Perception of DEATH! మృత్యువు!
మృత్యువు! Perception of DEATH!
రెండు జన్మల మధ్య అత్యధిక అంతరం ఎన్ని సంవత్సరాలో మీకు తెలుసా?
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ।। 27 ।।
పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించినవానికి మరల జన్మము తప్పదు. కాబట్టి అనివార్యమైన ఈ విషయాన్ని గురించి శోకించ వద్దని అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. జీవితంలో అత్యంత ఖచ్చితమైన విషయం, మనం ఏదో ఒకరోజు మృత్యువు ఒడికి చేరాల్సిందే అన్నది. తప్పించుకోలేనిది, ఎప్పుడు వచ్చేదీ తెలియనిది ‘మరణం’. కాబట్టి, అనివార్యమైన మృత్యువును గూర్చి తెలివైన వాడు శోకించడని, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. కల్పాంతరాల జీవాత్మ ప్రయాణంలో, ఇప్పుడు మనం చూస్తున్న జీవితం ఒకానొక మజిలీ మాత్రమే. ఈ ప్రపంచంలో ప్రతి క్షణం ఎందరో మనుష్యులు చనిపోతూనే ఉన్నారు. బ్రతికి ఉన్నవారు ఈ విషయం చూస్తూనే ఉన్నా, ఏదో ఒక రోజు మనమూ చనిపోతామని మాత్రం అనుకోరు. దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏముంటుంది? జీవితంలో అతిపెద్ద భయం మరణ భయం అని మనస్తత్వవేత్తలు వర్గీకరించారు. అసలు ఈ జీవితం ఏమిటి? జీవన ప్రక్రియ యొక్క ముగింపును సూచించే ఆ మరణం సంభవించిన తరువాత ఏం జరుగుతుంది? వంటి విషయాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/sHDOobD-Ks8 ]
జీవన ప్రవాహం అనంతం. మనం అనంతకాలం నుండి మనుగడ సాగిస్తూనే ఉన్నాము, ఇక ముందు కూడా అనంతకాలం వరకు సాగిస్తూనే ఉంటాము. కానీ మనం తల్లిగర్భంలోకి ప్రవేశించిన దగ్గరనుంచే మన మనుగడ మొదలయిందనీ, హృదయ స్పందన ఆగిపోగానే మరణం సంభవిస్తుందనీ భ్రమపడుతూ ఉంటారు చాలామంది. అది మన అజ్ఞానంతో కూడుకున్న అంధవిశ్వాసము. ఆధునిక భౌతిక విజ్ఞానం ప్రకారం, జీవుడు స్వతంత్ర శక్తి కాదనీ, శరీరమే జీవమనీ, మృత్యువు అనంతరం దానికి అస్థిత్వం ఉండదనేది, దానికున్న పరిమిత జ్ఞానం. దీనిని బట్టి భౌతిక విజ్ఞానం యింకా బాల్యావస్థలోనే ఉన్నదని తెలుసుకోవాలి. విద్యుత్తు యొక్క గతికి సంబంధించి యిప్పటివరకు మూడు పదుల పైబడిన సిద్ధాంతాలు ప్రతిపాదింపబడ్డాయి. ప్రతి కొత్త సిద్ధాంతమూ అంతకు ముందు ప్రతిపాదింపబడిన సిద్ధాంతాలను ఖండిస్తుంది. కానీ యింతవరకు విద్యుత్ గతి యొక్క వాస్తవ పరిస్థితి మనకు తెలియదు. ఆధ్యాత్మిక విషయాలను భౌతిక శాస్త్రంతో ముడిపెట్టడం వలన మనకీ దుర్గతి సంభవించింది. శరీరమే జీవమని ఒక శాస్త్రజ్ఞుడంటాడు. ఇంకొక శాస్త్రజ్ఞుని కథనం ప్రకారం, మృతాత్మ యొక్క ఆశ్చర్యకరమైన గతి విధులు ప్రామాణికం చేయబడతాయి. మూడవ వైజ్ఞానికుడు, ఒక అబోధ బాలుడి నోట పూర్వజన్మ కథనం విని ఆశ్చర్యచకితుడవుతాడు. అది పునర్జన్మ సిద్ధాంతానికి బలం చేకూర్చుతుంది. శిశువు జన్మించగానే పాలు త్రాగడం ప్రారంభిస్తుంది. పూర్వస్మ్రుతి లేకుండా అది ఎలా సాధ్యం? చాలా మంది పసిపిల్లలలో ఎన్నో అద్భుతమైన గుణగణాలు కనిపిస్తాయి. అటువంటి జ్ఞానం పూర్వజన్మకు సంబంధించినదేకానీ, ఈ జన్మకు సంబంధించినది కాదు.
జీవము, శరీరము ఒకటి కాదు. శరీరానికి దుస్తులు తొడిగినట్లుగానే జీవము శరీరాన్ని తొడుక్కుంటుంది. జీవితమంతా ఒకే దుస్తులు సరిపోనట్లుగానే ఆత్మ యొక్క అనంత ప్రయాణంలో ఒకే దేహం పనికి రాదు. తడవ తడవకూ మార్చవలసిన అవసరం అనివార్యం. సాధారణంగా దుస్తులు జీర్ణమైన తర్వాతనే వదలివేయబడతాయి. కానీ కొన్ని సందర్భాలలో కాలిపోయినప్పుడో, కొర్రుబట్టి చినిగిపోయినప్పుడో, ఎలుకలు కొట్టేసినప్పుడో, మరే ఇతర కారణాలవల్లనో, కొద్ది కాలంలోనే వదిలివేయడం జరుగుతుంది. శరీరం కూడా సాధారణంగా వృద్ధాప్యం వల్ల జీర్ణమైనప్పుడు మాత్రమే, జీవుని చేత వదలివేయబడుతుంది. కానీ కొన్ని ఆకస్మిక కారణాలవల్ల అల్పాయువులోనే విసర్జించబడుతుంది.
మనిషిలో మృత్యువు ఏ విధంగా వస్తుందనే జిజ్ఞాస ఉండటం సహజమే. తత్వవిదులయిన యోగుల కథనం ప్రకారం, మృత్యువు ఆసన్నమయ్యే కొద్ది కాలం ముందు, మానవులకు మనో వేదన, పీడ కలుగుతాయి. దీనికి కారణం, నాడులలోని ప్రాణం కదిలి, ఒకే చోట ఏకత్రితం కావటమే. కానీ పూర్వాభ్యాస దోషం వలనా, ఆ ప్రాణశక్తి తిరిగి మరలిపోవటం వలనా, అఘాతం ఏర్పడుతుంది. అది పీడకు కారణం. రోగం వల్లనో, దెబ్బల వల్లనో, మరే ఇతర కారణాల వల్లనో మృత్యువు కలిగితే, దాని కారణంగా కూడా పీడ కలుగుతుంది. మరణానికి ముందు జీవి చాలా అవస్థలను పడి, కొద్దిసేపటికి మూర్ఛావస్థకు చేరుతుంది. అటువంటి అచేతనావస్థలో ప్రాణం శరీరాన్ని వదిలి బయటకు పోతుంది. మరణ సమయంలో మనుష్యుని సమస్త బాహ్య శక్తులూ అంతర్ముఖమవుతాయి. తరువాత స్థూల శరీరాన్ని వదిలి బయుటకు పోతుంది. పాశ్చాత్య మతాల ప్రకారం, జీవుని సూక్ష్మ శరీరం కప్ప రంగులో బయటకు పోతుంది. భారతీయ యోగులు మాత్రం, అది శుభ్ర శ్వేతవర్ణ జ్యోతిలాగా బయటపడుతుందని తెలియజేస్తారు.
జీవితంలో జరిగిన చాలా విషయాలను మరచిపోయి, మస్తిష్కంలోని సుషుప్తావస్థలో ఉంచుకోవడం జరుగుతుంది. మరణకాలంలో అవన్నీ ఒక్కసారిగా జాగృతి చెంది, మూకుమ్మడిగా బయటకు వస్తాయి. ఆ కారణంగా, కొన్ని క్షణాలలోనే, జీవితకాలంలో జరిగిన సంఘటనలన్నీ, సినిమా చూసినట్లు చూడటం జరుగుతుంది. ఆ సమయంలోనే మనస్సుకు గల ఆశ్చర్యకరమైన శక్తిని గురించి తెలుస్తుంది. అప్పుడు చూసే సంఘటనలలో సగం మానసిక దృశ్యాలను చూడటానికే, సహజంగా ఒక జీవితకాలం సరిపోదు. కానీ ఆ సమయంలో కొద్ది క్షణాలలోనే అన్నీ కనిపిస్తాయి. మరణానంతరం ఆ సంఘటనలన్నీ ఘనీభవించి, సంస్కారాలుగా మృతాత్మ వెన్నంటే ఉంటాయి. ఆ సమయంలో మనస్సుకు కలిగే వ్యధ వర్ణనాతీతమే. భగవద్గీతలో పరమాత్ముడు చెప్పినట్లుగా ఒక్కసారి వెయ్యి తేళ్ళు కుట్టినంత బాధ కలుగుతుంది. ఒకానొకప్పుడు ఒకడు సగం స్పృహలో తన కుమారుడి తలను కత్తితో ఖండించాడు. ఆ తరువాత అతని మానసిక వ్యధ వర్ణనాతీతం. సరిగ్గా అటువంటి పరిస్థితే ఇప్పుడు మృతాత్మకు కలుగుతుంది. జీవితంలో ఎంతో సమయాన్నీ, అందివచ్చిన ఎన్నో ధార్మిక అవకాశాలనూ సద్వినియోగ పరచుకోలేకపోయామే అనే బాధ క్రుంగదీస్తుంది.
పుత్ర మరణానంతరం శరీరానికి కష్టం లేకపోయినా, మనస్సుకు అపరిమిత బాధ కలిగినట్లే, మరణానంతరం కూడా శారీరక వేదన లేకపోయప్పటికీ, మానసిక వ్యధ భరించలేనంతగా ఉంటుంది. రోగం మొదలైన శారీరక పీడలు మనస్సు అంతర్ముఖం కాగానే అదృశ్యమయిపోతాయి. మృత్యువుకు పూర్వ క్షణాలలో, శరీరం తన కష్టాలను సహించగలుగుతుంది. రోగం వల్ల గానీ, దెబ్బల వల్ల గానీ, శరీరానికీ, ఆత్మకూ గల బంధాలు క్రమ క్రమంగా తొలగిపోనారంభిస్తాయి. మగ్గిన పండు చెట్టునుండి రాలే అవస్థ చందాన, శరీరం శిధిలమై, అచేతనత్వ స్థితికి చేరగానే మృత్యువు సంభవిస్తుంది. నోరు, కళ్ళు, చెవులు, నాసికా రంధ్రాల ద్వారా ప్రాణ శక్తి నిష్క్రమిస్తుంది. దుష్ప్రవృత్తి గలవారు మరణించేటప్పుడు మాత్రం, అది మలమూత్ర రంధ్రాల గుండా నిష్క్రమిస్తుంది. యోగులు బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణత్యాగం చేస్తారు. మన చుట్టూ జరిగే మరణాలలో ఇటువంటి విషయాలు గమనించవచ్చు.
శరీరము నుండి నిష్క్రమించిన వెంటనే జీవము ఒక విచిత్రమైన అవస్థలో పడుతుంది. కష్టపడి చాకిరీ చేసిన తరువాత మెత్తటి శయ్యపై పడుకోగానే గాఢ నిద్ర పట్టినట్లుగా ఉంటుంది ఆ సమయంలో ఆత్మ పరిస్థితి. మృతాత్మ జీవితమంతా పడిన శ్రమకు అటువంటి నిద్రావస్థ అవసరం. ఈ నిద్ర వల్ల జీవునికి గొప్ప శాంతి కలుగుతుంది. మునుముందు చేయవలసిన పనులు చేయడానికి తగిన శక్తి లభిస్తుంది. మరణించిన వెంటనే నిద్ర రాదు. కొంత సమయం ఉంటుంది. దానికి ఇంచుమించు ఒక నెల రోజులు పడుతుంది. అందుకు కారణం, మరణించిన తర్వాత కూడా మృతాత్మకు తన జీవిత వాసనలు దృఢంగా ఉంటాయి. నిదానంగా అవి శిధిలమై, అదృశ్యమవుతాయి. ఎక్కువగా శ్రమ చేసిన వెంటనే సహజంగా రక్త ప్రసరణ తీవ్ర గతి నందుకుంటుంది. అటువంటి సమయంలో పక్కమీద పడుకున్న తరువాత కూడా, మెలకువగా ఉన్నంతసేపూ తీవ్రంగానే ఉంటుంది.
మృతాత్మ స్థూల శరీరాన్ని వదిలిన తరువాత, సూక్ష్మ శరీరంలో ప్రస్ఫుటితమవుతుంది. సూక్ష్మ శరీర నిర్మాణం కూడా అచ్చంగా స్థూల శరీరంలానే ఉంటుంది. మృతాత్మకు శరీరం తెలికయిపోయినట్లూ, పక్షిలాగా గాలిలో ఎగురుతున్నట్లూ అనిపించి, ఆశ్చర్యం కలుగుతుంది. ఆ స్థితిలో మృతాత్మ, కోరుకున్న విధంగా, కోరుకున్న చోటకు వెళ్ళగలుగుతుంది. స్థూల శరీరాన్ని వదిలిన తరువాత, అది కొంత కాలం వరకు మృత శరీరం సమీపంలోనే సంచరిస్తుంది. చుట్టూ చేరి ఏడుస్తున్న బంధువులను ఓదార్చాలనీ, తన శరీరంలోకి తిరిగి ప్రవేశించాలనీ ప్రయత్నిస్తుంది. కానీ అది సాధ్యం కాదు. ఒక ప్రేతాత్మ ఇలా అన్నది.. "నేను మరణానంతరం గొప్ప నిర్జీవ స్థితిలో పడి ఉన్నాను. స్థూల శరీరం మీదా, బంధుజనుల మీదా ఉన్న మోహం కారణంగా, వారితో మాట్లాడాలని ఏదో ఆరాటం. నేను అందరినీ చూస్తూనే ఉన్నాను కానీ, ఎవ్వరూ నన్ను గమనించటం లేదు. నేను అందరి మాటలూ వింటూనే ఉన్నాను కానీ, నా మాటలను వినేవారే లేకపోవడం, చాలా బాధ కలిగింది. అలాంటి సమయంలోనూ సంతోషం కలిగించే విషయం, నా శరీరం చాలా తేలిక కావటం, ఎంతో వేగంతో అన్ని వైపులకూ ప్రయాణం చేయగలగటం. జీవితమంతా నేను మరణమంటే భయపడుతూనే ఉన్నాను కానీ, ఇప్పుడు నాకు భయమంటే ఏమిటో తెలియదు. సూక్ష్మ శరీరంలో ప్రస్ఫుటితం కావటంవల్ల, ఇప్పుడు నాకిక స్థూల శరీరం మీద మమకారం లేదు. దానికి కారణం, నా నూతన శరీరం. పూర్వ శరీరంతో పోలిస్తే చాలా బావుంది. నా అస్థిత్వంలో మార్పేమీ కనిపించడంలేదు. నా చేతులూ, కాళ్ళు ఆడిస్తుంటే మామూలుగానే ఉంది. మరణించినట్లేమీ లేదు. ఇప్పుడు నాకు తెలిసి వచ్చిన విషయం, మరణం అంటే ఒక శరీర పరివర్తన ప్రక్రియ మాత్రమేగానీ, భయపడనవసరం లేదు.
మృత శరీరానికి అంత్యేష్టి జరిగేంత వరకూ, మృతాత్మ మృత శరీరం దరిదాపులలోనే తిరుగుతూ ఉంటుంది. శరీర దహనమైన తరువాత నిరాశ చెంది, మనస్సును మరో ప్రక్కకు మరలుస్తుంది. అయినప్పటికీ చాలా రోజుల వరకు అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అధిక అజ్ఞానం వల్లా, మాయా మోహాల కారణంగా, మృతాత్మ శ్మశానాలలోనే ఎక్కువగా సంచరిస్తుంది. తరువాత తనకు ప్రియమైన వారి దగ్గర ఉండటానికి ప్రయత్నిస్తుంది. వృద్ధాప్యంలో మరణించిన వారికి ఈ వాసనలు తక్కువగా ఉంటాయి. అందువల్ల వారు త్వరలోనే నిద్ర లోకి వెళ్ళిపోతారు. స్త్రీలలో వాసనలు అధికంగా ఉండటం వల్ల, చాలా కాలం విలపిస్తూ ఉంటారు. వారిలో ఎక్కువమంది అకాల మృత్యువు వాత బడిన వారో, లేక ఆత్మహత్యలు చేసుకున్న వారో అయ్యి ఉంటారు. హఠాత్తుగా, ఉగ్రవేదన తర్వాత మృత్యు వాత పడడం వలన, సూక్ష్మ శరీరంలో స్థూల శరీరానికి సంబంధించిన పరమాణువులు ఎక్కువ పరిమాణంలో అంటిపెట్టుకుని ఉంటాయి. అందువల్ల మరణానంతరం వారి శరీరం కొంత జీవించి, కొంత మరణించి, కొంత స్థూలంగా, కొంత సూక్ష్మంగా ఉంటుంది. అటువంటి ఆత్మలు ప్రేత స్వరూపంలో కనిపించి అదృశ్యమవుతూంటాయి. సాధారణ మృత్యు వాత బడిన వారికి ఈ విధంగా జరగదు. అందుకు విశేష ప్రయత్నం, తపస్సు కావాలి.
ఇక అపఘాతం అంటే, ప్రమాదంలో మరణించిన వారి ఆత్మ శక్తివంతమైన ప్రేతాత్మ రూపంలో తిరుగుతుంటుంది. ఈ వివరాలను మనం గతంలో చేసిన గరుడపురాణం వీడియోలలో చెప్పుకున్నాము. చూడనివారికోసం ఆ Playlist ను పొందుపరుస్తున్నాను. అటువంటి ప్రేతాత్మ విషమ మానసిక పరిస్థితి, నిద్రను దరిజేరనీయదు. ప్రేతాత్మలు ఇంద్రియ వాసనా తృప్తి కోసమో, లేక ఏదో కసి తీర్చుకోవటానికో ప్రయత్నం చేస్తూంటాయి. అటువంటి ప్రేతాత్మలను కొందరు తాంత్రికులు వశపరచుకుని, తమ బానిసలను చేసుకుంటారు. అలాంటి సమయంలో ఆ ప్రేతాత్మలు ఆ తాంత్రికులపై ప్రసన్నతతో ఉండక, విపరీతమైన క్రోధంతో రగలి పోతూ ఉంటాయి. అవకాశం దొరికితే వాడిని చంపివేస్తాయి. బంధమనేది ఎవరికీ ఇష్టముండదు. బంధం తొలిగించుకోలేక కొన్ని ప్రేతాత్మలు తాంత్రికుడి ఆజ్ఞనల మేరకు సర్కస్ లో సింహాలలాగా అణిగిమణిగి ప్రవర్తిస్తూ ఉండటం, వాటికి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. కట్టి వేయబడిన ప్రేతం ఒకే చోట ఉంటుంది. మాటిమాటికీ తన నివాస స్థానాన్ని మార్చుకోదు.
తక్కువ వాసనలు కలిగిన, లేదా ప్రబుద్ధ చిత్తము కలిగిన ధార్మికులు అంటే, అంత్యేష్టి అనంతరం పాత సంబంధాలన్నింటినీ వదులుకుని, ఉదాసీన వైఖరిని అవలంభిస్తారు. ఉదాసీనత కలుగగానే నిద్ర వస్తుంది. విశ్రాంతి వలన నూతన శక్తి కలుగుతుంది. కాబట్టి, విశ్రాంతికి అటువంటి నిద్ర అవసరం. ఆ నిద్ర ఎంత కాలం ఉంటుందనేది ఒక నియమానికి కట్టుబడి ఉండదు. అది జీవుని యోగ్యతపై ఆధారపడి ఉంటుంది. చిన్న పిల్లలకూ, కష్టపడి పనిచేసే వారికీ నిద్ర ఎక్కువ మోతాదులో అవసరం. వృద్ధులకూ, విశ్రాంతిగా గడిపే వారికీ తక్కువ మోతాదులో నిద్ర సరిపోతుంది. సాధారణంగా మరణాంతరం కలిగే నిద్ర మూడు సంవత్సరాలు ఉంటుంది. అందులో ఒక సంవత్సరం గాఢ నిద్ర కలుగుతుంది. అప్పుడు సూక్ష్మేంద్రియాల సంవేదనను గ్రహించటం సాధ్యపడుతుంది. రెండవ సంవత్సరం నిద్రాభంగమై, మునుపటి తప్పులను సరిచేసుకోవటం, ముందుకాలానికి అవసరమైన యోగ్యతను సంపాదించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. మూడవ సంవత్సరం కొత్త జన్మను ధరించే అన్వేషణలో గడుస్తుంది. ఇది సామాన్యంగా జరిగేది. కొందరు విశిష్ఠ వ్యక్తులు ఆరు నెలలలోనే తిరిగి తల్లి గర్భంలో ప్రవేశిస్తారు, మరి కొందరికి ఆయిదు సంవత్సరాలు పడుతుంది. ప్రేతాత్మలు పన్నెండు సంవత్సరాల వరకూ ఉండవచ్చు. ఆ విధంగా రెండు జన్మల మధ్య అత్యధికమైన అంతరం పన్నెండు సంవత్సరాలు.
ఇందులో అత్యుత్తమమైన జననమరణ చక్రాన్ని పొందడానికి మనకున్న ఏకైక మార్గం, భగవద్గీత ద్వారానే తెలుస్తుంది. ఈ వీడియో చూసిన వారందరూ అవకాశం ఉండగానే జాగ్రత్త పడమని కోరుకుంటున్నాను.
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment