జన్మ - విముక్తి Birth and Death


ఎందుకీ జన్మ? ఎప్పుడు విముక్తి?

జీవితం మీద విరక్తి కలిగినప్పుడు, ‘ఛీ.. ఎందుకీ జన్మ?’ అని మనలో మనం ఆక్రోశించుకుంటూ ఉంటాము. అసలు మనిషి జన్మ ఏమిటి? దీనికి విముక్తి ఎప్పుడనే విషయాలను తెలుసుకోవాలనుకున్న వారు ముందుకు సాగండి..

[ మరణించిన తరువాత కర్ణుడు తిరిగి భూమిపైకి ఎందుకు పంపబడ్డాడు?: https://youtu.be/vfBBesZcTbw?si=FoJjN6HAcHW4cOKK ]


నిజంగా మానవ జన్మ అంత నీచ నికృష్టమైనదా? అసలు మనం ఈ భూమిమీద ఎందుకు పుట్టము? ఎందుకు చనిపోతున్నాము? చనిపోయాక ఎక్కడికి పోతాము? ఇలాంటి ప్రశ్నలన్నీ మనిషికి సర్వ సాధారణంగా కలుగుతుంటాయి. మనం అనుకున్నట్లుగా మనిషి జన్మ నీచమైనది కాదు.. ఉత్తమోత్తమమైనది.. ‘పునరపి జననం, పునరపి మరణం’ అన్నారు పెద్దలు. జన్మ అంటే మళ్లీ పుట్టడం. అంటే, చనిపోయిన వారు మళ్ళీ పుట్టడమే జన్మ. కానీ, తిరిగి మానవ జన్మే వస్తుందని మాత్రం చెప్పలేము. ఎందుకంటే, మనం ఎలాంటి జన్మ ఎత్తాలో మనం సంపాదించుకున్న జ్ఞానం మీదా, తద్వారా కర్మల మీదా మాత్రమే ఆధారపడి ఉంటుంది. కర్మ ఫలాలను బట్టే మనిషి జన్మ ఉంటుంది. మనిషి జన్మ అనేది, మనం దేవుడికి చేరువ కావడానికి మనకు దొరికిన ఓ అపురూపమైన అవకాశం. భక్తి మార్గంలో ఉండి, వైరాగ్యం చెంది, భగవంతుడిని చేరుకోవడానికి మనిషి జన్మ తప్ప మరో జన్మలో ఆ అవకాశం లేదు.

అయినా, పూర్వ జన్మ పుణ్య ఫలంతో సాలీడు, ఏనుగు, పాము, నెమలి వంటివి దేవుడిని పూజించి, ముక్తిని పొందినట్లు శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యం వంటి మన పురాణ గ్రంథాలలో ప్రస్ఫూటంగా తెలుస్తుంది. కానీ, మనిషిగా పుట్టిన వారంతా భగవంతుడికి దగ్గరయ్యే మార్గాన్ని నిజంగా ఉపయోగించుకుంటున్నారా లేదా? అనేది, మనకు మనం ఆలోచించు కోవాలి. మనిషి పుట్టినప్పటి నుంచీ తాను చెయ్యాల్సిన మంచి పనులు చేయక తప్పదు. సంసార సాగరంలో ఈదుకుంటూ పోవడం తప్ప, మనకు మరో మార్గం లేదు.

ఇవన్నీ మనుషులకేనా! చెట్లకూ చేమలకూ ఉండవా? అని మనం అనుకోవచ్చు.. ఒక చెట్టుకు మొగ్గ వచ్చి, అది పువ్వై, ఆ తర్వాత కాయగా మారింది. పండిన తరువాత కొంతకాలానికి అది నేల రాలిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, పిందెగానో, కాయగానో ఉండగా దానిని కొమ్మ నుంచి కోసి వేరు చేస్తే, అది ఉన్న చోటు నుంచి నీరు కారుతుంది. కాయ మొదలు లోనూ, ఆ తడిని చూడవచ్చు. కానీ, పండు రాలినప్పుడు, కొమ్మలో ఎలాంటి తడీ ఉండదు. పండు రాలిన చోట కూడా తడి ఉండదు. కాయ కోస్తున్నప్పుడు మాత్రమే తడి ఉండటానికి కారణం, ‘అయ్యో మరిన్ని రోజులు నన్ను అంటి పెట్టుకుని ఉంటే, అది పండు అయ్యేది కదా!’ అని చెట్టు కొమ్మ కంట తడి పెడుతుంది. కాబట్టే అక్కడ తడిని మనం చూస్తుంటాము. అలాగే కాయ మొదలులోనూ ఆ నీటి తడి ఉంటుంది. ‘అయ్యో ముందుగానే నన్ను చెట్టు కొమ్మ నుంచి వేరు చేసేశారు కదా’ అని కాయ కూడా బాధపడుతుంది. కానీ పండు విషయంలో అలా కాదు.. కాయ పండి రాలుతున్నప్పుడు, చెట్టు కొమ్మకు తడి కనిపించదు. పండు మొదలులోనూ నీటి తడి ఉండదు. రెండింటిలోనూ ఓ పరిపక్వత వస్తుంది. దాని బంధం అయిపోయింది కాబట్టే పండు రాలిపోయిందని, చెట్టు కొమ్మ అనుకుంటుంది. పండు కూడా తన కాలం ముగిసినట్టు అనుకోవడంతో, రెండువైపులా బాధ అనేది ఉండదు. అలాంటిదే మనిషి జీవితం కూడా.

సంసార చక్రంలో ఉండి కుటుంబ వ్యవహారాలు సాగిస్తున్న సమయంలో, ఉన్నట్లుండి పక్కకు తప్పుకుంటే, అటు కుటుంబ సభ్యులకూ బాధే, ఇటు మధ్యలోనే దూరమవుతున్నామని, అతనికీ బాధే. ఆ వ్యక్తి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి, నెమ్మదిగా జ్ఞాన మార్గం వైపుకు అడుగులు వేస్తూ, అందులో మునిగి తేలినప్పుడు, అటు అతనికీ, ఇటు కుటుంబ సభ్యులకూ బాధ ఉండదు. రెండు వైపులా కన్నీరు కార్చడం అనేది ఉండదు. జ్ఞానమనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. నెమ్మదిగా రావాలి. అందుకే మెల్ల మెల్లగా దాని వైపుకు అడుగులు వేయాలి.

జ్ఞానం, కర్మలు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. జ్ఞానం పెరిగే కొద్దీ, కర్మలు అంతరిస్తాయి. అనేక జన్మలుగా మనం చేసిన పాపపుణ్యాలు, కర్మల రూపంలో మనతోనే వస్తాయి. ఈ కర్మలు మూడు రకాలుగా ఉంటాయి. ‘ఆగామి, సంచితం, ప్రారబ్దం’ అని, మూడు రకాలుగా కర్మలు ఉంటాయి. నిత్యం మనం చేసే కర్మలన్నీ ఆగామి కర్మల క్రిందికే వస్తాయి. కొన్ని వెంటనే ఫలిస్తాయి, మరికొన్ని తర్వాతి జన్మలలో తమ ఫలితాలను చూపిస్తాయి. మనం ఎన్ని పాపాలు చేశాం? ఎన్ని పుణ్యాలు చేశాం? దాన ధర్మాలు ఏమైనా చేశామా? వంటివన్నీ, ఆగామి కర్మల క్రిందికి వస్తాయి. ఇక పూర్వ జన్మలో మనం చేసిన కర్మలు ఈ జన్మకు వచ్చి, ఇప్పుడు కూడా వాటిని అనుభవించలేకపోతే, అవి మళ్లీ రాబోయే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. ఇటువంటి వాటిని, సంచిత కర్మలని అంటారు.

ఇక ప్రారబ్దం విషయానికి వస్తే అంతా నా ప్రారబ్దం అని అనుకోవడం మనం తరచూ వింటూ ఉంటాము. సంచిత కర్మలలో ఖచ్చితంగా అనుభవించి తీరాల్సినవి ఉంటాయి. వాటినే ప్రారబ్దం అంటారు. గత జన్మలలో చాలా పాపాలు చేసి ఉండి, పైగా పుణ్యబలం కూడా లేకపోతే, జన్మ తీసుకోగానే దాని సమయం వచ్చినప్పుడు, ఆ ప్రారబ్దం తగిన ఫలితం చూపిస్తుంది. ఇలాంటి చావు ఎవరికీ రాకూడదని అందరూ అనుకుంటూ ఉంటారు. అది ప్రారబ్ద కర్మ కాబట్టే, అతను అనుభవించక తప్పలేదు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు, ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి.

పుణ్య కర్మలు పక్వానికి వస్తే, ఆ వ్యక్తి దేవ లోకంలో పుడతాడు. ఆ కర్మల ఫలితంగా, అనేక భోగాలను అనుభవిస్తాడు. ఆ భోగాలు అయిపోగానే, ‘క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి’ అన్నట్లు, మళ్లీ మానవ లోకాన్ని చేరుకుంటాడు. ఇక్కడ మళ్లీ మనిషిగానో, జంతువుగానో పుడతాడు. అంతకు ముందు అతను దేవ లోకంలో పుట్టినా, అతనికి కర్మలు చేసే స్థూల శరీరం ఉండదు. ఎందుకంటే, అక్కడ భోగాలు అనుభవించటానికి మాత్రమే అధికారం ఉంటుందిగానీ, కర్మలు చేసే అధికారం ఉండదు. పుణ్య కర్మలు పక్కన పెట్టి, మనం పాపాలు మాత్రమే చేస్తూ పోతే, అవి కూడా పక్వానికి వస్తాయి. అప్పుడు ఏ జంతువుగానో పుట్టక తప్పదు.

ఇలా కర్మ ఫలాలను అనుభవించటం మాత్రమే కాదు.. కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా, మనిషి జన్మలోనే ఉంటుంది. 'బుద్ధే కర్మానుసారిణి' అంటారు.. కర్మలను బట్టే మనిషి బుద్ధి మారుతుంటుంది. బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ, 'మానవ జన్మ'. పరమాత్మను చేరుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారాన్నీ, జ్ఞానాన్నీ పొందే అవకాశం ఉన్నది, ఒక్క మానవ జన్మలోనే. అందుకే ఈ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది, అపురూపమైనది. 84 లక్షల జీవరాసులలో పుట్టి-గిట్టిన తర్వాతే, ఈ మనిషి జన్మ లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. మనిషి తన జన్మకు ఒక లక్ష్యం అంటూ పెట్టుకోవాలి. 'బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, కోట్లు సంపాదించాలి' అనేది మాత్రమే లక్ష్యం కాదు. జ్ఞాన సముపార్జన చేయాలి.

ఎన్నో సుఖాలూ, భోగాలూ అనుభవించినా, మన మనస్సులో ఏదో ఒక వెలితి మాత్రం ఉంటుంది. పరమాత్మను తెలుసుకోవాలంటే, జ్ఞాన మార్గం ఒక్కటే దారి. ‘నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం’ అని తత్వ బోధలో శంకరాచార్యుల వారు స్పష్టంగా చెప్పారు. అంటే, నిత్య వస్తువు అనేది, ఒక్క పరమాత్మ మాత్రమే. అందుకు భిన్నంగా ఉంటే, అవి అశాశ్వతం అని అర్థం. ప్రతి జీవీ, భగవంతుడిలో ఐక్యం కాగలిగినప్పుడే, ఈ జన్మకు ముక్తి లభించినట్లు. ఆ ముక్తి మార్గానికి దారి తెలియాలంటే, అది మానవ జన్మలోనే సాధ్యం. నేనెవరు? ఎందుకు పుట్టాను? ఎవరి కోసం పుట్టాను? నా లక్ష్యం ఏమిటి? నా కర్తవ్యం ఏమిటి? అని తెలుసుకుని, మనస్సును అదుపులో పెట్టుకుని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవలి.

ఆత్మకూ పరమాత్మకూ తేడాను తెలుసుకోవడమే 'జ్ఞానం'. భగవంతుడిని తెలుసుకోవాలన్న తపన ఉంటే, ఆ భగవంతుడే మనకు దారి చూపిస్తాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో, ‘అర్జునా! ఎవరైతే నా జ్ఞానాన్ని గ్రహించి, కర్మ, జ్ఞాన, ధ్యాన యోగాలను అవలంభించి ఉంటారో, వారు ఇంకా ఏదైనా కర్మలు చేయాల్సి ఉంటే, వారికి ఖచ్చితంగా ఒక మంచి జన్మ లభిస్తుంది’ అని చెప్పాడు. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మనిషి ముందుకు సాగాలి. అప్పుడే జీవన్ముక్తి సాధ్యం. అప్పటి వరకూ ఈ భవ బంధాలను అనుభవించి తీరవలసిందే.

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History