Chinnamasta: The Self-Decapitated Goddess of Tantra in Varanasi Teaser | స్వయం శిరః ఖండిత!

 

Chinnamasta: The Self-Decapitated Goddess of Tantra in Varanasi Teaser | స్వయం శిరః ఖండిత! వారణాసి చిత్రం టీజర్ లో కనిపించిన ‘తల లేని దేవత’ ఎవరు? ఆవిడ రూపం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి?

స్వయం శిరః ఖండిత! 

వారణాసి చిత్రం టీజర్ లో కనిపించిన ‘తల లేని దేవత’ ఎవరు? 
ఆవిడ రూపం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి?

వారణాసి మూవీ టీజర్ లో కనిపించిన తల లేని దేవత విగ్రహం ప్రేక్షకులను ఆకట్టుకున్న ముఖ్యమైన అంశం. ఆ విగ్రహం, చిత్రం యొక్క కథనానికి లోతైన సంబంధాన్ని సూచించే విధంగా, ముఖ్యంగా రుద్రుడి పాత్రకు సంబంధించి ప్రాముఖ్యత కలిగినట్లుగా చిత్రీకరించబడింది. విగ్రహం ఉనికి, అనుబంధ సన్నివేశాలు, దాని ప్రతీక వాదం మరియు చిత్రం యొక్క ఇతివృత్తాల గురించి ఎన్నో చర్చలకూ, ఊహాగానాలకూ దారితీసింది. టైమ్ ట్రావెల్ మరియు పునర్జన్మల యొక్క అన్వేషణలో సాగే ఈ చిత్రంలో చూపించబడిన ఆ దేవత ఎవరో ఈ రోజు తెలుసుకుందాము. ఆది అంతం లేని ఓ మహా శక్తి ఆ ‘దైవం’. సమస్త లోకాలనూ సృష్టించడమే కాకుండా, వాటి స్థితీ లయ కారక భాధ్యతలు కూడా ఆ నిరాకార పరబ్రహ్మమే నిర్వహిస్తాడని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆ మహత్తర కార్యం క్రమబద్ధంగా కొనసాగడానికి ఎన్నో విభాగాలూ, వాటి క్రింద మరెన్నో శాఖలూ, ఉపశాఖలూ ఉంటాయి. ఆయా విభాగాలూ, శాఖలూ సమర్ధవంతంగా పనిచేయడానికే ముక్కోటి దేవతలూ వెలిశారని మన వేదాలు తెలియబరుస్తున్నాయి. ఆ దేవీ దేవతలలో ఒక్కొక్కరికీ ఒక్కొక్క బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతలకు తగ్గట్లుగానే వారికి శక్తులూ ఉంటాయి. ఆ దేవతలందరిలో మన కొత్తతరం వారికి తెలిసింది చాలా కొద్ది మందే అని చెప్పవచ్చు.. అలా మనకు తెలియని దేవతా స్వరూపాలు ఎందరో ఉంటారు. మనలాంటి సామాన్యులకు తెలియని ఆ దేవీ దేవతలలో కొన్ని ఉగ్ర స్వరూపాలూ ఉన్నాయి. అవి ఎంత ఉగ్రంగా ఉంటాయంటే, వాటిని చూస్తే ఎలాంటి వారికైనా గుండెల్లో గుబులుపుట్టక మానదు. అటువంటి వాటిలో ఓ మహోగ్ర స్వరూపం, అత్యంత భయంకరమైన రూపమే అయినా, ఆ రూపంలోనే ఓ మహా సందేశం దాగి ఉన్న దేవతే, వారణాసి చిత్రం టీజర్ లో మనకు కనిపించిన తల లేని దేవత. ఆ తల్లి పేరే ‘ఛిన్నమస్తా దేవి’. అసలు ఎవరీ ఛిన్నమస్తా దేవి? ఆవిడ రూపం ఎందుకంత భయంకరంగా ఉంది? ఆవిడ రూపంలో ఉన్న ఆ మహా సందేశం ఏమిటి? అంతటి ఉగ్రరూపిణిని అసలు ఎవరు కొలుస్తారు - వంటి ఎన్నో సందేహాలు కలుగుతాయి. అటువంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి:  https://youtu.be/IuARRxIzAuo ]


