ముక్తసంగులు! భగవద్గీత Bhagavad Gita Chapter 18 - Part 127


ముక్తసంగులు!
ప్రాపంచిక మమకారాసక్తితో వస్తువిషయముల పట్ల సంగము పెడితే?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (22 – 26 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 22 నుండి 26 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

సాత్విక జ్ఞానమూ, రాజసిక జ్ఞానముల గురించి తెలుసుకున్నాము.. ఇప్పుడు తామసిక జ్ఞానము గురించి చూద్దాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/tS_FKddurio ]


00:50 - యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకమ్ ।
అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ ।। 22 ।।

సంపూర్ణ సృష్టి అంతా, ఈ భిన్నభిన్న భాగములే అన్న విషయంలో, పూర్తిగా మనిషిని తలమునకలై పోయేట్టు చేసి, తర్కబద్ధముగా లేకుండా, మరియు సత్య దూరముగా ఉండే జ్ఞానము, తామసిక జ్ఞానమని చెప్పబడుతుంది.

ఎప్పుడైతే బుద్ధి తమోగుణ ప్రభావముచే మందకొండిగా అయిపోతుందో, అప్పుడది, భిన్నత్వమే సంపూర్ణ సత్యమన్న భావనను పట్టుకుని ఉంటుంది. అటువంటి అవగాహనా దృక్పథంలో ఉన్నవారు, తరచుగా వారికి సరి అనిపించిన పరమ సత్యము పట్ల, అతి మూర్ఖాభిమానముతో ఉంటారు. వారి జ్ఞానము తరచుగా, కనీసం తర్కబద్ధముగా కూడా ఉండదు. యధార్థమునకు దూరంగా, మరియు శాస్త్ర ఉపదేశాలకు విరుద్ధంగా ఉంటుంది. అయినా సరే, వారు మిక్కిలి పట్టుదలతో, తమ నమ్మకాన్ని ఇతరులపైకి రుద్దటానికి ప్రయత్నిస్తారు. తమను తామే భగవదనుచరులమనీ, ధర్మ-సంరక్షకులమనీ అనుకునే మతమూఢులను ఎంతోమందిని, మానవ జాతి చరిత్ర చూసి ఉన్నది. వారు మూర్ఖముగా, ఉన్మత్తులై, మతమార్పిడి ద్వారా అదే రకం బుద్ధి ఉన్న కొంతమంది అనుచరులను సంపాదించి, గుడ్డి వాడు గుడ్డివాళ్లకు దారి చూపిన రీతిలో ప్రవర్తిస్తారు. భగవంతుడికీ, మత ధర్మమునకూ సేవ చేస్తున్న పేరుతో, సామాజిక అశాంతికీ, మరియు దానియొక్క సామరస్య పూర్వకమైన అభివృద్ధికీ, ఆటంకం కలిగిస్తారు.

02:22 - నియతం సంగరహితం అరాగద్వేషతః కృతమ్ ।
అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్త్వికముచ్యతే ।। 23 ।।

ఏదైతే కర్మ శాస్త్రబద్ధముగా చేయబడినదో, రాగద్వేష రహితముగా ఉన్నదో, మరియు ఫలాపేక్ష లేకుండా చేయ బడినదో, అది సత్త్వగుణములో ఉన్నట్టని చెప్పబడినది.

మూడు రకములైన జ్ఞానములను వివరించిన పిదప, శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, మూడు విధములైన కర్మలను వివరిస్తున్నాడు. ఎంతో మంది మేధావులు, కర్మలకు సంబంధించి ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు. ‘తినండి, త్రాగండి, మరియు హాయిగా ఉండండి’ అనే పద్దతి ఒకటైతే, అందరూ స్వార్థపరులై, ఎవరూ ఇతరుల గురించి ఆలోచించకపోతే, ప్రపంచంలో అది ఒక అస్తవ్యస్త స్థితికి దారి తీస్తుంది. కాబట్టి, వ్యక్తిగత ఇంద్రియ సంతృప్తితో పాటు, మనం ఇతరుల గురించి కూడా ఆలోచించాలనేది, ఇంకొకరి పద్ధతి. అంటే, ఉదాహరణకి, ఒకవేళ భర్త అనారోగ్యంతో ఉంటే, భార్య అతనిని చూసుకోవాలి; ఒకవేళ భార్య అనారోగ్యంతో ఉంటే, భర్త ఆమెను చూసుకోవాలి. ఒకవేళ ఇతరులకు సహాయం చేయటం, స్వీయప్రయోజనానికి విరుద్ధంగా ఉంటే, సొంత ప్రయోజనానికే మనం మొగ్గు చూపాలని, వారి అభిప్రాయం. మరొక సిద్ధాంతం ప్రకారం, స్వీయ-ప్రయోజనం తరువాతనే, ఇతరులకు సేవ చేయటమనే ఆలోచన తప్పు. ఇతరులకు సేవ చేయటం సహజమైన మానవ సద్గుణము. ఒక తల్లి-సింహము కూడా, తాను ఆకలితో ఉన్నా, తన పిల్లలకు ఆహారం అందిస్తుంది. కాబట్టి, ఇతరుల సేవకే ప్రాధాన్యత ఇవ్వాలి. మరికొందరు తత్త్వవేత్తలు, అంతరాత్మ చెప్పిన విధముగా అనుసరించమని చెప్తారు. అదే మనకు, ఏది సరియయిన ప్రవర్తనో చెప్పటానికి ఉత్తమమైన మార్గదర్శి అని, సూచించారు. కానీ, సమస్య ఏమిటంటే, ప్రతిఒక్కని అంతరాత్మ, వేర్వేరు విధములుగా మారదర్శకం చేస్తుంది. ఒకే కుటుంబంలో, ఇద్దరు పిల్లలకి విభిన్న విలువలూ, అంతరాత్మా ఉంటాయి. అంతేకాక, ఒకే వ్యక్తి యొక్క అంతరాత్మ కూడా, కాలంతో పాటు మారుతుంది. ఒక హంతకుడిని, తను జనులను చంపటం పట్ల పశ్చాత్తాపం పడుతున్నాడా అని అడిగితే, అయన ఇలా అనవచ్చు, ‘మొదట్లో చెడుపని చేస్తున్నట్టు అనిపించేది. కానీ, క్రమక్రమంగా, అదేదో దోమలను చంపటం లాగ మామూలు పనయిపొయింది. నాకేమీ పశ్చాత్తాపం లేదు’ అని. యుక్తమైన పని ఏదన్న విషయంలో, మహాభారతం ఇలా చెప్తున్నది: ‘ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తే నీకు ఇష్టం ఉండదో, నీవు కూడా వారి పట్ల అలా ప్రవర్తించకు. కానీ, నీ ప్రవర్తన ఎల్లప్పుడూ, శాస్త్ర సమ్మతంగా ఉండేలా చూసుకో.’ ఇతరులు నీపట్ల ఎలా ఉండాలని నీవు ఆశిస్తావో, నీవూ వారిపట్ల అలాగే ఉండాలి. అదే మాదిరిగా, శాస్త్రములు చెప్పిన విధంగా తన కర్తవ్యమును చేయటమే, సత్త్వ గుణములో ఉన్న కర్మ అని, ఇక్కడ శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. అంతేకాక, అటువంటి పని, రాగద్వేష రహితముగా ఉండాలి, మరియు ఫలాపేక్ష లేకుండా కూడా ఉండాలని, పేర్కొంటున్నాడు.

05:31 - యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః ।
క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతమ్ ।। 24 ।।

స్వార్థ కోరికచే ప్రేరేపితమై, అహంకారముచే చేయబడినట్టి, మరియు తీవ్ర ప్రయాసతో కూడిన పని, రజోగుణములో ఉన్నదని చెప్పబడును.

రజో గుణము యొక్క స్వభావము ఏమిటంటే, అది భౌతిక సంపత్తి కోసము, మరియు ఇంద్రియ భోగముల కొరకూ, తీవ్రమైన వాంఛను సృష్టిస్తుంది. కాబట్టి, రజోగుణ కర్మ - పెద్ద ఆశయముచే ప్రేరేపితమై, తీవ్ర పరిశ్రమతో కూడి ఉంటుంది. అది చాలా శ్రమతో ఉండి, ఎంతో శారీరక, మానసిక అలసటను కలుగచేస్తుంది. రాజసిక జగత్తు యొక్క ఒక ఉదాహరణ, నేటి కార్పొరేట్ ప్రపంచం. ఉన్నతోద్యోగులు తరచుగా, ఒత్తిడికి గురౌతున్నామని ఫిర్యాదు చేస్తుంటారు. ఇది ఎందుకంటే వారి కర్మలు సాధారణంగా, గర్వము, అహంకారముచే, మరియు మితిమీరిన అధికార దాహం, హోదా, మరియు సంపత్తిచే ప్రేరణ చెంది ఉంటాయి. రాజకీయ వేత్తలూ, అతిగా ఆందోళన చెందే తల్లితండ్రులూ, మరియు వ్యాపారవేత్తల ప్రయాస కూడా, తరచుగా రజోగుణ కర్మల కోవకే చెందుతాయి.

06:45 - అనుబంధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషమ్ ।
మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే ।। 25 ।।

మోహభ్రాంతి వల్ల ప్రారంభించబడి, తమ యొక్క స్వ-శక్తి ఏమిటో తెలుసుకోకుండా, మరియు పరిణామాలు, జరిగే నష్టము, మరియు ఇతరులకు జరిగే హాని గురించి ఆలోచించకుండా చేసే కర్మను, తామసిక కర్మ అని అంటారు.

తమో-గుణములో ఉన్న జనుల బుద్ధి, అజ్ఞానముచే ఆవరింపబడి ఉంటుంది. వారు ఏది మంచి, లేదా ఏది చెడు అన్న దాని గురించి ఆలోచించరు, పట్టించుకోరు. కేవలం ‘తమ’ గురించీ, మరియు తమ స్వార్థ ప్రయోజనం కోసమే చూసుకుంటారు. వారు తమ దగ్గర ఎంత ధనం, లేదా ఇతర వనరులున్నాయి అని చూసుకోరు. పైగా, ఇతరులకు కలిగే ఇబ్బందిని కూడా పట్టించుకోరు. ఇటువంటి పని, వారికీ, ఇతరులకూ హాని చేకూరుస్తుంది. తామసిక కర్మ, వ్యక్తి యొక్క ఆరోగ్యమునూ, మరియు శౌర్యమునూ క్షీణింప చేస్తుంది. అది ఉత్త దండగ శ్రమ, సమయ వృధా, మరియు వనరులు కూడా వృథాయే. ఇటువంటి పనులకి ఉదారహణలు కొన్ని ఏమిటంటే, జూదము, దొంగతనమూ, భ్రష్టాచారమూ, తాగుడు వంటి దుర్గుణములు.

08:00 - ముక్త సంగోఽనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః ।
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే ।। 26 ।।

అహంకార-మమకార రహితముగా ఉన్నవారూ, మరియు ఉత్సాహము, ధృడసంకల్పము కలవారూ, జయాపజయముల పట్ల ఉదాసీనముగా ఉన్నవారూ, సత్త్వగుణ కర్తలని చెప్పబడ్డారు.

శ్రీ కృష్ణుడు ఇంతకు క్రితం, జ్ఞానము, కర్మ, మరియు కర్తలు, మూడు రకములుగా ఉంటారని వివరించి ఉన్నాడు. జ్ఞానము మరియు కర్మ - ఈ రెండింటిని వివరించిన పిదప - ఇక ఇప్పుడు మూడు రకములైన కర్తలను గురించి చెప్పటం ప్రారంభిస్తున్నాడు. సత్త్వ గుణ సంపన్నులు, సోమరితనంతో ఉండరని అంటున్నాడు; పైగా, వారు ఉత్సాహముతో, మరియు దృఢచిత్తముతో పని చేస్తారు. తేడా ఏమిటంటే, వారు పని చేసే దృక్పథం వేరుగా ఉంటుంది. సాత్త్విక కర్తలు, 'ముక్తసంగులు'. అంటే, ప్రాపంచిక మమకారాసక్తిచే వస్తువిషయముల పట్ల సంగముతో ఉండరు; అలాగే, ప్రాపంచిక వస్తువులు, ఆత్మకు తృప్తిని ఇవ్వగలవని విశ్వసించరు. అందుకే వారు ఉత్తమ ఆశయాలతో పనిచేస్తారు. వారి యొక్క ఉద్దేశాలు పవిత్రమైనవి కావటంచే, వారు ఉత్సాహము, మరియు ధృఢచిత్తముచే పరిశ్రమిస్తారు. పని చేస్తున్నంత సేపూ, వారి ఉత్తమమైన మానసిక దృక్పథం వల్ల, తక్కువ శక్తి వినియోగింపబడుతుంది. అందుకే, అలసట లేకుండా, వారు తమ ఉన్నత ఆశయాలను నిర్వర్తించగలుగుతారు. వారు గొప్ప కార్యములు సాధించినా, 'అనహం వాదీ' అంటే, అహంకార రహితముగా ఉంటారు. తమ గెలుపు యొక్క గొప్పతనమంతా, ఆ భగవంతునికే ఆపాదిస్తారు.

09:44 - ఇక మన తదుపరి వీడియోలో, ఎటువంటి కర్త రజోగుణములో ఉన్నట్టు పరిగణించబడతాడో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History