The Demon's Lingam That Split into 5 Temples | The Sacred Pancharamas & Pancharangas పంచారామాలు – పంచరంగ క్షేత్రాలు!

 

పంచారామాలు – పంచరంగ క్షేత్రాలు!
శివకేశవులకు ఇష్టమైన కార్తీకమాసంలో ఈ వీడియో చూసినా పుణ్యమే!

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే ।
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః ।।
యథా శివమయో విష్ణుః ఏవం విష్ణుమయం శివః ।
యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ।।

విష్ణురూపుడైన శివుడికీ, శివరూపుడైన విష్ణువుకూ నమస్కారం. శివుడి హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు. విష్ణువు శివమయుడైనట్లుగానే, శివుడు కూడా విష్ణుమయుడే. వారిద్దరి మధ్య భేదం చూపనంత వరకు మనకు శుభం, ఆయుష్షు కలుగుతాయన్నది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అందువల్ల శివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసం అంటే, శ్రీ మహా విష్ణువుకు కూడా అంతే ప్రీతి అని శాస్త్ర విదితం. శివకేశవులకు భేదం లేదు. శివుణ్ణి పూజిస్తే విష్ణువును పూజించినట్లే, శివుణ్ణి ద్వేషిస్తే శ్రీహరిని ద్వేషించినట్లే. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలోని వారితో పాటు, కార్తీక మాసంలో మన తెలుగు వారు కూడా శివ క్షేత్రాలైన పంచారామ క్షేత్రాలను ఏ విధంగానైతే చూడాలని అనుకుంటారో, అదే విధంగా పంచ రంగనాథ క్షేత్రాలను కూడా దర్శించాలని పరితపిస్తుంటారు. ఈ మాట వినగానే, పంచారామ క్షేత్రాలేమిటి? పంచ రంగనాథ క్షేత్రాలేమిటి? అవి ఎక్కడున్నాయి? వాటిని ఏ వరుసలో చూడాలి? వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/3G8ltOzrWDE ]


మనుషులు సులభంగా మోక్షాన్ని పొందే మార్గం చెప్పమని, ఒక నాడు పార్వతీదేవి పరమ శివుణ్ణి అడిగినప్పుడు ఆ ముక్కంటి...

శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే ।
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ।।

అని చెబుతూ.. రామ నామాన్ని మించినది మరొకటి లేదు. ఈ ఒక్క శ్లోకాన్ని చదివితే సహస్ర నామాలు చదివిన ఫలితం దక్కుతుందని సెలవిచ్చాడు. శివకేశవులు వేరు కాదనే సత్యాన్ని ప్రపంచానికి చాటడానికే పరమేష్ఠి అలా చెప్పాడనేది ఇక్కడ మనం గమనించాలి. ఇదొక్కటే కాదు.. మన పురాణేతిహాసాలు ఎన్నో సందర్భాలలో ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. శివకేశవులకు భేదం లేదని స్కంద పురాణం లోనూ స్పష్టంగా ఉంది. శివుడు లయకారుడైతే, విష్ణువు స్థితి కారకుడు..

చంద్రుడికి ప్రాణ భిక్ష పెట్టినవాడూ, రావణుడికి సువర్ణ లంకనోసగినవాడూ, దక్ష యజ్ఞ ధ్వంసకుడూ, హాలాహలాన్ని కంఠంలో దాచుకుని నీలకంఠుడైన ఆది దేవుడూ ఆ పరమేశ్వరుడు. అచంచలమైన భక్తితో ఒక్క మారేడు దళాన్ని సమర్పించి, పంచాక్షరిని తలచినంతనే ప్రసన్నమై, కోరిన వరాలిచ్చేవాడు ఆ భోళాశంకరుడు. అందుకే ఆ స్వామి ఆలయం లేని ఊరు లేదు, మనసారా తలవని హైందవుడు లేడు. అటువంటి స్వామికి ఎంతో ఇష్టమైన మాసం, కార్తీక మాసం. అందుకే అనాదిగా, కార్తీక మాసంలో శివయ్యకు విశేషమైన పూజాది కార్యక్రమాలు చేస్తారు. అంతేకాక, ఈ మాసంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలను దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలగటంతో పాటు, కోరిన కోర్కెలు తీరుతాయని పండితులు చెబుతారు. ఇలా కార్తీక మాసంలోగానీ, సోమవారాలలో గానీ తప్పక దర్శించుకోవలసిన క్షేత్రాలలో, మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న పంచారామాలు ప్రముఖమైనవి. శివకేశవులకు భేదం లేదనే పరమార్థాన్ని చెప్పేవి ఈ పంచారామాలు. మోక్షాలయాలుగా పేరుగాంచిన పంచారామ క్షేత్రాలను, ఒక నియమానుసారంగా దర్శిస్తే మరు జన్మ లేకుండా మోక్షం లభించి, శివ సాయుజ్యాన్ని పొందుతారని శాస్త్ర విదితం.

శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః ।
యుధ్ధే పునస్తారకంచ వధిష్యతి మహాబలః ।।

అని స్కంద పురాణంలో చప్పబడింది. అంటే, తారకాసురుడు నేలకూలడంతో అతనిలోని ఆత్మలింగం ఐదు ఖండాలుగా విడివడింది. దేవతలు ఆ ఐదు లింగ శకలాలనూ ఐదు చోట్ల ప్రతిష్ఠించారు. స్కంద పురాణం, భీమేశ్వర పురాణంలో పంచారామ క్షేత్రాల ఆవిర్భావం వెనుకవున్న గాధ సవివరంగా చెప్పబడింది. పురాణాల ప్రకారం పూర్వం తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మకై తపస్సుజేసి, తనకు కేవలం శివ పుత్రుడైన బాలుడి చేతిలోనే మరణం ప్రాప్తించాలనే వరాన్ని పొందాడు. ఆ తర్వాత మరింత బలం కోసం 'శివుడి'కై ఘోర తపస్సు చేసి, శివుడి ఆత్మలింగాన్ని పొందాడు. ఆ వర బలంతో తారకాసురుడు దేవతలను అనేక విధాలా హింసించడం మొదలు పెట్టాడు.

దేవతలు శ్రీ మహా విష్ణువును ప్రార్ధించగా, 'శివపార్వతుల' వల్ల కలిగిన కుమారుడి చేతిలో మాత్రమే తారకుడి మరణం సంభవిస్తుందని తెలిసింది. దానితో వారు శివుడిని వేడుకోగా ఆయన మన్నించడంతో, శివ పార్వతులకు "కుమారస్వామి" జన్మించాడు. చిన్న తనంలోనే సకల యుద్ధ కళలలో ప్రావీణ్యుడై, కేవలం ఏడేళ్ళ వయసులో యుద్ధానికి వెళ్ళాడు సుబ్రహ్మణ్యుడు. అలా షణ్ముఖుడు తారకుడితో యుద్ధం చేసి కూడా సంహరించలేకపోయాడు. కుమారస్వామి తన బలహీనతను తండ్రికి విన్నవించాడు. ‘తారకుడి కంఠంలో నా ప్రాణ లింగం ఉన్నంత వరకూ అతడు చావడు’ అన్న రహస్యాన్ని చెప్పాడు శివుడు. అప్పుడు కుమారస్వామి తారకుడితో మళ్లీ తలపడి, అతడి గొంతులోని శివలింగాన్ని బాణంతో బద్దలు కొట్టాడు. శివలింగం అయిదు ముక్కలైంది. ఆ శకలాలు గోదావరి, కృష్ణా తీరాల్లో పడ్డాయి. ఆ ప్రాంతాలే పంచారామాలయ్యాయి. అవే ద్రాక్షారామం, అమరారామం, క్షీరారామం, సోమారామం, కుమారారామం.

వాటిలో మొదటిది ద్రాక్షారామం. తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురానికి అతి సమీపంలో ఉంది ఈ క్షేత్రం. ఇక్కడ స్వామిని "భీమేశ్వరుడి"గా కొలుస్తారు. స్వామి లింగాకారం, ఏకంగా 9 అడుగుల ఎత్తుంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడి లింగాకారం సగ భాగం తెలుపు రంగులోనూ, తక్కిన సగం నలుపు రంగులోనూ ఉంటుంది. పురాణాల ప్రకారం, పూర్వం ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించడం వలన, ఈ ప్రాంతానికి దక్షారామం అనే పేరు స్థిరపడింది. కాలగమనంలో అది కాస్తా ద్రాక్షారామంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయం, చాళుక్యరాజయిన భీముడు పునర్ నిర్మించాడని తెలుస్తోంది. అంతేకాదు, అనేక పురాణాలలో ఈ ఆలయం గురించి ప్రస్థావన ఉంది. పూర్వకాలంలో ఎంతో మంది దేవతలూ, రాజులూ స్వామి వారిని దర్శించుకుని తరించారని, 'భీమేశ్వర పురాణంలో' చెప్పబడింది.

పంచారామాలలో రెండవది, 'అమరారామం'. ఇది గుంటూరు జిల్లాలోని అమరావతిలో, కృష్ణానదీ తీరంలో వెలసింది. ఇక్కడ స్వామిని "అమరేశ్వరుడు" అని పిలుస్తారు.  గర్భగుడిలో స్వామి విగ్రహం, 9 అడుగుల ఎత్తున,  తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడి ఉంటుంది. ఇక్కడున్న లింగాన్ని అమరేశ్వరుడైన 'ఇంద్రుడు' ప్రతిష్టించడం వలన, ఆలయం ఉన్న ప్రాంతానికి అమరావతి అనే పేరు స్థిరపడిందని మన పురాణాలలో ప్రస్థావించబడి ఉంది.

ఇక పంచారామాలలో మూడవది, క్షీరారామం. ఈ క్షేత్రం పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో నెలకొని ఉంది. ఇక్కడ శివుణ్ణి, "శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి"గా కొలుస్తారు. ఇక్కడి స్వామివారిని త్రేతాయుగంలో,  'సీతా రాములు' ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతోంది. ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా, ఒక గాధ ఉంది. ఒకానొక సమయంలో శివుడు భూమిలోకి బాణాన్ని వెయ్యగా అందులోనుంచి పాలధార పైకి వచ్చిందట. క్షీరం అంటే పాలు. అందుకే ఆ ప్రాంతానికి క్షీరపురి అనే పేరు నిలిచింది. కాలక్రమంలో 'క్షీరపురి' కాస్తా 'పాలకొల్లుగా' మార్పు చెందింది. ప్రస్తుతం మనకు కనిపించే ఆలయాన్ని, 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఈ ఆలయ గాలి గోపురం, 125 అడుగుల ఎత్తు ఉండి, '9' గోపురాలతో కట్టబడి, ఆ కాలంలో పాలకొల్లు పరిసర ప్రాంతాలలో అత్యంత ఎత్తైన కట్టడంగా కీర్తి గడించింది.

పంచారామాలలో నాలుగవది, "సోమారామం". ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్ల దూరంలోగల, గునుపూడి గ్రామంలో ఉంది. అయితే, గునుపూడి ఒకప్పుడు గ్రామంగా ఉండేది కానీ, కొన్నేళ్ళ క్రితమే ఆ గ్రామాన్ని భీమవరం పట్టణంలో కలిపేసినట్లు, అధికారులు చెబుతున్నారు. అక్కడ స్వామి వారిని "సోమేశ్వరుడు" గా కొలుస్తారు. పూర్వం అక్కడ స్వామిని 'చంద్రుడు' ప్రతిష్టించాడు కాబట్టి, ఆ లింగాన్ని సోమేశ్వరుడిగా కొలవడం, ఆ క్షేత్రానికి 'సోమారామం' అనే పేరు స్థిరపడడం జరిగింది. సోమారామంలోని 'శివలింగానికి' ఒక ప్రత్యేకత ఉంది. మాములు రోజులలో తెలుపు రంగులో ఉండే 'శివలింగం', అమావాస్య రోజు వచ్చేసరికి, గోధుమ రంగులోకి మారుతుంది. మళ్ళీ పౌర్ణమి వచ్చేసరికి తిరిగి తెల్లగా మారుతుంది. ఈ వింత ఎలా జరుగుతోందనే విషయం నేటికీ మానవ మేధస్సుకి అందడంలేదు.

ఇక పంచారామాలలో ఆఖరిది, 'కుమార భీమారామం'. ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు 1 కిలోమిటరు దూరంలో ఉంది. ఇక్కడ స్వామిని "కాల భైరవుడు" గా కూడా కొలుస్తారు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని కూడా, ద్రాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముడే నిర్మించాడని, శాసలనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి 'శివలింగం' సున్నపురాయితో చేసినట్లుగా ఉంటుంది. శైవక్షేత్రాలైన ఈ పంచారామాలలో దాదాపు అన్నింటికీ క్షేత్రపాలకుడు విష్ణుమూర్తే కావడం మరో విశేషం.

ఈ అయిదు ఆలయాలనూ కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కానీ, సోమవారం నాడు కానీ, తొలి సంధ్యలో మొదలుబెట్టి, సాయం సంధ్యలోపు దర్శించుకోగలిగిన వారికి, పునర్జన్మలు లేకుండా మోక్షం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తోంది.

ఇక కార్తీక మాసంలో దర్శించుకోవలసిన పంచరంగ క్షేత్రాల వివరణకి వస్తే, జలం ఏ పాత్రలో పోస్తే ఆ రూపాన్ని సంతరించుకున్నట్లు, భక్తులు ఏ రూపాన్ని కొలిస్తే ఆ రూపంలో సాక్షాత్కరిస్తాడు భగవంతుడు. అలా పాలకడలిపై ఆదిశేషుని మీద శయనించే శ్రీ మహా విష్ణువును యుగయుగాలుగా రంగనాథస్వామిగా కొలుస్తున్నాము. మరీ ముఖ్యంగా ఉత్తరాది కంటే దక్షిణాదిన రంగనాథ స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిలో ఐదు అతి పురాతన క్షేత్రాలు ఎంతో ప్రసిద్ధి గాంచాయి. వాటినే పంచరంగ క్షేత్రాలుగా పిలుస్తారని ఆద్యాత్మిక వేత్తలు చెబుతారు. ఈ ఐదు క్షేత్రాలలో ఒకటి కర్ణాటకలో ఉంటే, మిగిలిన నాలుగూ తమిళనాడులో ఉన్నాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, రంగనాథ స్వామికి అంకితం చేయబడిన ఈ అయిదు విష్ణు క్షేత్రాలూ కావేరీ నదీ తీరంలోనే ఉన్నాయి.

పంచ రంగనాథ క్షేత్రాలలో మొట్టమొదటిది శ్రీ రంగపట్నం. రంగనాధుడు స్వయంభువుగా వెలసిన ఆలయం కావడం చేత, ఆ స్వామి పేరుమీదే, ఈ నగరానికి శ్రీరంగపట్నం అనే పేరొచ్చింది. ఇక్కడ స్వామి వారు కావేరీ సహితంగా కొలువై ఉంటారు. సుమారు 1000 ఏళ్ల క్రితం పశ్చిమ గాంగేయుల కాలంలో పునర్ నిర్మించబడిన ఈ ఆలయం, కొన్ని వేల ఏళ్లనాటి చరిత్రను సొంతం చేసుకున్నది. ఇక్కడున్న రంగనాథుడిని ఆది రంగడని పిలుస్తారు. ఇక్కడ మాత్రమే శ్రీరంగనాథుడి పాదల చెంత కావేరీ మాత ఉండటం మనం గమనించవచ్చు. శ్రీకృష్ణ దేవరాయల వారితో సహా కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం పరితపించినవారే.

ఈ వరుసలో రెండవ ఆలయం తిరుప్పునగర్‌. తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉందీ గ్రామం. ఇందులోని స్వామివారిని ‘శ్రీ అప్ప కుడుత్తాన్‌ పెరుమాళ్‌’ అనే పేరుతో పిలుస్తారు. స్థల చరిత్ర ప్రకారం, ఉభమన్యు అనే రాజుకు విష్ణుమూర్తి ఒక ముసలివాని రూపంలో దర్శనమిచ్చాడు. తనకు ఆకలిగా ఉందని అడగ్గా, ఆకలే కదా అని రాజు గర్వంతో ఎన్నో వంటకాలు చేయించి పెట్టినా అతనికి ఆకలి తీరలేదు. చివరికి పరాశర మహర్షి సూచన మేరకు భక్తితో అప్పాలను అందించగా తృప్తి చెందినట్లూ, అందుకే స్వామిని ‘అప్ప కుడుత్తాన్ స్వామి’ అని పిలవడం మొదలు పెట్టినట్లూ పండితులు చెబుతారు. పంచరంగ క్షేత్రాలలోనే కాకుండా 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ ఆలయాన్ని పేర్కొంటారు.

పంచ రంగనాథ క్షేత్రాలలో మూడవది కుంభకోణం సారంగపాణి ఆలయం. కుంభకోణంలోని ఈ రంగనాథస్వామి దేవాలయంలో స్వామివారు పడుకున్న స్థితి నుంచి కొంచెం పైకి లేచిన స్థితిలో ఉంటారు. దీనిని ఉత్థాన శయన భంగిమ అని అంటారు. ఇటువంటి రూపంలో ఉన్న విగ్రహం ప్రపంచంలో మరొకటి లేదు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం, ఒకప్పుడు హేమ రుషి అనే మహర్షి, సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. దాంతో లక్ష్మీదేవి ఒక తటాకంలోని కలువల నుంచి ఉద్భవించింది. అందువల్ల ఆ లక్ష్మీదేవిని కోమలవల్లి అన్న పేరుతో పిలుస్తారు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే శ్రీ మహా విష్ణువు కూడా అక్కడే ఉంటారు కాబట్టి, ఆయన కూడా ఇక్కడే అవతరించి ఉండిపోయినట్లు తెలుస్తోంది. అందుకే స్వామివారిని ఇక్కడ ఇల్లరికపు అల్లుడిగా చెప్పుకుంటారు. అలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణిగా కొలుస్తారు.

ఈ వరుసలో నాలుగవది, మైలాదుత్తురై ఆలయం. ఇది తమిళనాడు లోని మైలాదుత్తురై పట్టణంలో ఉంది. చంద్రుని తపస్సుకు మెచ్చి ఆ శ్రీ మహా విష్ణువు అవతరించినట్లు స్థల పురాణం చెబుతుంది. పరాకల్‌ అనే ఆళ్వారు భక్తికి మెచ్చి, స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. పరాకల్ అనే ఆళ్వారు మొదట ఒక గజ దొంగ. అతనిని భక్తి మార్గంలో నడిపించడానికి శ్రీ మహావిష్ణువే ఇక్కడ ఓ బ్రాహ్మణుడి వేషంలో ఆయనకు అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించారని కథనం. అటుపై ఆ ఆళ్వారు కోరికమేరకు ఈ క్షేత్రంలో కలియుగాంతం వరకూ రంగనాథుడి రూపంలో కొలువై ఉంటానని శ్రీమహావిష్ణువు స్వయంగా చెప్పారని చెబుతారు. ఇక్కడ స్వామి వారు వెలసి కొన్ని యుగాలు అవుతున్నా, ఇప్పుడు చూస్తున్న ఆలయ అభివృద్ధి మాత్రం దాదాపు వెయ్యేళ్ల క్రితం జరిగినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి స్వామిని ‘పరిమళ పెరుమాళ్‌’ అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆలయం కూడా వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒక్కటి. పూర్వం ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాద స్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని పండితులు చెబుతారు.

ఇక ఈ క్షేత్రాలలో ఆఖరిది శ్రీ రంగం.  పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగాన్ని చివరి క్షేత్రంగా చెబుతారు కానీ, అన్నింటిలోకీ ప్రముఖమైనది ఈ ఆలయమే. విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంఖు ఆకృతిలో కనిపించే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మితమైవుంది. ఇక్కడి మూలవిరాట్టును రావణ సోదరుడు విభీషణుడు ప్రతిష్టించినట్లు చెబుతారు. భారత ఐతిహాసిక చరిత్రలో శ్రీరంగానికి ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే అంటారు. పరమ విష్ణు భక్తురాలైన గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది ఇక్కడే అని స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత దాని నిర్మాణం. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించడానికి ఏకంగా 300 ఏళ్లకు పైగా పట్టివుండవచ్చని చరిత్రకారులు చెబుతారు. భారత దేశంలోనే అతి విశాలమైన దేవాలయాల్లో ఇది మొదటిది. 108 దివ్య ఆలయాలలో ఇదీ ఒకటి. 156 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉంది. రాజగోపురం 236 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడి మూలవిరాట్టుకు వస్త్రాలు సమర్పిస్తే, వివాహం కానివారికి వెంటనే వివాహమవుతుందని భక్తుల నమ్మకం.

ॐ 🚩 ధర్మో రక్షతి రక్షితః 🙏

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas