వినాయక చవితి రోజున గణేశుడిని 21 రకాల పత్రులతో ఎందుకు పూజిస్తారు? Vinayaka Chaviti


మిత్రులందరికీ వినాయకచతుర్థి శుభాకాంక్షలు 🙏 
వినాయక చవితి రోజున గణేశుడిని 21 రకాల పత్రులతో ఎందుకు పూజిస్తారు?

వినాయక చవితి పూజలో కూడా ఎన్నో వైద్య రహస్యాలున్నాయి. నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొలిపి, అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభాలేమిటో చెప్పడానికై ఏర్పడిందని చెప్పవచ్చు. మరి మతం అంటే మానవత్వాన్ని పెంచేదే కదా! మత విశ్వాసాల పేరున కొన్ని మంచి పనులు చేయవచ్చని చెప్పడమే వినాయక చవితి పూజా విధి విధానం. వినాయకుడి ప్రతిమను రూపొందించడానికి కేవలం 'కొత్త' మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రులతో పూజ చేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇదీ పద్ధతి.

21 రకాల పత్రులనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహోత్కృష్టమైన , శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయడం, కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలీ, మనలో ఉండే అనారోగ్యాలను హరించి వేస్తాయి. 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలన్న సందేహానికి శాస్త్రీయ వివరణ.. చెరువులు, బావులు, నదులు, వీటిలో వర్షాల వల్ల నీరు కలుషితం కావడం సర్వ సాధారణం. ఆ పూడిక తీసి, వీటిని శుభ్రం చేయడానికి, 21 పత్రులతో చేసే పూజయే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితోపాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయడం, అలా నీటిలో కలిసిన మట్టి, 21 రకాల పత్రి కలిసి, 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయ గుణాల ఆల్కలాయిడ్స్‌ని ఆ జలంలోకి వదులుతాయి. అవి బాక్టీరియాను నిర్మూలించి, జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనుక ఉండే 'పర్యావరణ పరిరక్షణ' రహస్యం.

వినాయకుడికి చేసే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైనది. ఈ 21 పత్రుల గురించి వివిధ గ్రంథాల్లో ప్రస్తావించబడి ఉంది. వినాయకుడి పూజలో వాడే 21 పత్రులూ చాలా విశిష్టమైనవి. వినాయక చవితి నాడు చేసే పూజలో ఈ పత్రులు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. ఈ 21 ఆకుల పేర్లేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

మాచీ పత్రం:
మాచ పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి.

బృహతీ పత్రం:
దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకుల మాదిరి, తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి.

బిల్వ పత్రం:
బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా చెపుతారు.

దూర్వా పత్రం:
దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి.

దుత్తూర పత్రం:
దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి.

బదరీ పత్రం:
బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి.

అపామార్గ పత్రం:
తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.

తులసీ పత్రం:
హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు.

చూత పత్రం:
చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగ రోజులలో కనిపించదు.

కరవీర పత్రం:
దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది.

విష్ణుక్రాంత పత్రం:
ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు.

దాడిమీ పత్రం:
దాడిమీ అంటె దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం.

దేవదారు పత్రం:
దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది.

మరువక పత్రం:
దీనిని మరువం అని కూడా అంటారు. దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత.

సింధువార పత్రం:
సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడ పిలుస్తుంటారు.

జాజి పత్రం:
ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు.

గండలీ పత్రం:
దీనినే లతాదూర్వా అనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది.

శమీ పత్రం:
జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అశ్వత్థ పత్రం:
రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మనసంప్రదాయం.

అర్జున పత్రం:
మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది.

అర్క పత్రం:
జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. తెల్లజిల్లేడు పేరుతో తయారుచేసిన వినాయకప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం వుంటుందంటారు. ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు.

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History