The Mysterious Puri Vimaladevi Temple — Where Goddess Accepts Meat Offering! | పూరీ విమలాదేవి క్షేత్రం!

 

పూరీ విమలాదేవి క్షేత్రం!
ఈ క్షేత్రంలో అమ్మవారికి మాంసం నైవేద్యంగా పెడతారు!

విష్ణుమూర్తి సంబంధిత వైష్ణవ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు, మనకు ఎక్కువగా కనిపించే దృశ్యాలు, ప్రశాంతమైన వాతావరణం, తులసీమాలలను తాకుతూ వీచే చల్లటి గాలి, స్వామి వారి కోసం ప్రత్యేకంగా పూయించిన వివిధ రకాల పువ్వుల నుంచి వెలువడే సుగంధ పరిమళాలు, ఆ దేవదేవుడి కోసం సిద్ధంచేసి ఉంచిన రకరకాల నైవేద్యాల నుంచి వచ్చే కమ్మటి వాసనలు, వీటన్నిటినీ మించి.. చూపులను మరల్చనీయకుండా ఎంత చూసినా తనివితిరని ముగ్ధ మనోహరమైన స్వామివారి విగ్రహం. జన్మజన్మల పాపాలను తొలగించే ఆ స్వామి దర్శనం, ఎలాంటి బాధలనైనా తొలగించి, నీకు నేనున్నానని ధైర్యమిచ్చే అభయ హస్తం.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఆ స్వామి వర్ణననికి కోటి జన్మలైనా సరిపోదు. అంతటి ప్రభావం ఉండటం వల్లనే ప్రతి ఒక్కరూ ఆ స్వామి ఆలయానికి పదే పదే వెళ్లాలని పరితపిస్తుంటారు. ఆ తపన తాలూకు ఉచ్ఛస్థితి ఎలా ఉంటుందో చవిచూడాలంటే, ఒక్కసారి తిరుమల క్షేత్రానికి వెళ్ళివస్తే ఎవరికైనా అర్ధం అవుతుంది. అయితే.. మన దేశంలోని ఒక ప్రముఖ వైష్ణవాలయంలో ఈ పద్ధతికి భిన్నంగా జంతు బలులు ఇచ్చే ఆచారం ఉందని మీకు తెలుసా.. పైగా ఇచ్చిన బలిని రుచికరంగా వండి నివేదిస్తారు కూడా! అక్కడ స్వామి ఉంటున్న ఆలయ స్థలం ఆయనది కాదనీ, వేరొకరి స్థలంపై ఆయన ఉంటున్నాడనీ తెలుసా..? ఆ క్షేత్రం మరేదో కాదు.. సాక్ష్యాత్తు ఆ జగన్నాథుడు కొలువైన పూరీ క్షేత్రమే. ఈ మాట వినగానే చాలా మందికి ఆశ్చర్యంగానూ, వింతగానూ అనిపించడంలో తప్పులేదు. మరి ఈ విషయాల వెనుకవున్న అసలు మర్మం ఏంటో తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/gb_i66YDTW8 ]


ఒరిస్సా Tourism official లోగోను గమనిస్తే, పూరీ జగన్నాథుడి ఆలయం బొమ్మ ఉండి, దానికింద India’s Best Kept Secret అని రాసి ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు.. పూరీ ఆలయం ఎన్నో రహస్యాలను నింపుకున్న ఒక వైష్ణవ క్షేత్రం అని. అటువంటి రహస్యాలలో విమలా దేవి ఆలయం కూడా ఒకటి. ఒరిస్సా వాసులూ, ఉత్తర భారతీయులు, ఆ తల్లిని బిమలా దేవి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, విమలా దేవి మందిరం సాదారణ ఆలయం కాదు.. అది ఒక శక్తి పీఠం.

శక్తి పీఠాలు ఏర్పడటం వెనుకవున్న దక్షయజ్ఞం గాథ చాలామందికి తెలిసే వుంటుంది. సతీ దేవి మరణం తర్వాత, ఆమె శరీరాన్ని పట్టుకుని రోదిస్తున్న శివుడిని తిరిగి కర్తవ్యోన్ముఖుడిని చేయడానికి, విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ఖండించాడు. అలా ఖండించబడిన ఆ తల్లి శరీరభాగాలు భారత ఉపఖండంలో వేర్వేరు చోట్ల పడ్డాయి. అలా పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా ఉద్భవించడం తెలిసిందే. మన పురాణాలు, వేదాల ప్రకారం, శక్తి పీఠాలు మొత్తం 108 ఉన్నాయి.. వాటిలో ముఖ్యమైనవి 51.. వాటిలో అత్యంత శక్తివంతమైనవి 18.. వాటినే అష్టాదశ శక్తిపీఠాలుగా కొలుస్తారు. ఆ 18 శక్తి పీఠాల గురించి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ మిగిలిన శక్తి పీఠాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అటువంటి ముఖ్యమైన 51 శక్తి పీఠాలలో ఒకటే, పూరీ జగన్నాధుడి క్షేత్రంలో ఉన్న విమలా దేవి ఆలయం.

ఈ క్షేత్రంలో ఆ జగన్మాత పాదం పడిందని తెలుస్తోంది. ఆ తల్లి ఆలయం పూరీ క్షేత్రంలో నైరుతి మూలన ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, స్వామివారి ప్రధాన గోపురానికి పశ్చిమం వైపున, ఆ క్షేత్రంలో అత్యంత పవిత్రంగా భావించే రోహిణి కుండ్ పక్కనే, విమలా దేవి ఆలయం ఉంటుంది. ఆమె విగ్రహం, పూర్తిగా విచ్చుకున్న కమలంపై కూర్చుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, సాధారణంగా శక్తి పీఠాలలోని ప్రధాన ఆలయంలో ఇతర దేవతలు కనిపించరు. కానీ విమలా దేవి ఆలయంలో మూల విరాట్టు పక్కనే, సప్త మాతృకలైన బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండి విగ్రహాలు కొలువై ఉంటాయి. ఇక్కడ విమలా దేవి పరివార సమేతంగా, క్షేత్రపాలకురాలిగా పూరీని రక్షిస్తోందని తెలుస్తోంది.

సాధారణంగా వైష్ణవాలయాలలో క్షేత్రపాలకుడిగా శివుడు లేదా, ఆంజనేయుడు ఉంటారు. శక్తి పీఠాలలో క్షేత్రపాలకుడిగా వినాయకుడు, శివుడు, సుబ్రహ్మణ్యస్వామి లాంటి వారు ఉంటారు. మరి ఇక్కడ మాత్రం క్షేత్రపాలకురాలిగా అమ్మవారు ఉండడమేమిటి అనే సందేహం కలగవచ్చు. ఆ విషయం తెలియాలంటే, అసలు పూరీ ఆలయం నిర్మితమయ్యే సమయంలో జరిగిన ఒక గాథ తెలియాలి. ఈ గాథను ఎక్కువగా విని ఉండరు.

తిరుమల శ్రీవేంకటేశ్వరుని చరిత్రలో స్వామివారి కళ్యాణం తర్వాత, అమ్మవార్లతో కొలువై ఉండటానికి అనువైన ప్రదేశాన్ని వేతికినప్పుడు, ఆది వరాహ స్వామి వారి ఆధీనంలోని ప్రదేశమైన వేంకటాద్రిని ఎంచుకోవడం, ఆయన వద్ద అనుమతి తీసుకుని తొండమాన్ చక్రవర్తి చేత ఆనంద నిలయాన్ని నిర్మింపజేసుకోవడం వంటి వివరాలు వినే ఉంటారు. అదే విధంగా, పూరీ క్షేత్ర నిర్మాణ సమయంలో కూడా ఒక చారిత్రక ఘటన ఉంది. పూరీ క్షేత్రం, కలియుగంలో 11వ శతాబ్దంలో, కళింగ దేశాన్ని పాలించిన తూర్పు గంగ రాజవంశానికి చెందిన, అనంతవర్మ చోడ గంగదేవ చక్రవర్తి కట్టించాడని అందరూ అనుకుంటారు. కానీ అది కొంతవరకే వాస్తవం. అనంతవర్మ కేవలం ఆలయాన్ని పునర్నిర్మితం మాత్రమే చేశాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న పూరీ ఆలయం. ఆయన 11వ శతాబ్దంలో మొదలు పెట్టిన ఆలయ పురుద్ధరణ, దాదాపు 12వ శతాబ్ది ఆరంభంలో, అనంతవర్మ చోడగంగదేవ మనుమడైన అనంగ భీమదేవుడు పూర్తి చేశాడు. ఎంతో అద్భుతంగా, అమిత పటిష్ఠంగా నిర్మితమైన ఈ క్షేత్రం, అత్యంత పవిత్రమైన పుణ్యస్థలంగా నెలకొంది. ఆలయ పవిత్రతను కాపాడటానికి అనంగ భీమదేవుడు ఎన్నో నియమాలను ఏర్పాటుచేశాడు. ఏనాడో ఆయన పెట్టిన నియమాలే ఈ నాటికీ తూచా తప్పకుండా పాటించబడుతున్నాయి.

అయితే, పూరీ క్షేత్ర మూలాలు కృత యుగం నుంచే ఉన్నాయని తెలుస్తోంది! ఇక్కడి స్వామిని జగన్నాధుడిగానే కాకుండా, నీలమాధవుడనే పేరుతో కూడా కొలుస్తారు! అలా ఎందుకో తెలియాలంటే, కృత యుగంలో స్వామి లీలల గురించి తెలియాలి. ఆ కాలంలో ఒకనాడు శ్రీమహావిష్ణువు స్వయంగా నేటి పూరీ ప్రాంతానికి కొద్ది దూరంలోని సముద్ర తీరానికి చేరి, అక్కడి వేపచెట్టు కింద విశ్రమించారు. ఆ ప్రదేశం స్వామి వారికి నచ్చి, ఆయన వైకుంఠానికి తిరిగి వెళ్ళే సమయంలో, తన శక్తిని ఒక నీలమణి రూపంలో అక్కడ విడిచి వెళ్ళారు. ఆ మణి ప్రకాశవంతంగా వెలిగిపోతూ, కోరిన వారికి కోరిన వరాలను సమకూర్చడం మొదలు పెట్టింది. అది అలాగే కొనసాగితే భూమిపై ధర్మం వక్రమార్గం పట్టే ప్రమాదం ఉందని బయపడిన యమధర్మ రాజు, ఆ మణి ఎవరికీ కనపడకుండా అక్కడే భూమిలో కలిసిపోయేలా చేశాడు. అలా భూమిలో కలిసిన ఆ నీలమణి శక్తి, పక్కనే ఉన్న వేపచెట్టులోకి చేరి, అందులోంచి ఒక విష్ణురూపం బయటకు వచ్చింది.

ఆ యుగంలో మాళవ రాజ్యాన్ని పాలించిన ఇంద్రద్యుమ్న మహారాజు గొప్ప దాన గుణ సంపన్నుడు. కానీ, ఎన్ని దానాలు, యజ్ఞ యాగాదులు చేసినా ఆయన మనసులో ఏదో అలజడి, ఆందోళనలతో సత్యమతమయ్యేవాడు. సరిగ్గా ఆ సమయంలో, తన రాజ్యానికి సమీపంలోని అడవులలో ఒక రహస్య ఆలయం ఉందనీ, అక్కడ చాలా శక్తివంతమైన విష్ణు స్వరూపం ఉందనీ, ఒక యాత్రికుడి ద్వారా తెలుసుకున్నాడు. అయితే ఆ ఆలయం ఉన్న ప్రదేశం కేవలం అక్కడి శబర గిరిజన రాజైన విశ్వావసుడుకి మాత్రమే తెలుసని అర్ధమై, ఆ ఆలయం జాడలు కనుక్కుని రమ్మని తన ఆస్థాన పురోహితుడి కుమారుడు విద్యాపతిని పంపించాడు. అలా వెళ్ళిన విద్యాపతి ముందుగా విశ్వావసుడి  కూతురైన లలితను ప్రేమించి పెళ్ళాడాడు. వారి వివాహం జరిగిన తర్వాత, అడవిలో రహస్యంగా ఉన్న జగన్నాథుడి విగ్రహాన్ని తనకు చూపించమని ప్రాధేయపడ్డాడు. అల్లుడి కోరికను కాదనలేక, అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళ్ళాడు విశ్వావసుడు. దారి తెలుసుకునేందుకు విద్యాపతి తెలివిగా దారి పొడవునా ఆవాలు జారవిడిచాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి, దారి స్పష్టంగా తెలిసింది. వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెట్టాడు.

ఎంతో ఆశతో రాజు అడవికి చేరుకునే లోగా ప్రకృతి వైపరీత్యం ఏర్పడి, అక్కడి విగ్రహాలు మాయమయ్యాయని తెలిసింది. ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి, అశ్వమేథయాగం చేశాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. నేటి పూరీ ఆలయం ఉన్న ప్రదేశాన్నే నీలాచాలం అంటారు. నేటికీ పూరీ ఆలయంలో కృత యుగం నాటి ఆ నరసింహ స్వామి విగ్రహాన్ని దర్శించవచ్చు. ఆ స్వామి దర్శనంతో మోక్షప్రాప్తి పొందవచ్చని తెలుస్తోంది. ఒకనాడు రాజు అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి, సముద్రతీరంలో చాంకీనది ఒడ్డుకు వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ, వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశించాడు. ఆ విగ్రహాల తయారీకి స్వయంగా విశ్వకర్మ రావడం, ఆయన కొంత గడువు నిర్ణయించి, కొన్ని షరతుల మధ్య ఒక మూసివున్న గదిలో విగ్రహాలు చెక్కడం ప్రారంభించగా, భార్య తొందరపెట్టడంతో గడువు తిరకమునుపే రాజు గదితలుపులు తెరవడంతో విగ్రహాలు అసంపూర్ణంగా ఆగిపోవడం వంటి విషయాలు తెలిసే ఉంటాయి.

అలా తయారైన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవిల విగ్రహాలను నీలగిరి పై ఆలయాన్ని నిర్మించి ప్రతిష్టించారు. అయితే, నీలాచలం మీద రాజు అశ్వమేధ యాగం చేస్తున్న సమయంలో, అక్కడ కొలువై ఉన్న విమలా దేవి ఆశీస్సులు తీసుకుని, స్వామి విగ్రహాలు కనిపిస్తే అక్కడే ప్రతిష్ఠిస్తానని అమ్మవారిని ప్రార్ధించాడు. ఆ తల్లి దానికి అంగీకరించి, స్వామి క్షేత్రానికి క్షేత్రపాలకురాలిగా నిలుస్తానని వరం ఇచ్చినట్లు పురాణ గ్రంధాలలో పేర్కొనబడి ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ విధంగా నాడు విమలా దేవి సమక్షంలో నిర్మితమైన జగన్నాథుడు, బలరాముడు, సుభద్రా దేవిల విగ్రహాలకు, ఆ తల్లే రక్షగా నిలబడింది. అందుకు కృతజ్ఞతగా స్వామి కూడా, కాలభైరవ అంశతో తల్లికి రక్షగా ఉన్నట్లు పురాణాలలో పేర్కొనబడి ఉంది.

ఆ తల్లి తాను ఉండే  ప్రదేశాన్ని జగన్నాథుడికి ఇవ్వడంతో, నేటికీ అక్కడ తొలిగా విమలా దేవి దర్శనం చేసుకున్న తర్వతే స్వామి వారిని దర్శించాలనీ, లేకపోతే పూరీ వెళ్ళిన ఫలితం ఉండదనీ పురాణాలు పేర్కొంటున్నాయి. ఇదే విధమైన కట్టుబాటు తిరుమల క్షేత్రంలో కూడా ఉంది. ముందుగా భూ వరహస్వామిని దర్శించుకున్న తర్వాతే, వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లాలని స్వామియే స్వయంగా శాసనం చేశారు. చాలా మందికి ఈ విషయం తెలియక నేరుగా వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లిపోతుంటారు. ఆ తప్పు పూరీలో జరగకూడదని అనుకున్నారో ఏమో, భక్తులు పూరీ క్షేత్రంలో అడుగుపెట్టిన తర్వాత, మొదటగా విమలా దేవి దర్శనం తర్వాతే తక్కిన దేవతల దర్శనం అయ్యేలా ఒక క్రమ పద్ధతిని ఏర్పాటు చేశారు ఆలయ నిర్వాహకులు.

అంతేకాదు, పూరీ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది, అక్కడ లభించే మహా ప్రసాదం. స్వామి వారికి చాలా రకాల పిండి వంటలు, అన్నం, కూరలు వండి నివేదన చేస్తారు. అయితే ఇలా స్వామి వారికి నివేదన చేసిన నైవేద్యం వెంటనే మహా ప్రసాదంగా మారదు. ఆ ప్రసాదం విమలా దేవికి కూడా నివేదిస్తారు.. అప్పుడు మాత్రమే అది మహా ప్రసాదంగా మారుతుంది. ఆ తర్వాతే భక్తుల వితరణకి వెళ్తుందని, ఆలయ పూజారులు చెబుతున్నారు. ఇక్కడొక విశేషం ఏమిటంటే, విమలా దేవికి మాంసం, చేపలతో చేసిన వంటకాలను కూడా నివేదిస్తారు. ఇది కొంత వింతగా అనిపించినా, దీనికీ ఓ చరిత్ర ఉంది.

పూరీ క్షేత్రంలోని విమలా దేవి అత్యంత మహిమ గల శక్తి పీఠమే అయినా, అప్పట్లో ఆ తల్లిని సాధారణ భక్తులెవరూ పూజించేవారు కాదు. ఆమె శక్తి స్వరూపిణి కావడంతో, తాంత్రికులు మాత్రమే కొలిచేవారు. తాంత్రిక సాధకులు పూరీ క్షేత్రానికి కేవలం విమలా దేవి దర్శనం కోసమూ, అక్కడ మంత్ర జపాలు చేసుకోవడం కోసం మాత్రమే వస్తారు. ఈ నాటికీ అక్కడ అదే వాతావరణం కనిపిస్తుంది. అయితే, అప్పట్లో తాంత్రికులు విమలా దేవికి నిత్యం జంతుబలులు ఇస్తూ, తంత్ర సాధన కోసం వివిధ రకాల పూజలు చేస్తుండేవారు. వారితో పాటు స్థానికంగా ఉండే గిరిజనులు కూడా ఆ తల్లిని పూజించేవారు. అందుకే నేటికీ పూరీ క్షేత్రంలో పనులన్నీ ఆ గిరిజనుల కుటుంబాల వారే చేస్తారు. ముఖ్యంగా స్వామి వారి విగ్రహాలకు రహస్యంగా పూజలు చేసిన గిరిజన రాజు విశ్వావసుడి వారసులే, ఆలయంలో స్వామి వారికి ప్రసాదాలు తయారీ చేసే విభాగంలో, ఆలయ ప్రధాన కార్యాలయంలో ఉన్నారు. ఇక నాడు ఇంద్రద్యుమ్న మహారాజుకు సహకరించిన బ్రాహ్మణ యువకుడు విద్యాపతి వారసులే ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్నారు.

స్వామి వారికి శాకాహారం నివేదిస్తూ, అమ్మవారికి మాత్రమే మాంసాహారం సమర్పించడంలో కొన్ని సమస్యలు తలెత్తడంతో, కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే అమ్మవారికి బలులు సమర్పించి, మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టే విధానం, కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టారు. విమలా దేవికి జరిపే ఈ తంతు గురించి జనబాహుళ్యంలో పెద్దగా తెలియదు. పూరీ క్షేత్రంలో రహస్యంగా ఉంచబడిన విషయాలలో ఇది కూడా ఒకటి. తొలినాళ్ళలో కొన్ని నెలలు పాటు విమలా దేవికి పూర్తిగా మాంసాహారం నివేదించడం ఆపివేయడంతో, రోజు రోజుకూ అమ్మవారి విగ్రహంలో ఉగ్రత్వం పెరుగుతూ, దేవీ నవరాత్రుల సమయానికి అత్యంత భయంకరంగా మారిందని చరిత్ర విదితం. ఆ సమయంలో నిత్యం పూజించే పూజారి కూడా అమ్మవారి ఆలయంలోకి వెళ్లలేకపోయేవాడు. గర్భాలయంలోకి అడుగుపెట్టగానే అతని శరీరంలోని శక్తి హరించుకుపోయి మూర్ఛపోయేవాడని తెలుస్తోంది. అప్పుడు తమ తపొ శక్తితో కొంతమంది తాంత్రికులు జరిగిన దోషాన్ని గ్రహించి వెంటనే అక్కడ అమ్మవారికి బలులు ఇచ్చి, వివిధ రకాల శాంతులు చేసిన తర్వాతే ఆ తల్లి శాంతించిందని తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి కొన్ని ప్రత్యేక రోజుల్లో ఈ క్రతువు జరిపిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా దేవీ నవరాత్రులలో ఆఖరి రోజున జంతు బలి ఖచ్చితంగా ఇస్తారు. నేటికీ దేవీ నవరాత్రుల సమయంలో పూరీ క్షేత్రానికి వెళ్ళిన వారు, విమలా దేవి ముఖంలో ఉగ్రత్వం గమనించవచ్చని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.

అయితే ఆలయంలో ఈ తంతు జరుగుతున్న విషయం స్థానికులకు కూడా పెద్దగా తెలియదు. ఎందుకంటే, విమలా దేవి కోసం వినియోగించే మేక వంటి జంతువులను ఎవరికీ తెలియని ప్రదేశంలో, ప్రేత్యేకంగా పెంచుతారు. ఇక చేపలను, పవిత్రమైన రోహిణి కుండ్ లో పెంచినవి మాత్రమే వినియోగిస్తారు. ఈ తంతు జరిగే సమయంలో, భక్తులకు దర్శనాలు ఆపివేస్తారు. ముందుగా స్వామివారికి శాకాహార నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత, స్వామి వారి విగ్రహాలను పరదాలతో మూసివేసి, మరో ద్వారం నుంచి బలిచ్చే జంతువును తీసుకువచ్చి, తాంత్రికులు మంత్ర జపం చేస్తుండగా, అమ్మవారి ముందు కొంత దూరంలో ఉండే సింహం విగ్రహం దగ్గర దానిని బలి ఇస్తారు. ఎప్పుడైతే ఆ జంతువు నెత్తురు సింహంపై పడుతుందో, అప్పుడు అమ్మవారి ముఖంలోని ఉగ్రత్వం కొంత వరకు తగ్గుతుందని, చూసిన పూజారులు చెబుతున్నారు. ఇక ఆ బలితంతు పూర్తయిన వెంటనే, వంటలు మొదలుపెట్టి, ఆ మాంసంతో పాటు చేపల కూరను కూడా అమ్మవారికి నివేదిస్తారు. ఆ తర్వాత మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారని చెబుతున్నారు.

మన దేశంలో నేటికీ ఆలయ ధర్మాలనూ, ఆచారాలనూ ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకూ గురికాకుండా, నిష్టగా పాటించే అతి కొద్ది ఆలయాలలో, పూరీ క్షేత్రం కూడా ఒకటి. ఒక్క విమలా దేవి ఆలయంలో మాత్రమే కాదు, అసలు పూరీ క్షేత్రంలో ఎన్ని వింతలు, రహస్యాలు ఉన్నాయో, అందులో పనిచేసే వ్యక్తులకే పూర్తిగా తెలియదు. ఒక్క ప్రధాన ఆర్చకుడికి మాత్రమే, ఆ విషయ పరిజ్ఞానం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని విశేషాలున్నాయి కాబట్టే, పూరీ క్షేత్రం ఒక శక్తి కేంద్రంగా దృఢంగా నిలబడి, నేటికీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులను రక్షించే కవచంగా మారింది.

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas