ఉపకారస్మృతి! భగవద్గీత Bhagavad Gita Chapter 18


ఉపకారస్మృతి!
మనం నడిచే నేల, చూసే సూర్యుని వెలుగు, పీల్చే గాలి, త్రాగే నీరు ఎక్కడివి?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (59 – 62 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 59 నుండి 62 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/AQTTQeffwzY ]


జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణంగా భగవంతుడు ఏ విధంగా నిర్దేశిస్తూ ఉంటాడో చూద్దాము..

00:50 - యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే ।
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ।। 59 ।।

ఒకవేళ నీవు అహంకారముచే ప్రేరితమై, ‘నేను యుద్ధం చేయను’ అని అనుకుంటే, నీ నిర్ణయం ఎలాగూ వ్యర్థమై పోతుంది. ఎందుకంటే, నీ యొక్క క్షత్రియ భౌతిక స్వభావమే, నిన్ను యుద్ధం చేయటానికి పురికొల్పుతుంది. 

శ్రీ కృష్ణుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మనకు ఏది నచ్చితే అది చేయటానికి మనకు పూర్తి స్వేచ్ఛ ఉందని, మనం ఎన్నడూ అనుకోకూడదు. ఆత్మ అనేది, పూర్తి స్వతంత్రమైన అస్తిత్వమును కలిగి ఉండదు. అది భగవంతుని సృష్టిపై ఎన్నో విధాలుగా ఆధారపడి ఉంటుంది. భౌతిక బద్ధ స్థితిలో, అది ప్రకృతి త్రిగుణముల ఆధీనములో ఉంటుంది. ఈ గుణముల సంయోగమే, మన స్వభావాన్ని ఏర్పరుస్తుంది. అది ఆదేశించినట్టుగా మనం ప్రవర్తించవలసి ఉంటుంది. కాబట్టి మనకు, ‘నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను’ అనే పరిపూర్ణ స్వేచ్ఛ లేదు. భగవంతుని యొక్క, మరియు శాస్త్రముల సత్-సందేశాన్నీ, లేదా ప్రకృతి యొక్క బలవంత ఒత్తిడినీ, ఈ రెంటిలో ఏదో ఒక దానిని ఎంచుకోవలసి ఉంటుంది. స్వభావసిద్ధంగా అర్జునుడు ఒక యోధుడు. ఒకవేళ గనక అహంకారముతో, మంచి సలహాని పాటించనని ఆయన నిర్ణయించుకున్నా, ఆయన యొక్క క్షత్రియ స్వభావము, అతనిని తప్పకుండా యుద్ధానికి ప్రేరేపిస్తుంది.

02:20 - స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా ।
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోఽపి తత్ ।। 60 ।।

ఓ అర్జునా, మోహభ్రాంతిచే నీవు ఏదైతే పనిని చేయనని అంటున్నావో, నీ యొక్క సహజ ప్రకృతి స్వభావముచే జనించిన ప్రేరణచే, ఆ పనినే చేయటానికి ప్రేరేపింపబడతావు.

తన యొక్క హెచ్చరింపు మాటలను కొనసాగిస్తూ, శ్రీ కృష్ణుడు ఇంతకు క్రితం చెప్పిన విషయాన్నే, మరింత విశదీకరిస్తున్నాడు. ఆయన అనేదేమిటంటే, నీ యొక్క పూర్వ జన్మ సంస్కారాల వలన, నీకు క్షత్రియ స్వభావమున్నది. నీ యొక్క సహజ గుణములైన వీరత్వము, పరాక్రమము, మరియు దేశభక్తి, నిన్ను యుద్ధం చేయటానికే పురిగొల్పుతాయి. నీకు పూర్వ జన్మలలో, మరియు ఈ జన్మలో కూడా, ఒక యోధుడిగా నీ కర్తవ్యమును నిర్వర్తించటానికే, శిక్షణ ఇవ్వబడినది. నీ కళ్ళ ముందే ఇతరులకు అన్యాయం జరుగుతుంటే, ఊరికే ఉండటం నీకు సాధ్యమవ్వదు. నీ స్వభావము, మరియు లక్షణాలు ఎలాంటివంటే, నీవు ఎక్కడ దుర్మార్గాన్ని చూసినా, దానిని తీవ్రంగా అడ్డుకుంటావు. కాబట్టి, నీ సహజ స్వభావంచే ప్రేరేపితమై చేసేకన్నా, నా ఉపదేశాన్ని అనుసరించి యుద్ధం చేయటమే నీకు మేలు.. అనే సందేశాన్ని ఇస్తున్నాడు భగవంతుడు.

03:43 - ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి ।
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ।। 61 ।।

 ఓ అర్జునా, పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు. భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణముగా, ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు.

భగవంతునిపై జీవాత్మ ఆధారపడి ఉండటాన్ని వక్కాణిస్తూ, శ్రీ కృష్ణుడు ఇలా అంటున్నాడు. నేను చెప్పినట్టు విన్నా, వినకపోయినా, నీవు ఎల్లప్పుడూ నా ఆధీనంలోనే ఉంటావు. నీవు వసించి ఉండే ఈ శరీరము, నా భౌతిక శక్తిచే తయారు చేయబడినది. నీ యొక్క పూర్వ కర్మల ప్రకారం, నీకు తగిన శరీరమును ఇచ్చాను. నేను కూడా దానిలోనే కూర్చుని ఉన్నాను. నేను నీ సమస్త ఆలోచనలను, మాటలను, మరియు చేష్ఠలను లిఖించుకుంటున్నాను. కాబట్టి, నీవు ప్రస్తుతం చేసే దానిని బట్టి, నీ భవిష్యత్తు ఎలా ఉండాలని కూడా నిర్ణయిస్తాను. నీవు నాకంటే స్వతంత్రుడవని ఎన్నడూ తలంచకు. కాబట్టి అర్జునా, నీ శ్రేయస్సు కోసమే, నీవు నాకు శరణాగతి చేయటమే మంచిది. అని అర్జునుడికి విశదీకరిస్తున్నాడు.

05:02 - తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత ।
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ।। 62 ।।

ఓ భరతా, సంపూర్ణ హృదయ పూర్వకముగా, కేవలం ఆయనకే అనన్య శరణాగతి చేయుము. ఆయన కృపచే, నీవు పరమ శాంతిని, మరియు నిత్యశాశ్వత ధామమును పొందెదవు.

భగవంతునిపైనే ఆధారపడి ఉన్న జీవాత్మ, తన ప్రస్తుత దురవస్థ నుండి బయట పడటానికీ, మరియు సర్వోన్నత పరమ లక్ష్యమును సాధించటానికి కూడా, భగవత్ కృప పైనే ఆధారపడి ఉండాలి. కేవలం సొంత ప్రయత్నం మాత్రమే దీనికి సరిపోదు. కానీ, భగవంతుడు తన కృపను ప్రసాదిస్తే, ఆయన తన దివ్య జ్ఞానమునూ, మరియు దివ్య ఆనందమునూ, ఆ జీవాత్మకు ప్రసాదించి, దానిని భౌతిక శక్తి యొక్క మాయా బంధనముల నుండి విడిపిస్తాడు. తన కృపచేత, వ్యక్తి నిత్య శాశ్వత మోక్షమును, మరియు అనశ్వరమైన ధామమును పొందుతాడని, శ్రీ కృష్ణుడు వక్కాణిస్తున్నాడు. కానీ, ఆ కృపను పొందటానికి జీవాత్మ, భగవత్ శరణాగతి ద్వారా అర్హతను సంపాదించుకోవాలి. ఈ లోకంలోని ఒక తండ్రి కూడా, తన కొడుకు ప్రయోజకుడై, వాటిని బాధ్యతతో సన్మార్గంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకునే వరకూ, తన విలువైన సంపత్తిని అతనికి అప్పచెప్పడు. అదే విధంగా, భగవత్ కృప అనేది, ఏదో ఆషామాషీ వ్యవహారం కాదు. దానిని ప్రసాదించటానికి, సంపూర్ణ, సహేతుక, తర్కబద్ధ నియమాలు ఆధారంగా ఉన్నాయి. ఒకవేళ భగవంతుడు తన కృపను ప్రసాదించటంలో నియమాలు పాటించకపోతే, జనుల విశ్వాసము దెబ్బతింటుంది. భగవంతుడు తన కృపను, మనకు అర్హత లేకుండానే ప్రసాదిస్తే, ఇంతకు క్రితం మహాత్ములైన వారు, ఈ విధంగా అనుకుంటారు. ‘ఏమిటిది? మేము ఎన్నో జన్మల తరబడి, మమ్ములను మేము పరిశుద్ధి చేసుకోవటానికి కష్టపడ్డాము. ఆ తదుపరి భగవంతుని కృప లభించింది. కానీ ఈ వ్యక్తి తనను తాను యోగ్యుడిగా చేసుకోకముందే, ఆయన కృప లభించినది. అలా అయితే, ఆత్మ-ఉద్ధరణ కోసం మా పరిశ్రమ అంతా అర్థరహితమైనది.’ అని అనుకుంటారు. దానికి సమాధానంగా, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:

‘ఆ బ్రహ్మ దేవుడినీ మరియు ఇతరులను సృష్టించిన ఆ సర్వోత్కృష్ట తత్త్వమును ఆశ్రయిస్తున్నాము. ఆయన కృపచేతనే, ఆత్మ మరియు బుద్ధి, జ్ఞానప్రకాశితమౌతాయి.’ 

భగవత్ శరణాగతి యొక్క ఆరు అంగములు ఏమిటంటే:

1. భగవంతుని సంకల్పమునకు అనుగుణముగానే కాంక్షించటం: సహజ సిద్ధంగానే, మనం ఆ భగవంతుని సేవకులము. తన స్వామి కోరికను తీర్చటమే, సేవకుని కర్తవ్యము. కాబట్టి, శరణాగతి చేసిన భగవత్ భక్తులుగా, మన సంకల్పాన్ని, దివ్య భగవత్ సంకల్పంతో ఏకం చేయాలి. ఒక ఎండుటాకు, వీచేగాలికి లొంగిపోతుంది. అంటే శరణాగతి చేస్తుంది. ఆ వీచేగాలి, దాన్ని పైకిలేపినా, ముందుకు, లేదా వెనుకకు పడవేసినా, లేదా నేలపై పడవేసినా – అదేమీ ఫిర్యాదు చేయదు. అదే విధంగా, మనం కూడా భగవంతుని ఆనందమే మన ఆనందం అని ఉండటం నేర్చుకోవాలి.

2. భగవంతుని సంకల్పమునకు వ్యతిరేకంగా కోరుకోకుండా ఉండటం: మన జీవితంలో మనకు లభించినదంతా, మన పూర్వ, ప్రస్తుత కర్మల అనుసారమే ఉంటుంది. కానీ, కర్మ ఫలములు వాటంతట అవే రావు. భగవంతుడు వాటిని లిఖించి, వాటి ఫలములను సరైన సమయంలో ఇస్తుంటాడు. భగవంతుడే స్వయంగా ఈ ఫలములను ఇస్తుంటాడు కాబట్టి, మనం వాటిని ప్రశాంత చిత్తముతో స్వీకరించటం నేర్చుకోవాలి. సాధారణంగా జనులు తమకు సంపద, కీర్తి, ఆనందము, మరియు విలాసాలు లభించినప్పుడు, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పటం మరచిపోతారు. కానీ, కష్టాలు ఎదురైనప్పుడు, ‘ఎందుకు భగవంతుడు ఇలా చేశాడు?’ అని భగవంతుడిని నిందిస్తారు. రెండవ సూత్రం ఏమిటంటే, భగవంతుడు మనకు ఇచ్చిన దాని పట్ల, ఎటువంటి అసంతృప్తులు ఉండకపోవటం.

3. భగవంతుడు మనలను రక్షిస్తున్నాడన్న దృఢ విశ్వాసం కలిగి ఉండటం: భగవంతుడు మన సనాతనమైన నిత్య శాశ్వత తండ్రి. సృష్టిలోని సమస్త ప్రాణుల సంక్షేమం చూసుకుంటూనే ఉంటాడు. ఈ భూమిపై కొన్ని వేల కోట్ల చీమలు ఉన్నాయి. అవన్నీ సమయానుసారం ఆహారం తీసుకోవలసినదే. మన తోటలో కొన్నివేల చీమలు ఆకలితో చనిపోయి ఉండటం అనేది ఎప్పుడైనా జరిగిందా? వాటన్నిటికీ భగవంతుడు ఆహారం సమకూర్చి పెడుతూనే ఉంటాడు. అదే సమయంలో మరో పక్క, ఏనుగులు కిలోలకొద్దీ ఆహారం ప్రతి రోజూ తీసుకోవాలి. భగవంతుడు వాటి అవసరాలు కూడా తీరుస్తుంటాడు. ఈ లోకపు తండ్రి కూడా, తన బిడ్డల అవసరాలన్నీ తీరుస్తాడు. మరైతే మన నిత్యసనాతన తండ్రి అయిన భగవంతుడు, మన సంరక్షణ చూసుకోడన్న సందేహం ఎందుకు? ఆయనిచ్చే రక్షణ పట్ల సంపూర్ణ దృఢ విశ్వాసం కలిగి ఉండటం, శరణాగతి యొక్క మూడవ అంగము.

4. భగవంతుని పట్ల కృతజ్ఞతా భావమును కలిగి ఉండటం: మనం భగవంతుని నుండి ఎన్నో అమూల్యమైన బహుమానాలను పొంది ఉన్నాము. మనం నడిచే నేల, చూసే సూర్యుని వెలుగు, పీల్చే గాలి, త్రాగే నీరు - ఇవన్నీ భగవంతుడు మనకు ఇచ్చినవే. నిజానికి ఆయన వలననే మనం ఇలా ఉండగలుగుతున్నాము; మనకు ప్రాణ శక్తినిచ్చి, మన ఆత్మకు చైతన్యమును ప్రసాదించినది ఆయనే. వీటికి ప్రతిగా, ఆయనకు మనం ఏమీ పన్నులు కట్టడంలేదు. కానీ కనీసం ఆయన ఇచ్చిన దాని పట్ల కృతజ్ఞతా భావముతో ఉండాలి. ఇదే, ఉపకారస్మృతి, కృతజ్ఞతా భావము. మనకు ఆయన ప్రసాదించిన అన్నింటి పట్ల, మన నిత్య శాశ్వత తండ్రి అయిన భగవంతుని పట్ల, కృతజ్ఞతా భావము కలిగి ఉండటమే, శరణాగతి యొక్క నాలుగవ అంశము.

5. మనకున్నదంతా ఆయన సొత్తుగా పరిగణించటం: భగవంతుడు ఈ సమస్త జగత్తుని సృష్టించాడు; అది మనం పుట్టకముందు నుండీ ఉన్నది, మరియు మన తరువాత కూడా ఉంటుంది. కాబట్టి, ఈ సృష్టిలో సమస్తానికీ ఆయనే నిజమైన యజమాని. మనం ఏదైనా వస్తువు మనకే చెందినదని అనుకుంటే, భగవంతుని యొక్క యజమానత్వమును మరచి పోయినట్టే. ఈ జగత్తు, మరియు దానిలో ఉన్నదంతా భగవంతునికే చెందినది. ఈ విషయం గుర్తుంచుకుని, మన యజమానత్వమును విడిచి పెట్టటం, శరణాగతి యొక్క ఐదవ అంగము.

6. శరణాగతి చేశానన్న అహంకారమును కూడా విడిచిపెట్టటం: ఒకవేళ మనం చేసిన మంచి పనుల పట్ల గర్వపడితే, అహంకరిస్తే, ఆ గర్వం మన హృదయాన్ని మలినం చేస్తుంది. మనం చేసిన మంచి పని యొక్క ఫలితాన్ని నిర్మూలిస్తుంది. అందుకే నమ్రత, మరియు విధేయత ఉంచుకోవటం అనేది, చాలా ముఖ్యమైనది. ‘నేను ఏదైనా మంచి పని చేయగలిగానంటే, అది కేవలం భగవంతుడు నా బుద్ధిని సరియైన దిశలో ప్రేరేపించాడు కాబట్టే. నామటుకు నేనే అయితే, నేను ఎప్పటికీ ఇది సాధించేవాడిని కాదు.’ అనేటటువంటి వినమ్రతా దృక్పథాన్ని కలిగి ఉండటమే, శరణాగతి యొక్క ఆరవ అంగము.

ఒకవేళ మనం శరణాగతి యొక్క ఈ ఆరు అంగములనూ పరిపూర్ణముగా అమలుపరిస్తే, మనం భగవంతుని యొక్క షరతులను పూర్తిచేసినట్టే.. అప్పుడాయన తన కృపను మనపై ప్రసాదిస్తాడు.

12:39 ఇక మన తదుపరి వీడియోలో, జనులు ఏ విధంగా చేయడం వలన భగవంతుడిని పొందగలరో తెలుసుకుందాం..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History

మనిషి శరీరాన్ని పోలిన మెత్తటి శరీరం గల నరసింహ స్వామి విగ్రహం ఎక్కడుంది? Hemachala Lakshmi Narasimha Swamy Mallur