Millions of Years Ago: The Manifestation of Kashi Vishweshwara | కాశీ విశ్వేశ్వరుడి ఆవిర్భావం!
కోట్ల సంవత్సరాల క్రితం కాశీ విశ్వేశ్వరుడి ఆవిర్భావం!
‘కాశీ’ గురించి ఈ ఆశ్చర్యకర నిజాలు మీకు తెలుసా?
ఆ పరమేశ్వరుడు వెలసిన పరమ పుణ్య క్షేత్రాలలో కాశీకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. జీవికి ముక్తిని ప్రసాదించే క్షేత్రంగా, మోక్షాన్ని ఇచ్చే పవిత్ర స్థలంగా కాశీని పేర్కొంటారు.
న గాయత్య్రా సమో మంత్రమ్ న కాశీ సదృశీ పురీ !
న విశ్వేశ సమంలింగం సత్యం సత్యం పునః పునః !!
గాయత్రీ మంత్రంతో సరిసమానమైన మంత్రమూ, కాశీ నగరానికి సరితూగే పుణ్య క్షేత్రమూ, అక్కడి విశ్వేశ్వర లింగంతో పోల్చదగ్గ శివస్వరూపమూ మరొకటి లేదని ఈ శ్లోక తాత్పర్యం. కాశీ ఎంత పురాతనమైనదో అంత సనాతనమూ, ఎంత పవిత్రమైనదో అంత మహిమాన్వితమైనదని శాస్త్ర విదితము. సాక్ష్యాత్తూ ఆ పరమేశ్వరుడే కొలువైన భూ కైలాసము. జీవన్మరణ చక్రంలో జీవికి ముక్తిని ప్రసాదించే జీవన్ముక్తి కారకం కాశీ, లేక వారణాసి గా వాడుకలో ఉన్న వారాణసి. కాశీనే మహా శ్మశానము అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు ఈ పట్టణంలోనే యజ్ఞం చేశాడు. ఆ ప్రదేశాన్ని దశాశ్వమేధ ఘట్టమని అంటారు. ఇది మహా పవిత్ర క్షేత్రము. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ క్షేత్రములో అష్టభైరవులు, నవదుర్గలు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, నవగ్రహాలు, గణపతులు కూడా ఉన్నారు. అందుకే ప్రతి హిందువూ జీవితంలో ఒక్కసారైనా పొందాలని కోరుకునేది కాశీ దర్శనం. వీలయితే చివరిరోజులలో అక్కడే గడపాలనీ, కాశీ మట్టిలోనే కలిసిపోవాలనీ ప్రతి హైందవుడి లక్ష్యం. కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమవుతాయి. కాశ్యాన్తు మరణాన్ ముక్తిః అని శాస్త్ర వచనం కాబట్టే చివరి దశ జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు. కానీ, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప కాశీక్షేత్ర పాలకుడైన బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు. అయితే కాశీకి వెళ్ళకపోయినప్పటికీ, అక్కడికి వెళదామని అనుకుంటే చాలు, వెళ్ళినంత ఫలం అందుతుంది. కాశీ యాత్ర చేస్తే ఐదు అశ్వమేధాలు చేసిన ఫలం కలుగుతుంది. అటువంటి మహిమాన్విత వారణాసిలో ఎన్నెన్నో మహిమలూ, మరెన్నో ఆశ్చర్యకర వాస్తవాలూ దాగున్నాయనే విషయం ప్రతివొక్కరికీ ఎంతోకొంత అవగాహన ఉండే ఉంటుంది. కానీ నవతరంలో ఆ విషయాలు పూర్తిగా తెలిసిన వారు అరుదే. మరి అటువంటి అద్భుత విషయాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/UR-QsRuWLZA ]
ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని, అతి ప్రాచీనమైన ప్రపంచ సాంస్కృతిక సుందర నగరం, ఈ భువిపై తొలి నాగరిక మహా నగరం కాశీపురమేనని మన పురాణాలూ వేదాలూ పేర్కొంటాయి. ఆధునిక పురావస్తు పరిశోధకులు కూడా ఈ మాటలను ధృవీకరిస్తున్నారు. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే, సాక్ష్యత్తు పరమేశ్వరుడే మానవుల కోసం నిర్మించిన పరమ పుణ్య క్షేత్రం కాశీ అని శాస్త్ర విదితం. అటువంటి కాశీ పుర నిర్మాణం నుంచి, చరిత్ర ఆద్యంతమూ ఎన్నో వింతలూ ఎన్నెన్నో రహస్యాలూ దాగి ఉన్నాయి. అటువంటి వాటిలో ఆ నగర నిర్మాణం ప్రధమం.
ఈ భూమిపై గొప్ప నాగరికతగా పాశ్చాత్యలు ప్రచారం చేసుకునే గ్రీకు సామ్రాజ్యానికి అంకురార్పణ జరగక ముందే కాశీ క్షేత్రం భాసిల్లినట్లు ఆధారాలున్నాయి. ప్రపంచంలో గొప్ప కట్టడాలు కేవలం ఈజిప్ట్ లోనే ఉన్నాయని చెప్పే విదేశీ పరిశోధకులు సైతం, కాలాంతరాలలో కాశీ యే అతి పురాతన, అత్యద్భుత మహా నగరంగా ఒప్పుకోక తప్పలేదు. కాశీ అంటే కేవలం ఓ పుణ్య స్థలమో, పురాతన కట్టడాలున్న మహానగరమో కాదు. అది మానవ మేధస్సుకందని అద్భుత నగర ప్రణాళికకు నాంది పలికిన దివ్య క్షేత్రం. అలాంటి ప్రాణాళికలతో కాశీ కంటే ముందు కానీ, ఆ తర్వాత కానీ, యుగాంతరాలలో మరో నగరం నిర్మితం కాలేదంటే, ఆదినుంచీ మనవారి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు.
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైద్య శాస్త్రం మన ఆయుర్వేదం. అందులో చెప్పబడిన ప్రకారం, మన శరీరంలో 108 మర్మ స్థానాలు ఉన్నాయి. వాటి వల్లనే మానవ శరీరం ఇంత గొప్పగా పనిచేయగలుగుతుందని చెప్పబడింది. ఆ విషయం దృష్టిలో ఉంచుకునే, కాశీలో మొత్తం 108 మూల క్షేత్రాలు నిర్మించబడ్డాయి. ఇవన్నీ మానవ శరీరంలో ఉండే మర్మ స్థానాలలానే ఒకదానికొకటి ఓ క్రమ పద్ధతిలో అనుసంధానమై ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ 108 మూల క్షేత్రాలలో 54 శివుడికీ ఆయన గణాలకూ సంబంధించినవైతే, తక్కిన 54 శక్తి క్షేత్రాలు. అంటే ఇక్కడ సగం పురుషుడూ, సగం స్త్రీ శక్తీ కలిగిన అర్ధనారీశ్వర తత్వం ఆధారంగా కాశీ క్షేత్రం నిర్మితమయ్యిందని తెలుస్తోంది. అందుకే ఇలాంటి పుర ప్రణాళిక ‘న భూతో న భవిష్యతి’ అని ఆధునిక శాస్త్రవేత్తలు సైతం ఒప్పుకుంటున్నారు.
అసలు సృష్టికి పూర్వమే పవిత్రమైన కాశీ పట్టణమున్నదని చెబుతారు. తేజో రూపుడు, సచ్చిదానంద స్వరూపుడు అయిన పరబ్రహ్మ ఈ లోకాన్ని సృష్టించదలచి, నిరాకారుడిగా ఉన్న తను సాకారుడయ్యాడు. ఆ తరువాత తన నుండి శక్తిని బయటకు పంపాడు. అదే ప్రకృతి శక్తి. అలా ప్రకృతి, పురుషుడు ఇద్దరూ ఉన్నట్లయింది. వీరిద్దరూ సంచరించటానికి కొన్ని యోజనాల విస్తీర్ణము కలిగిన కాశీ పట్టణాన్ని నిర్మించాడు పరమేశ్వరుడు. ప్రళయ కాల రుద్రుడూ, లయకారుడూ ఆ పరమేశ్వరుడు. అంతటి స్వామి స్వయంగా కొలువైన క్షేత్రం, ఎటువంటి జల ప్రళయానికీ చెక్కు చెదరకుండా ఉండే విధంగా సృష్టించబడిందని అంటారు. ఈ కారణాల వల్లనే కాశీ నగరం దైవ నిర్మితమనీ, మహా యుగాలకు పూర్వం అంతటి జ్ఞానం మానవులకు ఉండే అవకాశం లేదని చెప్పేవారూ లేకపోలేదు.
అలా పురుషుడు నిరాకార పరబ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి ఈ సృష్టి ఆరంభం కోసం తపస్సు చేస్తున్నాడు. ఆ పురుషుడే శ్రీమన్నారాయణుడు. ఆయన తపస్సు చేస్తుండగా ఆయన శరీరము నుంచి నీరు కాల్వలై ప్రవహించింది. ఆ నీటిని చూసి ఆశ్చర్యపోయిన పురుషుడు ఒక్కసారిగా తల విదిలించాడు. ఆ ఊపుకు చెవులకు పెట్టుకున్న కమ్మ ఊడి నేలమీద పడింది. ఆ కమ్మ పడిన ప్రదేశాన్నే 'మణికర్ణిక' అంటారు. ఇది చాలా పవిత్రమైన ప్రదేశం.
విష్ణువు ప్రకృతితో కలిసి నీటి మీద నిద్రిస్తున్నాడు. ఆయన నాభి నుంచి కమలాసనుడు ఉద్భవించాడు. ఆయన పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారము సృష్టి కార్యక్రమము మొదలు పెట్టాడు. మొదటగా ఐదు వందల కోట్ల యోజనాల విస్తీర్ణము గల బ్రహ్మాండమును సృష్టించాడు. దానికి నాలుగు వైపులా పధ్నాలుగు లోకాలను సృష్టించాడు. ఈ బ్రహ్మాండమంతా నీటి మీద పడవలాగా తేలి ఆడుతోంది. దానిని అష్ట దిగ్గజాలు మోస్తున్నాయి. ఈ బ్రహ్మాండంలో సగభాగం భూలోకము, పావు వంతు ఊర్ధ్వలోకము, మరో పావు వంతు అధోలోకము.
ఆది నారాయణుడూ, బ్రహ్మాది దేవతలూ, మహర్షులందరూ కలిసి ఈశ్వరుణ్ణి ప్రార్ధించారు. వారి ప్రార్ధనను మన్నించిన ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకొమ్మన్నాడు. వారంతా ముక్త కంఠంతో ఆ నిరాకార పరబ్రహ్మాన్ని కాశీ పట్టణంలో జ్యోతిర్లింగ రూపంలో వెలసి, శాశ్వతంగా పూజలందుకొమ్మని కోరారు. భక్తుల కోరికను మన్నించాడు పరమాత్ముడు. అలా వెలసిన పరమాత్మనే విశ్వేశ్వరుడిగా మనం కాశీలో దర్శించుకోవచ్చు.
ఇక కాశీ క్షేత్రానికున్న మరో పేరు వారాణసి. ఆ నగరానికి ఆ పేరు రావడం వెనుకవున్న కారణం, కాశీకి ఉత్తర, దక్షిణ దిక్కుల్లో వరుణ, అసి అనే రెండు నదులు ప్రవహిస్తూ వెళ్ళి గంగలో కలుస్తాయి. ఆ రెండు నదుల పేరుమీదనే ఆ ప్రాంతానికి వారాణసి అనే పేరు వచ్చింది. కాలక్రమంలో అది కాస్తా వారణాసిగా రూపాంతరం చెందింది. అసి అనే నదిలో స్నానం చేసిన వారికి దోషాలు నశించేలా, వరుణ నదిలో స్నానం చేసిన వారికి విఘ్నాలు తొలగేలా దేవతలు అనుగ్రహించారు. ఆ రెండు దివ్య నదులూ అలా ప్రయాణించి, దివి నుండి భువికి దిగి వచ్చిన గంగా నదిలో కలిసే ప్రదేశం కావడం చేత, కాశీ లోని గంగలో మునక వేసినంత మాత్రానే సర్వ దోషాలూ, సకల పాపలూ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఆధునిక పరిశోధకులు కూడా కాశీలో ప్రవహించే గంగలో అద్భుతమైన ఔషధీ గుణాలున్నాయనీ, అందువల్లనే ఆ నీటిలో స్నానం చేసిన వారికి సర్వ రోగాలూ నయమవుతాయనీ నిరూపించారు.
కాశీపురాన్ని ఆ విశ్వేశ్వరుడు ఎప్పుడూ విడిచి ఉండడు కాబట్టి, దానికి అవిముక్త క్షేత్రం అని పేరొచ్చింది. అటువంటి క్షేత్రం ఓ జ్యోతిర్లింగంతో పాటు, దక్ష యజ్ఞం తర్వాత సతీ దేవి శరీరం భాగం పడి, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా నిలిచింది. ఈ కారణాలవల్ల ఆ క్షేత్ర మహిమ అనంతం అని ఆర్యోక్తి. కాశీ నగరం కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రదేశమే కాదు.. అదో మహా జ్ఞాన భాండాగారం. అందుకే ప్రతి నిత్యం దేవతలు అక్కడ అదృశ్య రూపంలో సంచరిస్తూ ఆ జ్ఞాన సంపదకు నిత్య పూజలు చేస్తారు. కురుక్షేత్ర మహా సంగ్రామం తర్వాత తమకు అంటిన పాపాలను ప్రక్షాళన చేసుకునేందుకు, పాండవులు కాశి క్షేత్రంలోనే కొన్నేళ్లపాటు యజ్ఞ యాగాదులు నిర్వహించారని మన పురాణాల ద్వారా తెలుస్తోంది. బుద్ధుడు తన విద్యాభ్యాసం కాశిలోనే పూర్తి చేశాడు. ఆది శంకరాచార్యులు బ్రహ్మసూత్ర భాష్యాన్నీ, భజ గోవింద స్తోత్రాన్నీ, వేద వ్యాసుడు విభజించిన వేదాలకు భాష్యాలనూ కాశీ క్షేత్రంలోనే రచించారు.
వారణాసి కేవలం ఆద్యాత్మిక పరంగానే కాకుండా, సంగీతం, చిత్ర లేఖనం వంటి కళలతోపాటు, ఆ కాలంలో వ్యాపారానికి కూడా ముఖ్య పట్టణంగా ఉండేదని చరిత్రద్వారా తెలుస్తోంది. అందుకే పూర్వం వాణిజ్యపరంగా కాశీ నగరంలో, అఖండ భారతావని నుంచే కాకుండా, ఇటు ఆసియా నుంచీ, అటు ఆఫ్రికా, ఐరోపా ఖండాలలోని వ్యాపారులతో కూడా వాణిజ్య లావాదేవీలు జరిపిన చరిత్ర పదిలంగా ఉంది. నేటి కాలంలో గొప్ప శాస్త్రవేత్తగా చెప్పబడే ‘అల్బర్ట్ ఐన్ స్టీన్’ స్వయంగా, ఆధునిక సాంకేతికతకు అవసరం అయ్యే గణిత పరిజ్ఞానం, భారత దేశం నుంచే లభిస్తుందని పేర్కొన్నారు. అటువంటి గణితానికి పుట్టినిల్లు కాశీ క్షేత్రమే అని పరిశీలకులు చెబుతున్నారు.
ఇక కాశీ క్షేత్రంలో నేటికీ కనిపించే కొన్ని వింతల విషయానికి వస్తే, కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలకు వాసన పట్టదు. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు. అందుకే మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. కాశీ విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది. అలాగే, పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత భక్తుల చేతి రేఖలు మారి పోతాయని అంటారు. ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగమంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణా దేవి నివాస స్థలం. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లిగా, అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీ లోనే వున్నది.
కాశీలో మరణిస్తే చాలు, ఎంతటి క్రూరకర్ముడైనా సరే కైలాసం చేరతాడని ఆర్యోక్తి. రామేశ్వరములోని ఇసుకను తెచ్చి కాశీలోని విశ్వేశ్వరుడికి అభిషేకం చేసినవాడికి పునర్జన్మ ఉండదని అంటారు. అంతెందుకు! యజ్ఞ యాగాదులు చేసి స్వర్గసుఖాలూ అనుభవించేకన్నా కాశీలో పిశాచమై తిరగడం మిన్న అని చెబుతారు. అటువంటి మహత్తరమైన ప్రాముఖ్యత గల కాశీలోని జ్యోతిర్లింగమే విశ్వేశ్వరుడనే పేరుతో పిలవబడుతోంది. ఇలా సనాతన కాశీ క్షేత్రం గురించి చెప్పుకుంటూ పోతే వినడానికి మన జీవిత కాలం సరిపోదు. ఈ స్థల మహత్యం గురించి సంపూర్ణంగా వివరించడం అంటే దేవతలకు కూడా సాధ్యం కాదేమో..? ఈ సంక్షిప్త వివరణ సముద్రంలో నీటి బిందువు లాంటిదే అయినా, హిందువులందరికీ ఉపయోగ పడుతుంది.
శుభం భూయాత్!
Comments
Post a Comment