పంచ భూతాలూ, మహా శక్తులూ, వాటి ఉప శక్తుల ఆజ్ఞలతోనే సమస్త లోకాలూ నడుస్తాయని మన హైందవ ధర్మంలోని పురాణాలలో చెప్పబడింది. ఆ శక్తులలో మనం నిత్యం పూజించేటటువంటి కొన్ని శాంత స్వరూపాలు ఉంటే, మరికొన్ని శక్తులు చూడగానే ఒళ్ళు గగుర్పొడిచేంత భయంకర స్వరూపాలను కలిగి ఉంటాయి. అయితే అవి కూడా దేవతా శక్తులే అనీ, వాటి పని కూడా లోక రక్షణే అనీ పండితులు చెబుతున్నారు. ఉదాహరణకు మనం ఇళ్ళలో వాడే లైట్లు, ఫ్యాన్ల వంటి పరికరాలు నడవాలంటే విద్యుత్ శక్తి అవసరం. విద్యుత్తు మనకు మంచి చేస్తుంది కదా అని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే బోగ్గే.. తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా, ముట్టుకున్న వారి పరిస్థితి అల్లకల్లోలమై పోయినట్లే, ఉగ్ర శక్తుల పని తీరు కూడా అలాగే ఉంటుంది. తమ కర్తవ్య నిర్వాహణ ప్రకారం లోకాలకు మంచి చేయడమే అయినా, ఆ స్వరూపాలకు ఉండే మహా శక్తుల వల్ల అవి మహోగ్రంగా కనిపిస్తాయనీ, తెలిసిగానీ తెలియకుండా గానీ వాటి పట్ల అపరాధం జరిగితే ముప్పు తప్పదనీ ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.

అటువంటి మహోగ్ర శక్తులలో ఒకటే ఈ రోజు మనం చెప్పుకుంటున్న తల లేని దేవత ‘ఛిన్నమస్తా దేవి’. సంస్కృతంలో ‘ఛిన్న మస్తా’ అంటే, "నరికిన శిరస్సు" అని అర్థం. తాంత్రిక బౌద్ధ మతంలో ఈమెను ‘ఛిన్నముండ’ గా కొలుస్తారు. ఆమె జన్మదినాన్ని "ఛిన్నమస్త జయంతి"గా జరుపుకుంటాము. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం, శుక్లపక్ష చతుర్దశి నాడు వస్తుంది. 2026 వ సంవత్సరం, ఏప్రిల్ 30 వ తేదీన ఛిన్నమస్త జయంతి జరుపుకోబోతున్నాము. అదే రోజున మరో ఉగ్ర రూపమైన నరసింహ జయంతి కూడా.

సకల లోకాలనూ నడిపించే ఆది పరాశక్తి, ఆ మహత్తర కార్యం కోసం తన శక్తిని విభజించగా, అవి పది శక్తులుగా, దశ మహావిద్యలుగా రూపాంతరం చెందాయని తెలుస్తోంది. అలా ఆవిర్భవించిన దశమహావిద్యలలో ఒకరే ఈ ఛిన్నమస్తాదేవి. ఈవిడను వజ్రవైరోచనీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో, ప్రత్యేకించి హిమాచల్ ప్రదేశ్‌లో ఈవిడ చింతపుర్ణీ దేవిగా ప్రసిద్ధి గాంచారు. ఈవిడ రూపాన్ని చూసినవారు ఎవరైనా ఒక్క క్షణం పాటయినా భయకంపితులు కాకమానరు. అటువంటి భయంకర స్వరూపం వెనుక ఎంతో పరమార్ధం దాగి ఉందని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.

ఛిన్నమస్తాదేవి స్వరూపం యొక్క మర్మం గురించి తెలియాలంటే, ముందు ఆవిడ రూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఒక పద్మంలో సృష్టి కార్యం జరుపుతూన్న ఓ జంటపై తన కాలును మోపి తొక్కు తున్నట్లుగా ఛిన్నమస్తా దేవి నిలబడి ఉంటుంది. కాళికా మాత లాగానే మెడలో పుర్రెల దండ, సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించి ఉంటుంది. ఒక చేతిలో పెద్ద కత్తి పట్టుకుని, తన తలను తానే నరుక్కున్నట్లుగా కనిపిస్తూ, మరో చేతిలో తన తలను పట్టుకుని ఉంటుంది. ఆవిడ శరీరం నుంచి మూడు రక్త ధారాలు ఉప్పొంగి వస్తూంటే, వాటిలో ఒక ధారను ఆవిడే త్రాగుతున్నట్లు కనిపిస్తుంది. ఛిన్నమస్తా దేవి పక్కన ఆమె సహచరులైన జయ, విజయలనబడే డాకినీ, వారిణులు నిలబడి మరో రెండు రక్తపు ధారాలను స్వీకరిస్తున్నట్లు కనిపిస్తారు.

చూడటానికి ఎంతో భయంకరంగా కనిపించే ఆ రూపం వెనుక ఎంతో పరమార్ధం దాగి ఉందని పండితులు చెబుతారు. ఛిన్నమస్తా దేవి కాలి క్రింద మైథునం జరుపుకుంటున్న స్థితిలో ఉన్న జంటను సృష్టి కార్యంలో ఉన్నట్లుగా భావిస్తే, వారిపై ఆమె కాలు మోపి తొక్కడాన్ని వినాశనకారకంగా సూచిస్తున్నట్లు భావించాలి. ఆ జంటను శృంగార దేవ దంపతులైన రతీ మన్మధులుగా చెబుతారు. ఈ సమస్త లోకాలలో సృష్టించబడిన ప్రతిదానికీ అంతం ఖచ్చితంగా ఉంటుంది. అలా ఈ లోకంలో జరిగే సృష్టి, స్థితి లయలు తన ఆధీనంలోనే ఉంటాయనే సందేశం ఇక్కడ మనకు కనిపిస్తుంది.

ఇక ఛిన్నమస్తా దేవి రూపంలో తన తలను తానే నరుక్కున్నట్లు కనిపించడం వెనుక కూడా ఒక పరమార్ధం దాగి ఉంది. తల అనేది మన అహంకారానికి, "నేను" అనే భావానికి గుర్తు. తలను నరుక్కున్నట్లు చూపడం అంటే, మనలోని అహంకారాన్ని, చెడు ఆలోచనలను వదిలిపెట్టి, దేవుడితో ఏకం కావాలని అర్థం. అమిత జ్ఞానాన్ని సాధించాలన్నా, ఆ తల్లిని ఉపాసన చేయాలన్నా, ముందుగా ఆ అహాన్ని పూర్తిగా పక్కన పెడితేనే అది సాధ్యపడుతుందనే అర్ధం అందులో మనకు కనిపిస్తుంది. సహజంగా శక్తి ఆరాధన చేసే వారు దశమహా విద్యలను ఉపాసన చేయాలని ఆశపడతారు. ఆదిపరాశక్తి పది అవతారాల పరమార్ధాన్నీ, వాటిలోని శక్తినీ సాధించి, ఆ శక్తితో ఆర్తులను రక్షించడానికి రూపొందించిన విద్యలనే, దశ మహావిద్యలని అంటారు. ఆది పరాశక్తి పది అవతారాలలో ఛిన్నమస్తా దేవి కూడా ఒకరు కావడటంతో, దశమహావిద్యలలో ఆవిడ ఉపాసన కూడా ఉంటుంది. అందువల్ల ఆవిడను ఉపాసించాలంటే ముందు అహాన్ని పూర్తిగా పక్కన పెట్టాలని చెప్పడానికే, నరికిన తలను తన ఎడమ చేతిలో పట్టుకుని చూపిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.

ఇక ఛిన్నమస్తా దేవి రూపంలో కనిపించే మరో భయకరమైన అంశం, ఆవిడ శరీరంలోంచి బయటకు వస్తున్న మూడు రక్త ధారలు. వాటిలో ఒకటి ఆవిడ, మరో రెండు డాకినీ, వారిణులు తాగుతుండడం మనం గమనించవచ్చు. దీని వెనుక కూడా ఓ గూఢార్థం దాగి ఉంది. ప్రపంచంలో అత్యంత పురాతనమైన విద్యలలో యోగ విద్య ఒకటి. యోగ విద్యలో అత్యంత ఉత్కృష్టమైన ఉపవిద్య కుండలినీ విద్య. ఎవరైతే యోగ విద్యలోని కుండలినీ విద్యను సాధించగలుగుతారో, వారు అత్యంత శక్తివంతులైన మహర్షులుగా అవతరించి, లోక కళ్యాణం కోసం పాటు పడతారని తెలుస్తోంది. కుండలినీ విద్యను సాధించినప్పుడు శరీరంలోని సప్త చక్రాలను ఓ క్రమ పద్ధతిలోకి తీసుకురాడానికి, ఇడ - పింగళ – సుషుమ్న అనబడే మూడు నాడుల గుండానే శక్తి అనేది ప్రవహిస్తుంది. మన శరీరంలో జరిగే రక్త సరఫరా కూడా ఈ మూడు నాడుల గుండానే ప్రవహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్లనే ఛిన్నమస్తా దేవి ఆకారంలో మూడు రక్త ధారాలు మనకు కనిపిస్తాయి.

ఇక ఆ రక్తాన్ని తానూ, తన సహచరులైన డాకినీ, వారిణులు త్రాగడం వెనుక పరమార్ధం ఏమిటి అంటే, కుండలినీ విద్యను సాధించే సమయంలో శక్తి నియంత్రణ అనేది ఎంతో ముఖ్యం. ఆ శక్తి బయటకు వెళ్ళకుండా మనలోనే ఓ క్రమ పద్ధతిలో కదిలే విధంగా ఒడిసి పట్టుకోవాలని తెలియజేస్తున్నట్లుగా పండితులు చెబుతున్నారు. దశమహా విద్యలను అవపోసన పట్టే వారిగా ఛిన్నమస్తా దేవి ప్రక్కన కనిపించే డాకినీ వారిణులుగా, తనలోని గుణాలను చూపించడానికి ఆ ఇద్దరు సహచరుల రూపాలను సృష్టించిందనీ, ఆ రెండు రూపాలూ ఆమెలో భాగమేననీ చెబుతారు. అందువల్ల ఇక్కడ ఛిన్నమస్తా దేవి శరీరంలోనుంచి వస్తున్న రక్తాన్ని డాకినీ వారిణులు త్రాగడం అంటే, ఆమె శక్తని వారు ఒడిసి పట్టుకున్నట్లుగా అర్ధం చేసుకోవాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అమ్మవారి ఈ విచిత్ర రూపం వెనుక ఉన్న గొప్ప త్యాగం, అహంకారాన్ని వదిలివేసే తత్వం మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతుంది. అంతటి మహోగ్ర స్వరూపమయిన ఛిన్నమస్తా దేవి రూపం వెనుక ఇంతటి పరమార్ధం దాగి ఉన్నా, ఆవిడ ఉగ్ర శక్తి కావడం చేత, మనలాంటి సామాన్యులు ఆమెను పూజించలేరనీ, ఆమెను కేవలం దశ మహా విద్యా సాధకులూ, శక్తి ఉపాసకులైన శాక్తేయులూ, తాంత్రికులూ మాత్రమే పూజించ గలుగుతారనీ తెలుస్తోంది.

ఛిన్నమస్తా భగవతి ఆలయాలలో ఒకటి ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని రామగఢ్ జిల్లా, రాజ్రప్ప అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ప్రాంతం చాలా పచ్చగా, కొండలతో, అడవులతో నిండి ఉంటుంది. ఇక్కడే దామోదర్ భైరవి అనే రెండు నదులు కలుస్తాయి. ఈ రెండు నదుల సంగమ ప్రదేశం దగ్గరే అమ్మవారి ఆలయం ఉంది. అందుకే ఈ ప్రాంతంలో పవిత్రమైన శక్తి ఉందని నమ్ముతారు. మరొక ఆలయం నేపాల్ లోని సప్తరిజిల్లా రాజ్‌ బిరాజ్ దక్షిణ సరిహద్దు ప్రాంతంలోని ఛిన్నమస్తా సఖాడా గ్రామంలో ఉంది. ఈ ఆలయాలు ప్రజల కోరికలను నెరవేర్చే శక్తి పీఠాలలో భాగంగా పరిగణించబడతాయి. శక్తిపీఠాలు అంటే సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలనే విషయం తెలిసినదే.

🚩 ॐ శ్రీమాత్రే నమః 🙏


#VaranasiMovie #HeadlessGoddess #ChhinnamastaDevi #Mahavidya #TantricSecrets #MythologyExplained #SpiritualMystery #IndianMythology #HorrorMythology #VaranasiMystery #DarkGoddess #ShaktiPower #KundaliniEnergy #ssrajamouli #maheshbabu #varanasi

Chhinnamasta, headless goddess, chinnamasta, chinnamasta devi, chhinnamasta devi, chinnamasta devi statue, chinnamasta devi painting, chinnamasta devi pendant, chinnamasta devi story, chinnamasta devi history, chinnamasta devi temple, chinnamasta devi video, Self-Decapitated Goddess, goddess in Varanasi movie, goddess in Varanasi glimpse, Headless Goddess of Tantra

Comments

Related articles

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి? Garuda Puranam

37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? Siva Ratri Puja

అష్టదిగ్బంధనం! Ashta Digbandhanam - Arunachaleswara, Tiruvannamalai

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!

11 భయంకరమైన అస్త్రాలు! మహాభారతం Mahabharatam

గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka