరాతుడి రూపంలో ఉన్న శివుడిలో విలీనమైపోయాయి. అర్జునుడు తన దుస్థితికి మ్రాన్పడిపోయాడు. తనను ఆ దుస్థితి నుంచి రక్షించగల వాడు ఆ పరమ శివుడొక్కడే అని గ్రహించి, అప్పటికప్పుడు మట్టితో సైకత లింగాన్ని తయారుచేసి, అందుబాటులో ఉన్న పుష్పాలను మాలగా కూర్చి ఆ లింగంపై వేసి ప్రార్ధించడం మొదలు పెట్టాడు. అయితే విచిత్రంగా ఆ లింగంపై వేసిన మాల, దూరంగా ఉన్న కిరాతుడి మెడలో ప్రత్యక్షమవ్వడంతో, వచ్చింది సాక్షాత్తు పరమేశ్వరుడే అని తెలుసుకుని, ఆనందాశ్రువులతో స్వామి కాళ్ళపై పడి శరణు వేడాడు. స్వామి అర్జునుడి భుజాలు పట్టుకుని పైకి లేపి ఆలింగనం చేసుకున్నారు. శివుడి తేజస్సు అర్జునుడి శరీరాన్ని తాకినవెంటనే అతడి గాయాలు మాయమై, అత్యంత బలశాలిగా రూపాంతరం చెందాడు. అర్జునుడి పరాక్రమానికీ, భక్తికీ ప్రసన్నుడైన శివుడు, అన్ని అస్త్రాలలో కెల్లా అత్యుత్తమమైన, అంత వరకూ దేవతలవద్ద కూడా లేని పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. దానిని మాట చేతకాని, ఏదైనా శస్త్రంపై గానీ, చిన్న గడ్డి పరక పైనైనా మంత్రించి ప్రయోగించవచ్చనీ, అది ముల్లోకాలలో ఎటువంటి ప్రాణినైనా సంహరించగలదు కాబట్టి, అల్పులపై వాడవద్దనీ చెప్పి, దానిని ప్రయోగించే తీరునూ, ఉపసంహరించే విధానాన్నీ తెలియసి అంతర్ధానమయ్యాడు.
పరమశివుడే పాశుపతాస్త్రాన్ని ప్రసాదించిన తరువాత, దేవతలందరూ అర్జునుడికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించారు. ఆ తర్వాత వజ్రాస్త్రాన్నీ, దేవదత్తం అనే శంఖాన్ని కూడా ఇచ్చి, స్వర్గానికి తీసుకెళ్ళి సకల మర్యాదలూ చేశారు. అక్కడితో అర్జునుడు ఎవరూ ఓడించలేని దివ్యాస్త్ర సంపన్నుడయ్యాడు. ఇక్కడి వరకు చెప్పుకున్న వివరాలన్నీ వ్యాస భారతంలోని కిరతార్జునీయ ఘట్టంలో ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఈ ఘట్టానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక విధంగా మహా భారతాన్ని పూర్తిగా మార్చిన ఘట్టంగా కవులు అభివర్ణిస్తారు.
అలా స్వర్గానికి వెళ్ళిన అర్జునుడు అక్కడ చాలా రోజులుండి, దేవతల వద్ద యుద్ధ రీతులలో శిక్షణ పొందడమే కాకుండా, సకల కళలలోనూ ప్రావీణ్యం పొందాడు. ఇదిలా ఉండగా ఒకనాడు, దేవతలు సైతం జయించలేకపోయిన నివాతకవచులనే రాక్షసులను హతమార్చమని ఇంద్రుడు అర్జునుడిని కోరాడు. ఇంద్రుడి కోరిక మేరకు వారిని సంహరించడానికి వెళ్ళిన అర్జునుడు ఆ నివాతకవచులుతో ఘోర యుద్ధం చేసి, చివరకు వారిని సంహరించాడు.
విజయుడై స్వర్గానికి తిరిగి వస్తున్నసమయంలో, దారిలో బంగారు తాపడం పోసిన భారీ భవనాలతో మెరిసిపోతున్న వింత నగరాన్ని చూశాడు అర్జునుడు. ఇంద్ర సారథిని వివరాలడుగగా, అది కాలకేయులనబడే రాక్షసులు నివసించే హిరణ్య పురమనే నగరమనీ, బ్రహ్మ వరం పొందడం వలన వారిని జయించడం దేవతల వల్ల కాలేదనీ వివరించాడతడు. ఆ నగరం గాలిలో తేలుతూ, ఎక్కడికైనా వెళ్లగల వింత నగరమనీ, అది వారికి కావలసిన విధంగా రూపాంతరం చెందగలదనీ చెప్పాడు. అంతటి అద్భుతమైన నగరంలో ఉంటూ, బ్రహ్మ వరాన్ని ఆసరాగా తీసుకుని ఆ కాలకేయులు, అదను చిక్కినప్పుడల్లా దేవతలను హింసిస్తూ ఉంటారని చెప్పడు.
అది విన్న అర్జునుడు వారితో పోరుకు సిద్ధమయ్యాడు. కాలకేయులు దాదాపుగా 60 వేల మందిదాకా ఉంటారనీ, వారికి లక్షల సంఖ్యలో సైన్యం ఉందనీ, వారు మాయా యుద్ధంలో ఆరితేరిన వారనీ, మహాభారతంలో ప్రస్తావించబడివుంది. దాంతో అర్జునుడికి పోరులో నిలదొక్కుకోవడం కష్టతరమై, చివరకు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. అది కొన్ని కోట్ల అస్త్రాలుగా, మృగాలుగా, యక్ష రాక్షసులుగా, వింత ఆకారాలున్న జీవులుగా పుట్టుకొచ్చి, ఆ హిరణ్య పురంలో ఉన్న ప్రతి ఒక్కరినీ వెంటాడి వేటాడి చంపేసింది. దాంతో దేవతలకు పట్టిన కాలకేయుల పీడ విరగడయ్యింది.
అలసిపోయిన అర్జునుడు స్వర్గలోకం చేరి తన విడిదిలో నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో, అతిలోక సౌందర్యవతి అయిన ఊర్వశి అక్కడికి వచ్చింది. అర్జునుడి వీరత్వం గురించి విని, అంతటి వీరుడితో కామించాలనే కోరికతో రగిలిపోయింది ఊర్వశి. కానీ, ఆమెను తల్లిగా భావించి కీర్తిస్తూ ఆమెకు నమస్కారం చేశాడు అర్జునుడు. ఆ పరిణామాన్ని చూసి అయోమయంలో పడింది ఊర్వశి. అప్పుడు అర్జునడు, ఆమె తమ వంశానికి మూల పురుషుడైన పురూరవుడి భార్య అనీ, వారి కలియికతో కలిగిన సంతానం కారణంగానే తాను ఆ రోజు అక్కడ ఉన్నాననీ చెప్పి, అందుకే ఆమె తనకు తల్లితో సమానమనీ గుర్తు చేశాడు. దానికి విపరీతమైన కోపానికి గురైన ఊర్వశి, అది దేవ లోకమనీ, తానొక దేవ వేశ్య అనీ, వేశ్యలకు వావివరుసలతో పనిలేదనీ అన్నది. కానీ అర్జునుడు మాత్రం తాను మానవుడు కాబట్టి, భూలోక ధర్మాన్ని పాటించక తప్పదని తెగేసి చెప్పాడు. ఆ మాటలకు క్రోధావేశాలతో రగిలిపోయిన ఊర్వశి అర్జునుడిని నపుంసకుడివయిపోతావని శపించి వెళ్ళిపోయింది.
మర్నాడు ఉదయం ఇంద్రుడు అర్జునుడి దగ్గరకి వచ్చి, ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించే శక్తి తనకు లేకపోయినా, దాన్ని అతనికి వరంగా మారుస్తానని అన్నాడు. వారు పాటించాల్సిన 12 ఏళ్ల వనవాసం తరువాత 1 ఏడాది అజ్ఞాత వాస సమయంలో అది అతడికి ఉపయోగపడే విధంగా ఆ శాపాన్ని సవరించాడు.
అలా పాండవుల పన్నెండేళ్ళ వనవాసం పూర్తయిన తర్వాత, అజ్ఞాత వాసానికి సిద్ధమై కౌరవులు అస్సలు ఊహించని విధంగా అతి చిన్న సామంత రాజ్యమైన విరాటుడి కొలువులో చేరారు. నాడు ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఇంద్రుడి చేత వరంగా మార్చుకున్న అర్జునుడు బృహన్నలగా మారి, ఇంద్రలోకంలో నేర్చుకున్న నాట్య విద్యనే అక్కడి రాచ కన్యలకు నేర్పిస్తూ, అజ్ఞాత వాసాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాడు. నరనారాయణులలో నరుడు అర్జునుడు, సాక్ష్యాత్తు ఇంద్ర తేజస్సు కలిగినవాడు, మహా శక్తిశాలి, అతడి తేజస్సుని ఎక్కడ ఉన్నా కనుగోవచ్చనేది శకుని ఆలోచన. అందుకే వాళ్ళు అజ్ఞాత వాస సమయంలో మనకి చిక్కుతారనే దీమా కౌరవులలో ఉండేది. అయితే బృహన్నలలా అర్జునుడంతటి వాడు మారతాడని, దుర్యోధనుడి వేగులేవరూ ఊహించలేకపోయారు. ఆ కారణం చేతనే వారు పాండవుల అజ్ఞాత వాసాన్ని చేధించలేక పోయారు. పైగా జగమెరిగిన యుగపురుషుడు ఆ కృష్ణ పరందాముడి అండదండలు ఎలాగూ పాండవులపైనే ఉన్నాయి.
ఈ విధంగా ముందు చెప్పినట్లు అర్జున కిరాత యుద్ధం, పాశుపతాస్త్ర వరం, ఊర్వశి ఇచ్చిన శాపం.. ఈ మూడు మహా భారతాన్ని పూర్తిగా తిప్పిన మహోన్నత ఘట్టాలుగా వ్యాస భారతం చెబుతుంది.
ధర్మో రక్షతి రక్షితః!
Comments
Post a Comment