సంపాతి కథ Story of Sampati


యుగాలు నిరీక్షించిన ‘సంపాతి’..
సంపాతికి నిశాకర మహర్షి చూపిన మార్గమేమిటి?

కశ్యప ప్రజాపతి, వినత దంపతులకు కలిగిన సంతానమైన అనూరుడు, శ్యేని ద్వారా, సంపాతి, జటాయువులనే కుమారులను పొందాడు. వీరి పాత్ర రామాయణంలోని ముఖ్య ఘట్టాలలో కనిపిస్తుంది. సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించిన సందర్భంలో, జటాయువు ఆమెను కాపాడబోయి, మరణించిన విషయం మనలో చాలామందికి తెలిసిందే. ఇక సంపాతి తన రెక్కలను ఎందుకు కొల్పోయాడు? వానరులను ఎలా కలిశాడు? సంపాతి రెక్కలు తిరిగి రావడానికి నిశాకర మహర్షి ఉపదేశించిన మార్గం ఏమిటి - వంటి ఆసక్తికర అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/fuBE0AZCoNA ]


సీతమ్మను వెతకడానికి దక్షిణ దిశకు వెళ్ళిన జాంబవంత, హనుమదాది మహావీరుల బృందానికి, అంగదుడు నాయకుడు. అన్వేషణ దాదాపు విఫలమైందని భావించి, ప్రాయోపవేశానికి సిద్ధమైనపుడు మాత్రమే, నిసృహతో అంగదుడు సుగ్రీవుని విమర్శించడం గమనార్హం. అది తప్పితే, మిగిలిన అన్ని సందర్భాలలోనూ అతని రాజ భక్తీ, రామకార్యం పట్ల నిరతీ, చాలా దృఢంగా ప్రదర్శించాడు. ఇక అసలు విషయానికి వస్తే, ఆ సమయంలో అంగదుడు, "శ్రీ రాముడి కార్యం నెరవేర్చలేకపోయాం. ఇంతలో ఈ ఆపద సంభవించింది. సీతాదేవికి మేలుచేయాలనుకున్న జటాయువుకు ఏం జరిగిందో తెలుసుకదా! అలాంటి గతే మనకిప్పుడు తటస్థించింది. రామ చంద్రమూర్తికి ఉపకారం చేయడానికే, ధర్మం తెలిసిన జటాయువు శరీరాన్ని విడిచి, కీర్తిని గడించాడు. కాబట్టి ఆయన పుణ్యాత్ముడు. దశరథుడు చనిపోవడం, సీతమ్మను రావణుడు అపహరించడం వల్ల, మనకు ప్రాణాపాయం సంభవించింది. ఆనాడు మా నాన్న దుందుభిని చంపడానికని ఒక బిలంలోకి ప్రవేశించాడు. కానీ, సుగ్రీవుడికి ఉన్న రాజ్య కాంక్ష చేత, మా నాన్న తిరిగిరాకుండా ఉండడం కోసమని, ఆ బిలద్వారానికి ఒక శిలను అడ్డుపెట్టాడు. మా నాన్న బతికున్నాడని తెలిసి కూడా, మా అమ్మని తన భార్యగా అనుభవించాడు. నా మీద కుమారుడన్న ప్రేమ సుగ్రీవుడికి ఎన్నడూ లేదు. నేను తిరిగివస్తే, సాకు దొరికిందని నన్ను చంపుతాడు. సుగ్రీవుడి చేతిలో మరణించడం కన్నా, ప్రాయోపవేశం చేసి మరణించడం నాకు ఇష్టం. మీరు వెళ్ళి, నేను నా పినతండ్రికీ, నా తల్లికీ, నా పినతల్లికీ, పెద్దలకీ నమస్కారం చేశానని చెప్పండి." అని మిగిలిన వానరులకు దూరంగా, ప్రాయోపవేశం చెయ్యడం కోసమని దర్భల మీద పడుకోవడానికి సిద్ధపడ్డాడు, చనిపోవాలని అనుకున్న అగందుడు.

ఒక పెద్ద పక్షి వాళ్ళను చూస్తూ, తనకు మంచి ఆహారం దొరకబోతోందని అనుకుంది. అయితే, వానరులు రాముడి కథను చెప్పుకుంటూ, జటాయువు చనిపోయిన విషయం మాట్లాడుకుంటుంటే ఆ పక్షి విని, "జటాయువు గురించి మాట్లాడుకుంటున్నారు.. మీరెవరు?" అని అడిగింది. అప్పుడు వానరులు ఆ పక్షితో రాముడి కథనంతా చెప్పి, "జటాయువు గురించి అడుగుతున్నావు.. నీవెవరు??" అని అడిగారు. "సంపాతి అనబడే నేనూ, జటాయువూ సోదరులము. సూర్యుడు ఉదయించినప్పటినుండీ అస్తమించేలోపు, ఆయనతో సమానంగా ప్రయాణం చెయ్యాలని, మేము ఒకనాడు పందెం కాసుకున్నాము. అనుకున్న ప్రకారం నేనూ, జటాయువూ సూర్యుడి వెనకాల వెళుతుండగా, మిట్ట మధ్యాహ్నం వేళ, మేము సూర్యుడికి దగ్గరగా వెళ్ళాము. సూర్యుడి వేడిని భరించలేక, జటాయువు స్పృహతప్పి కిందపడిపోబోయాడు. పెద్దవాడిని కనుక, తమ్ముడిని రక్షించాలని నేను నా రెక్కలను జటాయువుకు అడ్డంగా పెట్టాను. అప్పుడు సూర్యుడి వేడికి నా రెక్కలు కాలిపోయి, వింధ్య పర్వతం మీద పడిపోయాను. కానీ నా తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలియలేదు. మళ్ళీ ఇంతకాలానికి, మీ వలన నా తమ్ముడి గురించి విన్నాను. నా తమ్ముడు చనిపోయాడన్న వార్త వినడం వలన, నాకు చాలా బాధ కలుగుతోంది. చనిపోయిన నా తమ్ముడికి జలతర్పణం ఇవ్వాలని అనుకుంటున్నాను. కానీ, నేను ఎగురలేను. మీరు నన్ను తీసుకెళ్ళి, ఆ సముద్ర జలాల దగ్గర దింపండి. నేను నా తమ్ముడికి తర్పణాలు ఇస్తాను" అని అన్నాడు సంపాతి.

ఆ విధంగా తన కోరిక మేరకు, సంపాతిని సముద్ర తీరానికి తీసుకువెళ్ళారు వానరులు. ఆయన అక్కడ జటాయువుకు తర్పణాలు సమర్పించాడు. మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాక, వానరాలు సంపాతితో, "జటాయువు రామకార్యంలో సహాయం చేశాడు. నువ్వు కూడా రామకార్యంలో ఏమన్నా సహాయం చెయ్యగలవా? నీకు సీతమ్మ జాడ ఏమైనా తెలుసా?" అని అడిగారు. అప్పుడు సంపాతి, తను ఇంకా బ్రతికి ఉండడానికి గల కారణాన్ని వివరించాడు. "వింధ్య పర్వత శిఖరం మీద రెక్కలు కాలిపోయి పడినప్పుడు, 6 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాను. తరువాత తెలివొచ్చింది. నా తమ్ముడు ఎటో ఎగిరిపోయాడు. నాకేమో రెక్కలు కాలిపోయాయి. అందుకని, ఈ పర్వతం మీది నుండి కిందికి దూకి, మరణిద్దామని అనుకున్నాను. కానీ, ఇంతలో ఒక ఆలోచన వచ్చింది.

మా ఇద్దరికీ రెక్కలు ఉన్న రోజుల్లో, నేనూ నా తమ్ముడూ కామరూపులము కాబట్టి, మనుష్య రూపాన్ని పొందేవాళ్ళము. అక్కడ ఉండేటటువంటి నిశాకర మహర్షి పాదములకు నమస్కారం చేస్తుండేవాళ్ళము. అందుకని ఒకసారి ఆ మహర్షి పాదాలకు నమస్కరించి, ప్రాణాలు విడిచిపెడదామని అనుకుని, మెల్లిగా పాకుతూ ఆ మహర్షి ఉండే ఆశ్రమానికి వచ్చాను. అప్పుడే మహర్షి స్నానం చేసి వెళుతున్నారు. ఆయన నాకు, అభిషేకం చెయ్యబడ్డ బ్రహ్మ వెళుతున్నట్టు అనిపించింది. బ్రహ్మ చుట్టూ ప్రాణులన్నీ ఎలా చేరుతాయో, అలా నిశాకర మహర్షి స్నానం చేసి వెళుతుంటే, ఆయన చుట్టూ ఎలుగుబంట్లూ, పులులూ, సింహాలూ, పాములూ చేరి ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళగానే, ఆ మృగాలన్నీ వెళ్ళిపోయాయి.

తరువాత ఆయన బయటకి వచ్చి నన్ను చూసి, నిన్ను చాలాకాలం నుండి చూస్తున్నాను, నువ్వూ, నీ తమ్ముడూ వచ్చి నాకు నమస్కారం చేసేవారు కదా? నువ్వు రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావేమిటి? అని అడిగారు. అప్పుడు నేను జరిగిన కథంతా చెప్పాను. అప్పుడాయన, "సంపాతి! బెంగ పెట్టుకోకు. భవిష్యత్తులో నీ వలన ఒక మహత్కార్యం జరగవలసి ఉంది. నువ్వు కొంతకాలానికి, సీతాపహరణాన్ని చూస్తావు. ఆ సీతమ్మను అన్వేషిస్తూ, వానరులు వస్తారు. వాళ్ళకు నువ్వు మాట సాయం చెయ్యి. నేను నీకు అభయం ఇస్తున్నాను. అలా చేస్తే నీ కాలిపోయిన రెక్కలు మళ్ళీ వస్తాయి. నాకు కూడా రామలక్ష్మణులను చూడాలని ఉంది. కానీ, అంతకాలం ఈ శరీరంలో ఉండాలని నాకు లేదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టేద్దామని అనుకుంటున్నాను. నువ్వు మాత్రం ఈ కొండమీదే వేచి ఉండు. నీకు ఇంకొక విషయం చెబుతాను. సీతమ్మను అపహరించిన తరువాత, ఆమెను వశం చేసుకుందామని రావణాసురుడు తన అంతఃపురం చూపిస్తాడు. దివ్యమైన భోజనము పెడతాడు. కానీ, ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు. ఒక్క మెతుకు కూడా ముట్టదు. ఆ తల్లికోసం దేవేంద్రుడు, ప్రతి రోజూ, దేవతలు కూడా చూడనటువంటి దివ్యమైన పాయసాన్ని పంపిస్తాడు. కానీ, సీతమ్మ ఆ పాయసాన్ని తినదు. ఆమె కొంచెం పాయసాన్ని తీసి, ఈ భూమండలంలో ఎక్కడైనా సరే, రామలక్ష్మణులు బతికుంటే, ఈ పాయసం వారికి చెందుగాక. ఒకవేళ రామలక్ష్మణులు శరీరాలను విడిచిపెట్టి ఉంటే, ఊర్ధ్వ లోకములలో ఉన్న వాళ్ళకి, ఈ పాయసం చెందుగాక. అని భూమి మీద కొంచెం పాయసాన్ని పెడుతుంది. ఆ సీతమ్మ తిన్న అన్నం, రావణుడు పెట్టినది కాదు. ఈ విషయాన్ని ఆ వానరులు వచ్చాక వాళ్ళకి చెప్పు" అని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పారు.

అందుకే, కొన్ని వేల సంవత్సరాల నుండీ ఇలా బతికి ఉన్నాను. ఆ నిశాకర మహర్షి చెప్పినట్లుగానే, సీతమ్మను రావణుడు ఆకాశ మార్గంలో తీసుకెళుతున్నప్పుడు, ఆమె ఆభరణాలను కొంగుకు చుట్టి విడిచిపెట్టడం నేను చూశాను. రావణాసురుడు విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. సాక్షాత్తూ కుబేరుడి తమ్ముడు. ఆయన లంకా నగరానికి అధినేత. ఈ సముద్రానికి దక్షిణ దిక్కున, 100 యోజనముల అవతల లంక ఉంటుంది. ఆ లంకలో ఎక్కడ చూసినా బంగారు స్తంభములతో నిర్మింపబడ్డ భవనాలు ఉంటాయి. అటువంటి లంకా నగరంలో, దీనురాలై, పచ్చని పట్టు పుట్టం కట్టుకుని, ఏడుస్తూ, చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా సీతమ్మ ఉంది.. అయితే, ఈ విషయాలన్నీ నాకు ఎలా తెలుసని అడుగుతారేమో.. నేను ఇక్కడే కూర్చుని సీతమ్మను చూడగలను. నేను దివ్య దృష్టితో చూడగలను. నాకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే, భూమి నుండి ఆకాశానికి కొన్ని అంతరములు ఉన్నాయి. మొదటి అంతరములో తమ కాళ్ళ దగ్గర ఉన్న ధాన్యాన్ని ఏరుకొని తినే కులింగములనే పక్షులు ఎగురుతాయి. రెండవ అంతరంలో, చెట్ల మీద ఉండే ఫలాలను తినే పక్షులు ఎగురుతాయి. మూడవ అంతరంలో, భాసములూ, క్రౌంచములూ ఎగురుతాయి. నాలుగవ అంతరంలో, డేగలు ఎగురుతాయి. అయిదవ అంతరంలో గ్రద్దలు ఎగురుతాయి. ఆరవ అంతరంలో హంసలు ఎగురుతాయి. ఏడవ అంతరంలో వినత పుత్రులమైన వైనతేయులము కాబట్టి, మేము ఎగురుతాము.

మేము తినే తిండి చేతా, మేము జన్మించిన జాతి చేతా, 100 యోజనముల అవతల ఉన్న విషయాన్ని కూడా ఇక్కడే ఉండి చూడగల దృష్టిశక్తి మా కంటికి ఉంది. దూరంగా లంకా పట్టణంలో, అశోక వనంలో సీతమ్మ కూర్చుని ఉండడం నాకు కనిపిస్తుంది. మీలో ఎవరైనా సాహసం చేసి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగిన వాడు ఉంటే, సీతమ్మ దగ్గరకు వెళ్ళండి.. అని సీతమ్మ జాడ చెప్పాడు సంపాతి. ఈ మాటలను సంపాతి అక్కడి వానరులకు చెప్పగానే, కాలిపోయిన ఆయన రెక్కలు మళ్ళీ పుట్టాయి. అప్పుడాయన తన ఎర్రటి రెక్కలను అటూ ఇటూ ఊపి చూసుకున్నాడు. ఆనందంతో అక్కడున్న వానరులకు నమస్కరించి, సంపాతి ఆకాశంలోకి ఎగిరిపోయాడు.

ధర్మో రక్షతి రక్షితః

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History

మనిషి శరీరాన్ని పోలిన మెత్తటి శరీరం గల నరసింహ స్వామి విగ్రహం ఎక్కడుంది? Hemachala Lakshmi Narasimha Swamy Mallur