SIVAGALAI rewrites the past: Exposes Colonial Lies! | శివగలై!
శివగలై! ఆ ఊరు బయటపెట్టిన చారిత్రక వాస్తవాలు!
Sivagalai rewrites the past: Unfolds the truth on iron's antiquity!
భారతీయ నాగరికత, హరప్పా, మొహేంజొదారో నుంచే మొదలైంది. కేవలం ఉత్తర భారత దేశంలోనే నాగరికత పురుడుపోసుకుంది. దక్షిణ భారత దేశంలో కేవలం అనాగరికులైన ఆటవిక మనుషులు మాత్రమే ఉండేవారు. అసలు భారత దేశానికి నాగరికత తెచ్చిందే యూరోప్ లో పుట్టి, వలస వచ్చిన ఆర్యులు. ఆర్యుల రాకవరకు, వారికసలు ఇనుమంటే ఏమిటో కూడా తెలియదు. ఆర్యులు తమ జ్ఞానాన్ని ఉత్తర భారతీయులకు పంచితే, కాలక్రమంలో ఆ జ్ఞానం దక్షిణ భారతం వరకు పాకింది... ఇవన్నీ గత రెండు వందల ఏళ్లుగా, భారతీయలకు నూరిపోసిన అభూత కల్పనలు. స్వతంత్ర భారతంలో పాఠ్య పుస్తకాలుగా మారిన పాఠాలు. జనాల మొదళ్ళలోకి ఎంతో మంది కుహనా మేధావులు ఎక్కిస్తున్న అవాస్తవాలు. భూమిలో మరిగిపోతున్న లావా ఎప్పటికైనా బయట పడాల్సిందే అన్నట్టు, చీకటి గర్భంలో కప్పివుంచిన అసలైన చరిత్ర కూడా ఎదో ఒకరోజు సత్యాన్వేషకుల ద్వారా బయటకు వచ్చి తీరాల్సిందే. కానీ ఇక్కడ అటువంటి సత్యాన్ని ఒక చిన్న ఊరు బయల్పరచింది. ఆ సత్యం ప్రపంచాన్ని ఆలోచనలో పడేసి, ఏళ్ల తరబడీ తుచ్చులు ఎంతో చాకచక్యంగా నిర్మించుకున్న అసత్యపు చరిత్ర గోడలను పునాదులతోసహా కూల్చివేసింది. ఆ సత్యం భారత దేశంపై ఇన్నేళ్ళుగా జరుగుతున్న కుట్రను సమూలంగా బయటపెట్టేసింది. ఈ మాటలు వింటుంటే ఎన్నో సందేహాలు కలుగుతాయి. అది ఏ ఊరు..? అక్కడ బయటపడిన నిజం ఏమిటి..? ఇనుము గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది..? హరప్పా సంస్కృతి పురాతమైనది కాదా..? వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/G7d3Tt5TIn4 ]
ఏదైనా ఒక అబద్ధాన్ని వందమంది కలిసి ఎంతో నమ్మకం నటిస్తూ వందసార్లు చెబితే, వారి ముందున్న వెయ్యి మందీ ఆ అబద్ధాన్ని నిజమని నమ్మేసే అవకాశం ఉంది. కానీ ఈ వెయ్యి మంది నమ్మినంత మాత్రాన, ఆ అబద్ధం శాశ్వతంగా నిజం కాబోదు. దాదాపు వెయ్యేళ్ళుగా మన దేశంలో జరుగుతోంది అదే. అయితే తెల్ల దొరలు గత రెండు వందల ఏళ్లుగా ఆ అబద్ధాలను మరింత బలంగా భారతీయుల బుర్రలలోకి చొప్పించే ప్రయత్నాలు ఎన్నో చేశారు, వారి తొత్తులద్వారా ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. వారికి మన కుహనా మేధావి వర్గం వంత పాడుతూనే ఉంది.
ఇలా వారు చెప్పిన అతి పెద్ద అబద్ధం, భారతీయ నాగరికత హరప్పా మొహేంజొదారో నుంచే మొదలైందని. ఈ మాట వినగానే, చాలా మంది హరప్పా నాగరికత పురాతనమైనది కాదా! అనే సందేహం వ్యక్తం చేస్తారు. హరప్పా నాగరికత పురాతనమైనదే. దాదాపు 5000 ఏళ్ల చరిత్ర ఆ ప్రాంతంలో దాగి ఉంది. వేల ఏళ్ల నాటి భారతీయ నాగరికత యొక్క అద్భుత పరిజ్ఞానం గురించి హరప్పా నాగరికత తెలియజేస్తుంది. కానీ అక్కడ దొరకని ఒక వస్తువు, యావత్ భారత చరిత్రను అణగదొక్కడానికి ప్రయత్నించే వెస్ట్రన్ శక్తులకు బలం అయ్యింది. అది మరేదో కాదు ‘ఇనుము’.
సాధారణంగా చరిత్రకారులు మానవ నాగరికత క్రమాన్ని వివరించేటప్పుడు, వివిధ కాలాలలో మానవులు వాడిన పనిముట్లను ప్రామాణికంగా చూపిస్తారు. చరిత్రకారుల అంచనాలను బట్టి, నాగరికతకు మూలం ఒకటి అగ్ని అయితే, మరొకటి ఆయుధం. ఏనాడైతే మానవుడు ఆయుధాన్ని కనిపెట్టాడో, అక్కడి నుంచే వేటాడే విధానంలో మార్పు వచ్చిందనీ, ఆ మార్పే మానవుల ఒంటిపైకి బట్టలను కూడా తెచ్చిందనీ చెబుతారు.
రాయికి పదును పెడితే అది మంచి ఆయుధంగా మారుతుందని మానవులు భావించారు. అలా కనిపెట్టిన రాతి ఆయుధాలతో జంతువులను వేటాడేవారు. ఈ క్రమంలో అప్పటి వరకు ఎండొచ్చినా, వానొచ్చినా, మంచు కురిసినా, చెట్టునో, పుట్టనో, ఏ గుహనో మాత్రమే ఆశ్రయించిన మానవుడు, రాతి పనిముట్లతో జంతువుల చర్మాన్ని వలిచి వస్త్రంలా కప్పుకుంటే, అన్ని వేళలా గుహల అవసరం ఉండదని గమనించాడు.
అలా మొదలైన మానవ నాగరికత మెల్ల మెల్లగా పరిణతి చెంది, మట్టిలో దాగున్న లోహాన్ని వెలికి తీసి, దానితో తనకు కావలసిన ఆయుధాలనూ, పనిముట్లనూ తయారు చేయడం మొదలు పెట్టాడు. అలా చరిత్రలో మానవులు వాడిన పనిముట్ల ఆధారంగా, మానవ జీవన క్రమాన్ని మూడు వరుసలలో విభజించారు చరిత్రకారులు. మొదటిది రాతి యుగం అయితే, రెండవది కాంస్య యుగం, ఆఖరిది ఇనుప యుగం.. ఆ తర్వాత వచ్చినది మొత్తం ఆధునిక యుగంగానే పరిగణించాలని చరిత్రకారులంటున్నారు.
ఇప్పటి వరకు దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం, మనిషి మట్టిలోని లోహాలలో ముందుగా రాగి, తరువాత కంచును కనిపెట్టి, వాటితో ఆయుధాలనూ, పనిముట్లనూ, ఆభరణాలను కూడా తయారుచేయడం మొదలుపెట్టినట్లూ, ఆ తర్వాతే ఇనుమును కనిపెట్టినట్లూ తెలుస్తోంది. సరిగ్గా ఇక్కడే పాశ్చాత్య పరిశోధకులు ఒక పన్నాగం పన్నారని చెప్పవచ్చు.
Smelting.. అంటే, మట్టిలో దాగున్న వివిధ రకాల లోహాలను, కొన్ని రకాల కెమికల్స్ వాడి, అధిక ఉష్ణోగ్రతలో వేడి చేసి బయటకు తీసే విధానాన్ని Smelting అని అంటారు. ఈ విధానం ద్వారానే దాదాపు సామాన్య శకానికి 1500 సంవత్సరాల పూర్వం, ఇనుమును కనుగొన్నారు. అది కూడా యూరోప్ కి దగ్గరగా ఉండే ప్రదేశాలలో ఈ ఆవిష్కరణ జరిగింది. అక్కడి నుంచి అది ప్రపంచం మొత్తం పాకింది. భారత దేశానికి కూడా అలాగే వచ్చిందని చరిత్రకారులు ఇంతకాలం చెబుతూ వచ్చారు. హరప్పా, మొహేంజొదారో ప్రాంతాలలో దొరికిన వస్తువులలో ఎక్కడా ఇనుముతో చేసిన పనిముట్లు దొరకలేదని చరిత్ర కారులు చెబుతున్నారు. హరప్పా, మొహేంజొదారోలో రాగి, కంచుతో చేసిన పనిముట్లూ, ఆయుధాలూ, ఆభరణాలూ, వంట సామానూ వినియోగించినట్లు మాత్రమే తెలిసిందనీ, ఎక్కడా ఇనుమనేది కనిపించలేదని చరిత్ర కారులు చెప్పుకొచ్చారు.
అలాగే, భారతీయ పురాతన ఆచార వ్యవహారాలలో కూడా, రాగి, కంచుతో చేసిన వివిధ రకాల వస్తువులకు, పాత్రలకు, దేవుడి విగ్రహాలకూ ప్రాధాన్యతను ఇచ్చేవారు. వంట చేసుకునే ప్రాత్రలలో కూడా పూర్వం మట్టి, లేదా రాగితో చేసిన వస్తువులనే వాడేవారు. ఇనుము వాడకం పెద్దగా ఉండేది కాదు. ఇలా కొన్ని అంశాలను చూపించి మన దేశ చరిత్రను అణగదొక్కాలని చూశారు. హరప్పా, మొహేంజోదారోలో నిజంగా ఇనుప వస్తువులు దొరకలేదో, లేక ఒకవేళ దొరికినా అది బయటి ప్రపంచానికి తెలియకుండా చేశారో తెలియదు కానీ, ఇప్పుడు బయటపడ్డ నిజం యావత్ ప్రపంచాన్నీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు.
ఆ నిజం పేరే ‘Sivagalai’. ఇది దక్షిణ తమిళనాడు లోని ఓ చిన్న ఊరు. ఒక రోజు పొలం పని చేస్తున్న స్థానిక వ్యక్తికి తానెప్పుడూ చూడని ఓ వింత వస్తువు భూమిలో దొరకడంతో, ఆ విషయాన్ని అధికారులకి తెలియజేశాడు. అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, పురావస్తు శాఖ వారితో అక్కడ త్రవ్వకాలు జరిపించగా, వారికి మరి కొన్ని పురాతన వస్తువులు లభించాయి. వాటిలో తుప్పుపట్టిన స్థితిలో కుండలు, ఇనుముతో చేసిన కత్తులు, బాణాలు కనిపించాయి. దాదాపు 84 వస్తువులను వెలికితీసిన పురావస్తు శాస్త్రవేత్తలకు, అక్కడ ఒక అంశం మాత్రం కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. అదే smelting చేసిన ఆనవాళ్లు. అక్కడ దొరికిన కుండల్లో వివిధ రకాల ధాతువులతో కూడిన పదార్ధం కనిపించింది. దాన్ని పరిశీలించి, ఇనుప ఖనిజం నుంచి ఇనుమును బయటకు తీసే ప్రక్రియ వాడినట్లు వారు నిర్ధారించారు. వెంటనే వారికొచ్చిన సందేహాన్ని నిర్ధారించుకోడానికి, Sivagalai లో దొరికిన సాంపిల్స్ ని మూడు వేర్వేరు ల్యాబ్స్ కి పంపించి, అవి ఏ కాలానికి చెందినవో పరిశోధించమన్నారు.
అలా వారు పంపిన మూడు సాంపిల్స్ లో, ఒకటి అమెరికాకూ, ఇంకొకటి Ahmedabad కూ, మరొకటి Lucknow కూ వెళ్లాయి. ఆ మూడు ప్రదేశాలలో చేసిన Carbon dating ప్రక్రియలో విస్తుపోయే నిజం బయట పడింది. ఆ నిజం, ఇప్పటి వరకూ పాశ్చాత్య నాయకులూ, చరిత్రకారులూ చేస్తున్న ఓ తప్పుడు ప్రచారానికి సమాధి కట్టే విధంగా ఉంది. పురావస్తు అధికారులకు ఆ మూడు టెస్ట్ రేపోర్ట్స్ ఒకే కాలాన్ని సూచించాయి. అదే సామాన్య శకానికి పూర్వం 3345 వ సంవత్సరమని. అంటే ఇంచుమించు 5 వేల 500 ఏళ్ల పూర్వమే మన దేశంలో ముడి ఖనిజం నుంచి ఇనుమును వేరు చేసి, ఇనుప వస్తువులను తయారు చేసినట్లు ఆ పరిశోధన నిరూపించింది.
ఇప్పటివరకూ పాశ్చాత్య చరిత్రకారులు చెప్పినదాని ప్రకారం, అసలు ఇనుమును కనుగొన్నది 3500 ఏళ్ల క్రితం మాత్రమే. అది కూడా వారి ప్రకారం పశ్చిమ దేశాలలోనే కనుగొనబడింది. అక్కడి నుంచి ఆ పరిజ్ఞానం ప్రపంచానికి వ్యాపించిందని వారి వాదన. హరప్పా, మొహేంజోదారోలో ఇనుప వస్తువులు దొరకకపోవడంతో, భారత దేశం దగ్గర కూడా ఆ పరిజ్ఞానం లేదని వారికి వారే నిర్ధారించుకుని, తామే మొట్టమొదటి ఇనుము వాడకం దారులమని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు Sivagalai లో దొరికిన ఆధారాలు, ఆ తప్పుడు ప్రచారాన్ని పూర్తిగా పటాపంచలు చేసేసింది.
చరిత్రను సరిగ్గా గమనిస్తే, కొన్ని అంశాలు ఎంతో వివరంగా, కాస్తంత గుప్తంగా చెప్పబడ్డాయి. అటువంటి వాటిలో మొదటిది, స్థానిక లభ్యత. సాధారణంగా స్థానికంగా దొరికే వివిధ వస్తువులను మనం విరివిగా వాడటంతో పాటు, వాటిని ఇతర ప్రదేశాలకు కూడా ఎగుమతి చేస్తాం. స్థానికంగా లభించే ముడి పదార్ధాలతోనే వస్తువులను తయారు చేస్తూ ఉంటాం. ఉదాహరణకు కొబ్బరి తోటలు ఎక్కువగా ఉండే చోటినుంచి కొబ్బరి కాయల ఎగుమతితో పాటు, కొబ్బరి నూనె తయారు చేసి అమ్మడం, కొబ్బరి పీచుతో వివిధ వస్తువులను తయారు చేసి అమ్మడం లాంటివి చూస్తూ ఉంటాము. ఖనిజాల విషయంలోనూ అదే పద్ధతి వర్తిస్తుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు, పూర్వం నుంచి Sivagalai పరిసర ప్రాంతాలలో ఇనుముతో కూడుకున్న ఖనిజం దొరికేది. ఆ పరిసరాలలో ఎక్కడా రాగి, కాంస్యం లేదు. అలా Sivagalai వాసులకు ఆదినుంచే ఇనుముతో వస్తువులు చేయడం అలవాటు.
అయితే మన దేశంలో iron-ore ను smelting చేసిన పురాతన ఆధారాలు Sivagalai తో పాటు, తమిళనాడులోని Mayiladuthurai, Kodumanal అనే ఊర్లలోనూ, కర్ణాటకలోని Hallur లోనూ దొరికినట్లు, పురావస్తు అధికారులు చెబుతున్నారు. వాటన్నిటిలోకీ Sivagalai లో దొరికిన ఆధారాలు అత్యంత పురాతనమైనవని తెలుస్తోంది. ఆ ప్రదేశంలో దొరికిన ఆధారాలను బట్టి, అప్పట్లో ఇనుప ఖనిజాన్ని వెలికితీసి, తమంతట తామే ఇనుమును వేరు చేసి, వివిధ వస్తువులను తయారు చేసేవారు. ముఖ్యంగా స్థానికం ఆయుధాలను తయారు చేసి, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారని, చరిత్రకారులు అంచనా వేస్తున్నారు.
పూర్వం వస్తువుల తయారీ రెండు విధాలుగా జరిగేది. ఆ దేశ రాజ సంస్థానం కోసం పనిచేసే వారు ప్రత్యేకంగా కొంతమంది ఉంటే, మరికొంతమంది తమ కుటుంబాలతో నివసిస్తూ, తమకు తెలిసిన కళలతో వస్తువులను తయారు చేసి, దేశ విదేశాలకు అమ్మేవారు. Sivagalai లోని నాటి వ్యక్తులు ఆ రెండవ కోవకు చెందిన వారని నిపుణులంటున్నారు. ఇక పాశ్చాత్య చరిత్రకారుల తప్పుడు కథ అయిన ఆర్య సిద్ధాంతం విషయానికి వస్తే, వారి ప్రకారం పశ్చిమ దేశాలలో పుట్టిన ఆర్యులు ముందుగా భారత దేశంలోకి వచ్చి, ఇక్కడి స్థానిక ఆటవిక తెగలను educate చేశారు. మరీ ముఖ్యంగా దక్షిణ భారత ప్రజలు ఆర్యుల వల్లనే నాగరికులుగా మారారని ప్రచారం చేశారు. ఇప్పుడు Sivagalai లో దొరికిన ఆధారాలన్నీ, పాశ్చాత్యులు ప్రచారం చేసిన ఆర్య సిద్ధాంతాన్ని పటాపంచలు చేసేశాయి. అసలు ఐరన్ smelting గురించి ఎవరు ఎవరికి నేర్పించారు..? అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఇప్పటి వరకు పశ్చమ దేశాల వారు ప్రపంచానికి నేర్పించారనే సమాధానం వచ్చేది. ఇప్పడు దానికి సమాధానం మారింది.
మన చరిత్రనూ, పురాణాలనూ పరిశీలించినా ఇనుము గురించిన ఆధారాలు దొరుకుతాయి. సూర్య వంశ రాజులూ, చంద్ర వంశ రాజులూ మొదటి నుంచీ ఇనుముతో చేసిన కత్తులూ, వివిధ రకాల ఆయుధాలనూ వాడినట్లు మన పురాణాలను పరిశీలిస్తే తెలుస్తుంది. రాముడు వేసిన సాధారణ బాణాలు కూడా ఇనుముతో చేసినట్లు రామాయణం ద్వారా తెలుస్తుంది. మహా భారత కాలంలో కూడా ఆయుధాలలో ఇనుము విరివిగా వాడినట్లు తెలుస్తుంది.
చరిత్రను పరిశీలిస్తే, ప్రపంచ వింతలలో ఢిల్లీలో ఉన్న Iron Pillar ఒకటి. రెండవ చంద్రగుప్తుడి కాలంలో తయారు చేసిన ఆ ఇనుప స్థంభం ఇప్పటికీ చెక్కు చెదరకుండా, తుప్పు కూడా పట్టకుండా ఎంతో దృఢంగా నిలబడి ఉంది. సాధారణంగా ఇనుమును సరైనా జాగ్రత్తలు తీసుకోకపోతే, కొద్ది రోజులకే తుప్పు పట్టడం సహజం. కానీ ఆ Iron Pillar మాత్రం ఈ సూత్రాలను పూర్తిగా చెరిపేసింది. ఇప్పటికి ఆ pillar తయారీ విధానం ఏమిటనేది ఒక అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఇక్కడ మరింత ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఆ iron pillar ని తమిళనాడు లోని మధురైలో తయారు చేశారు. అది కూడా పూర్తి స్థంబంలా కాకుండా, సుదూర ప్రాంతాలకు సులువుగా తీసుకువెళ్ళడానికి వీలుగా, చిన్న చిన్న భాగాలుగా తయారు చేసి, వాటిని మధురై నుంచి ఢిల్లీ వరకు తీసుకువచ్చి, అక్కడ పూర్తి స్థంభంగా అతికించి నిలబెట్టారనీ చరిత్రకారులు చెబుతున్నారు. కానీ ఆ స్థంభాన్ని పరిశీలిస్తే ఎక్కడా అతుకుల ఆనవాళ్లు కనిపించవు. దీనిని బట్టే లోహాలపై మన పూర్వీకుల పరిజ్ఞానం ఎంత ఆధునాతనంగా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.
మరోమాట, పాశ్చాత్యులు ఎంతో గొప్పగా చెప్పుకునే రోమన్ రాజులు, మన దేశంలో తయారు చేయబడిన కత్తుల కోసం వెంపర్లాడేవారు. ఒక విధంగా చెప్పాలంటే, నాటి రోమన్ రాజులూ, సైన్యాధికారులూ, ధనవంతులందరి దగ్గరా ఉన్న కత్తులు తయారైంది మన దేశంలోనే. రోమన్స్ మన దేశ కత్తులపై మోజు పెంచుకోడానికి కారణం వాటి దృఢత్వం, నాణ్యత. ప్రపంచంలోనే అత్యంత దృఢమైన లోహం మన దగ్గర దొరికేది. దానినే wootz steel అని పిలుస్తారు. ఈ wootz steel ని కూడా మన దక్షిణ భారతీయులు ఇనుముతో తయారు చేసేవారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో, ఈ wootz steel తయారీ విరివిగా ఉండేది. ముందుగా ఇనుప ఖనిజం నుంచి ఇనుమును వేరు చేసి, అందులో కొన్ని మిశ్రమాలు కలిపి, కొన్ని ప్రత్యేక పద్ధతులలో wootz steel ని తయారు చేసేవారు. అలా వచ్చిన ఇనుముతో కత్తులు తయారు చేసేవారు. బ్రిటిషర్లు మన దేశంపై దాడి చేసి, ఇక్కడ ఉన్న తయారీ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేంత వరకు, ప్రపంచంలోనే అత్యంత పదునైన, దృఢమైనవిగా ఉండేవి ఆ కత్తులు.
ఇలా చెప్పుకుంటూ పొతే, లోహాలపై మనకున్న పరిజ్ఞానం, ఈ ప్రపంచంలో ఇంకెవరికీ లేదనేది నిర్వివాద అంశం. పాశ్చాత్యులు ప్రచారం చేసుకున్నట్లు, ఇనుమును వారే కనుగొంటే, మరి వారి దగ్గర ఈ పరిజ్ఞానం ఎందుకు లేదు. ఇక ఇనుమును మొదటిసారి తయారు చేసిన ప్రదేశంగా భావిస్తున్న Anatolia ప్రాంతంలో ఎక్కడా, పెద్ద ఎత్తున ఇనుప పనిముట్లు, ఆయుధాలు చేసినట్లు ఆధారాలేవీ ఇప్పటివరకూ దొరకలేదు. మన దక్షిణ భారత దేశంలోని తమిళనాడు, కర్ణాటకలో కనుగొనబడిన ప్రతి పురాతన ప్రదేశంలోనూ ఇనుమును పెద్ద ఎత్తున తయారు చేయడమే కాకుండా, వాటితో భారీ మొత్తంలో రకరకాల వస్తువులను తయారు చేసి, వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసినట్లు ఆధారాలున్నాయి.
పురావస్తు అధికారుల ప్రకారం, వారు కనుగొన్న ప్రదేశాలలో పెద్ద ఎత్తున ఇనుమును తయారు చేసి, దానితో వివిధ రకాల పనిముట్లు చేసేవారనీ, అదంతా ఒక కమ్యూనిటీ లేదా కొన్ని వంశాల వాళ్ళు తరతరాలుగా చేసిన్నట్లు గుర్తించారు. ఈ లెక్కన 5 వేల సంవత్సరాలు కాదు, అంతకు ముందు నుంచే మన దగ్గర ఇనుము తయారీ, వాడకం ఉందని తెలుస్తోంది. ఇప్పటికైనా మన వారు పాశ్చాత్యులు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని పక్కకు నెట్టి, అసలైన చరిత్రను భావి తరాలకు అందేలా చేయాలని కోరుకుందాము.
ధర్మో రక్షతి రక్షితః
Comments
Post a Comment