'8-4-2024' వ తారీకు సోమవారం రోజున, 'సోమావతీ అమావాస్య'.. Somavathi Amavasya 2024


'8-4-2024' వ తారీకు సోమవారం రోజున, 'సోమావతీ అమావాస్య'..  @mplanetleaf  

అమ్మాయికి, లేక అబ్బాయికి పెళ్లి సంబంధం కుదరడం ఆలస్యం అవుతున్న వారికీ, నిరుద్యోగులైన వారికీ శివుడు అందించిన అద్భుత అవకాశం 'సోమావతీ అమావాస్య'. సోమావతీ అమావాస్య రోజున ఈ చిన్ని పరిహారం చేస్తే, శివానుగ్రహంతో సమస్త శుభములనూ సమకూర్చుకో గలరు..

సోమవతీ అమావాస్య రోజున ఏం చేయాలి? శివుడికి సోమవారం అంటే చాలా ప్రీతికరం అన్న విషయం అందరికీ తెలిసిందే. అమావాస్య కలసి వచ్చే సోమవారమే ‘సోమవతీ అమావాస్య’. దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే! తన అల్లుడైన శివుడిని అవమానించేందుకే, దక్షుడు ఆ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకు చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా, శివుడి భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా, దక్షుడు ఆమెను కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి, తనను తాను దహించివేసుకున్నది.

సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడై, తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథ గణాలతో పాటుగా, ఆ వీరభద్రుడు దక్షుడి మీద దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావ చితక బాదాడు. శివ గణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో, చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడే అయినా, శివుడిని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు, తగిన శాస్తిని అనుభవించాడు.

నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు, ఆ బాధలకు తాళలేక పోయాడు. తనకు ఉపశమనం కలిగించమని వెళ్లి, ఆ పరమేశ్వరుడిని వేడుకున్నాడు. చంద్రుడి బాధను చూసిన భోళాశంకరుని మనస్సు కరిగి, రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదనీ, ఆ రోజున తనకు అభిషేకం చేస్తే, చంద్రుడు ఆరోగ్యవంతుడవుతాడనీ అభయమిచ్చాడు.

శివుడి సూచన మేరకు చంద్రుడు, సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివుడికి అభిషేకం చేసి, తన బాధల నుంచి విముక్తుడు అయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని, ‘సోమవతీ అమావాస్య’ పేరుతో పిలవడం జరుగుతోంది.

ఈ పూజ పంచారామాలలో కానీ, రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందంటారు. ఏదీ కుదరని వారు, కనీసం శివపంచాక్షరీ మంత్రమైన 'ఓం నమః శివాయ' జపంతో అయినా ఆ రోజును గడపమని చెబుతారు.

సోమావతీ అమావాస్య రోజున చేయవలసిన పనులు: తులసి చెట్టుకు తెల్లవారు జామున నీరు పోసి, నుదుటిపై తులసి మట్టితో తిలకం పెట్టుకోవాలి. సాయంత్రం తులసి పూజ చేసి, నేతి దీపం వెలిగించాలి. సోమవారం రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఆ సమయంలో శివాభిషేకం చేసి, పూర్తి ఫలితాన్ని పొందగలరు.

సోమావతీ వ్రతాన్ని పాటించే భక్తులు, ఆ నాడు శివాభిషేక అనంతరం, రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అనంతరం సోమావతీ అమావాస్య కథను చదువుకోవాలి.

వీలైన వారు, కార్తీక సోమవారం రోజున పాటించే విధంగానే ఉపవాసాన్ని పాటించాలి. ఉపవాసం చేసే వారు, సంధ్యా దీపం అనంతరం, సోమావతీ అమావాస్య కథను చదువుకోవాలి.

సోమావతీ అమావాస్య రోజున నిరుద్యోగులు ఈ పరిహారం చేస్తే, త్వరలోనే మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఉదయాన్నే ఒక నిమ్మకాయను బాగా శుభ్రం చేసి, ఇంట్లోని పూజా గదిలో వ్రేలాడదీయాలి. రాత్రి ఆ నిమ్మకాయను నిరుద్యోగి తలపై నుంచి ఏడుసార్లు దిష్టి తీసి, నాలుగు ముక్కలుగా కట్ చేసి ఒక్కో దిక్కులో పడవేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.

సోమావతీ అమావాస్య కథ: పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహితులైన ఏడుగురు కుమారులు, పెళ్లికాని ఒక కుమార్తె ఉంది. ఒక రోజు ఆ కుమార్తెను సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోయాడు. దీనికి వారు చాలా బాధ పడ్డారు. ఈ విషయమై ఒక పురోహితుడి దగ్గరకు వెళ్లి, తమ కుమార్తె జాతకాన్ని చూపించింది ఆ వర్తకుని భార్య. అది చూసిన పురోహితుడు, ఆమెకు పెళ్లైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పాడు. వారు బాధపడి, దానికి ఎలాంటి పరిష్కారమూ లేదా? అని అడిగారు. అప్పుడు పురోహితుడు, సింఘాల్ ప్రాంతానికి వెళ్లి, అక్కడ ఒక చాకలి స్త్రీని కుంకుమ అడిగి నుదుటన పెట్టుకుంటే దోషం పోతుందని చెప్పాడు. మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు, తన తల్లి ఆజ్ఞానుసారం, తన సోదరిని తీసుకుని ఆ ప్రాంతానికి బయలుదేరాడు.

వారలా వెళ్తుండగా, మార్గ మధ్యంలో ఒక నదిని దాటవలసి వచ్చింది. ఆ నదిని ఎలా దాటాలా అని ఆలోచిస్తూ, ఆ చెట్టు క్రిందే విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే చెట్టుపైన ఒక రాబందు గూడు కట్టుకుని ఉంటోంది. రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి, రాబందు పిల్లలను తినటం పరిపాటి. ఈ సారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఈ అమ్మాయి, ఆ పామును చంపేసింది. ఆ రాబందుల జంట, తమ పిల్లలను కాపాడినందుకుగాను, వారు నదిని దాటడానికి సహాయం చేశాయి. తరువాత అన్నాచెల్లెళ్ళిద్దరూ సింఘాల్ ప్రాంతానికి వెళ్ళి, చాకలి స్త్రీకి కొన్ని నెలలపాటు సేవ చేయగా, సోమావతీ అమావాస్య రోజునే, ఈ కన్య నుదుటన ఆమె కుంకుమ దిద్దింది.

ఆమె వెంటనే రావిచెట్టు దగ్గరికు వెళ్లి, 108 ప్రదక్షిణలు చేసింది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోయింది. ఇదీ సోమావతీ అమావాస్య కథ. అంతేగాకుండా, సోమావతీ అమావాస్య రోజున, పూర్వీకుల కోసం దానం చేస్తే, కోపంతో ఉన్న పూర్వీకులు కూడా సంతోషించి, తమ సంతతి పురోగతికై దీవిస్తారు. ఈ రోజున పిండప్రదానం చేయడం వల్ల వాళ్ళు సంతృప్తి చెందుతారనీ, తద్వారా మనకు మంచి చేస్తారనీ విశ్వాసం. ఈ రోజున వివాహితులూ, అవివాహితులూ రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయడం ద్వారా, కోరిన కోరికలు తీరుతాయి. ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణునీ, పార్వతీ పరమేశ్వరులనూ, పితృదేవతలనూ పూజించాలి.

ఈ విశేషమైన సోమావతీ అమావాస్య వివరాలను వీలైనంత ఎక్కువ మంది హిందువులకు చేరేలా షేర్ చేయవలసిందిగా ప్రార్థన 🙏

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History