The TRUE Story of India's Golden Age: The Glory and Mysterious Fall of the Gupta Empire
గుప్త సామ్రాజ్యం!
The Golden Age of India - భారతీయ చరిత్రలో స్వర్ణయుగం!
"ప్రపంచ చరిత్రపుటలలో కొన్ని పేజీలు రక్తాక్షరాలతో లిఖించబడి ఉంటే, మరికొన్ని పేజీలు కన్నీళ్లతో తడిసిపోయి ఉంటాయి. కానీ, భారతీయ చరిత్రలో మాత్రం కొన్ని పేజీలు స్వచ్ఛమైన బంగారంతో లిఖించబడ్డాయి. ప్రపంచం మొత్తం అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు... మన దేశం విజ్ఞాన జ్యోతులను వెలిగించింది. రోమన్ సామ్రాజ్యం కూలిపోతున్న సమయంలో... ఇక్కడ గంగా నదీ తీరాన ఒక మహా సామ్రాజ్యం వెలుగులీనుతోంది.
భారతదేశాన్ని 'సోనే కి చిడియా' అంటే ‘బంగారు పిచ్చుక’ అని ఎందుకు పిలిచేవారు? అప్పట్లో సామాన్యుడు కూడా బంగారు నాణేలను ఎలా వాడేవాడు? సున్నాను కనుగొన్న ఆర్యభట్ట నుండి... మేఘాలను రాయబారులుగా మార్చిన కాళిదాసు వరకు... అందరూ అదే కాలంలో ఎందుకు జన్మించారు?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే... 'గుప్త సామ్రాజ్యం'. సామాన్య శకం 320 నుండి 550 వరకు సాగిన ఆ కాలాన్ని చరిత్రకారులు 'ది గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. కాలగర్భంలో కలిసిపోయిన ఆ సువర్ణ అధ్యాయాన్ని గురించి ఈ రోజు తెలుసుకుందాము. అటువంటి అద్భుత విషయాలు తెలుసుకోవాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/qrQtBpICXkU ]
"ఈ మహా సామ్రాజ్య ప్రస్థానం సామాన్య శకం 3వ శతాబ్దం చివరలో మొదలైంది. శ్రీ గుప్తుడు గుప్త వంశానికి మూలపురుషుడు. నేడు మనం బీహార్ గా పిలుచుకునే మగధ ప్రాంతంలో ఒక చిన్న రాజ్యాన్ని స్థాపించి, 'మహారాజు' అనే బిరుదుతో పాలించాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు ఘటోత్కచుడు పాలన కొనసాగించాడు. వీరిద్దరూ స్వతంత్ర రాజులు కాకపోవచ్చు, బహుశా కుషాణులకు సామంతులుగా ఉండి ఉండవచ్చు అని చరిత్రకారులు భావిస్తారు.
కానీ, గుప్త వంశ చరిత్ర గతిని మార్చింది మాత్రం... సా.శ 320లో సింహాసనాన్ని అధిష్టించిన మొదటి చంద్రగుప్తుడి (Chandragupta I) ద్వారానే. ఆయన కేవలం 'మహారాజు' కాదు... 'మహారాజాధిరాజు'. ఆయన విజయం వెనుక ఒక ఆసక్తికరమైన కోణం ఉంది. అదే ఆయన వివాహం. ఆనాడు అత్యంత శక్తివంతమైన లిచ్ఛవి (Lichchhavi) వంశానికి చెందిన యువరాణి కుమారదేవిని ఆయన వివాహం చేసుకున్నారు. ఈ వివాహ సంబంధం గుప్తుల రాజకీయ శక్తిని అమాంతం పెంచేసింది. ఎంతలా అంటే... చంద్రగుప్తుడు ముద్రించిన బంగారు నాణేలపై ఒక వైపు తన బొమ్మ, మరో వైపు తన భార్య కుమారదేవి బొమ్మను ముద్రించారు. భార్యకూ, ఆమె వంశానికీ అంత గౌరవం ఇచ్చిన రాజు ఆయన."
గుప్తుల కాలంలో ముద్రించబడిన నాణేలను, అవి తయారు చేయబడిన లోహాన్ని బట్టి వివిధ పేర్లతో పిలిచేవారు. బంగారు నాణేలను 'దీనార్లు' (Dinars) అని పిలిచేవారు. ఈ నాణేలు గుప్తుల కాలంనాటి ఆర్థిక శ్రేయస్సు మరియు కళాత్మక నైపుణ్యానికి అత్యుత్తమ ఉదాహరణలు. వెండి నాణేలను 'రూపక' (Rupaka) లేదా 'రూప్యక' (Rupyaka) అని పిలిచేవారు. రాగి నాణేలను 'ద్రాచ్మా' (Drachma) అని పిలిచేవారు. ఈ నాణేలు వివిధ రకాలైన రూపకల్పనలను కలిగి ఉండేవి. నాణేల ముందు భాగంలో పాలక చక్రవర్తి బొమ్మ, వెనుక భాగంలో దేవతల చిత్రాలు లేదా పురాణాల నుండి అంశాలు ఉండేవి.
"మొదటి చంద్రగుప్తుడి తర్వాత... భారతదేశ చరిత్ర గర్వించదగిన చక్రవర్తి సింహాసనం ఎక్కాడు. ఆయనే సముద్రగుప్తుడు. ఆయన గురించి మనకు ఎలా తెలిసింది..? ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ, అంటే నేటి Allahabad లో ఒక అశోక స్తంభం ఉంది. దాని మీద సముద్రగుప్తుడి ఆస్థాన కవి హరిసేనుడు చెక్కించిన సంస్కృత శాసనం... ఆయన విజయగాథను 33 వాక్యాలలో వివరిస్తుంది.
చరిత్రకారులు ఆయనను 'ఇండియన్ నెపోలియన్' అని అంటారు కానీ... నిజానికి నెపోలియన్ కంటే సముద్రగుప్తుడే గొప్పవాడు. ఎందుకంటే నెపోలియన్ తన చివరి యుద్ధం ‘The Battle of Waterloo’ లో ఓడిపోయాడు. సముద్రగుప్తుడు తన జీవితకాలంలో 'అపజయం' అనేది ఎరుగడు.
ఆయన దండయాత్రలు రెండు రకాలు:
1. ఆర్యావర్తం (ఉత్తర భారతం) : అక్కడి 9 మంది రాజులను సమూలంగా నాశనం చేసి, వారి రాజ్యాలను తన రాజ్యంలో కలిపేసుకున్నాడు.
2. దక్షిణా పథం (దక్షిణ భారతం) : ఇక్కడ పల్లవ రాజులతో సహా 12 మంది రాజులను ఓడించాడు. కానీ వారి రాజ్యాలను లాక్కోలేదు. వారిని సామంతులుగా మార్చుకుని, కప్పం కట్టించుకుని వదిలేశాడు. దీన్నే 'ధర్మవిజయం' అని అంటారు.
ఒక వైపు అంతటి యుద్ధవీరుడు... మరోవైపు గొప్ప సంగీతకారుడు కూడా. ఆయన ముద్రించిన నాణేలపై వీణ వాయిస్తూ కనిపిస్తాడు. అందుకే ఆయనను 'కవిరాజు' అని కూడా పిలిచేవారు. యుద్ధం మరియు కళ... రెండూ ఒకే మనిషిలో ఉండటం చాలా అరుదు."
"సముద్రగుప్తుడి మరణం తర్వాత చిన్నపాటి రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. రామగుప్తుడు అనే బలహీన రాజు గురించి కొన్ని కథలు ఉన్నా... చరిత్రలో నిలిచిపోయింది మాత్రం రెండవ చంద్రగుప్తుడు. ఆయననే మనం 'విక్రమాదిత్యుడు' అని పిలుస్తాము.
ఆయన కాలం నాటికి పశ్చిమ భారతదేశంలో 'శక రాజులు' (Shakas) గుప్తులకు తలనొప్పిగా మారారు. విక్రమాదిత్యుడు ఆ శక రాజులను అంతం చేసి, అరేబియా సముద్రం వరకు గుప్త సామ్రాజ్యాన్ని విస్తరించాడు. దీనివల్ల విదేశీ వాణిజ్యం పెరిగి, రోమన్ బంగారం దేశంలోకి వరదలా వచ్చి పడింది.
ఇదే సమయంలో, చైనా నుండి ఒక బౌద్ధ సన్యాసి భారతదేశానికి వచ్చాడు. అతనే ఫాహియాన్ (Fa-Hien). ఆయన రాసిన పుస్తకంలో ఏముందో తెలుసా? 'గుప్తుల రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరూ దొంగతనాలు చేయరు. ఇళ్లకి తాళాలు కూడా వేయరు. రాజులు క్రూరమైన శిక్షలు వేయరు. ఆసుపత్రులు ఉచితంగా వైద్యం అందిస్తున్నాయి' అని రాశాడు. ఒక విదేశీయుడు మన దేశం గురించి ఇంత గొప్పగా రాశాడంటే... ఆ పాలన ఎంత అద్భుతంగా ఉండేదో ఊహించుకోవచ్చు.
విక్రమాదిత్యుడి సభలో 'నవరత్నాలు' ఉండేవారు. అందులో కవి కాళిదాసు, నిఘంటువు రాసిన అమరసింహుడు, ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహిరుడు... ఇలా తొమ్మిది మంది దిగ్గజాలు ఉండేవారు. రాజు కేవలం కత్తి పట్టడమే కాదు, కవులను కూడా గౌరవించాలని ఆయన నిరూపించాడు."
అంతటి విక్రమాదిత్యుడికి సంబంధించి మనం గతంలో చేసిన వీడియోల Playlist ను చూడనివారికోసం పొందుపరుస్తున్నాను.
"ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. గుప్తుల కాలాన్ని 'స్వర్ణయుగం' అని ఎందుకు అంటారు?
మొదటిది సైన్స్: పాశ్చాత్య దేశాలు భూమి బల్లపరుపుగా ఉందని నమ్ముతున్న కాలంలో... ఆర్యభట్ట 'సూర్య సిద్ధాంతం' రాశారు. భూమి గుండ్రంగా ఉందనీ, తన చుట్టూ తాను తిరుగుతుందని, సూర్య చంద్ర గ్రహణాలు రాహు కేతువుల వల్ల కాదు, నీడల వల్ల వస్తాయని ఆనాడే చెప్పాడాయన. అలాగే 'సున్నా' (Zero) విలువనూ, దశాంశ పద్ధతినీ (Decimal System) ప్రపంచానికి అందించింది ఈ కాలమే.
రెండవది మెటలర్జీ (లోహశాస్త్రం): ఢిల్లీలోని కుతుబ్ మినార్ పక్కన ఒక ఇనుప స్తంభం (Iron Pillar) ఉంది. అది గుప్తుల కాలం నాటిది. గత 1600 ఏళ్లుగా ఎండలో, వానలో, కాలుష్యంలో అది అక్కడే స్థిరంగా నిలిచి ఉంది. కానీ నేటికీ దానికి ఒక్క చిన్న తుప్పు మరక (Rust) కూడా పట్టలేదు. ఈనాటి మోడ్రన్ టెక్నాలజీ కూడా అంతటి స్వచ్ఛమైన ఇనుమును తయారు చేయలేకపోతోంది.
మూడవది విద్య: రెండవ చంద్రగుప్తుడి తర్వాత వచ్చిన కుమారగుప్తుడు... ప్రపంచ ప్రఖ్యాత నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇక్కడ కేవలం బౌద్ధ మతమే కాదు... గణితం, వైద్యం, తర్కం, వ్యాకరణం నేర్పించేవారు. చైనా, కొరియా, జపాన్ ల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చేవారు. అదొక ఆక్స్‌ఫర్డ్, అదొక హార్వర్డ్!
ఇక నాలుగవది కళలు: అజంతా గుహల (Ajanta Caves) గోడలపై వేసిన చిత్రాలు ఆ కాలం నాటివే. సహజమైన రంగులతో వేసిన ఆ చిత్రాలు నేటికీ చెక్కుచెదరలేదు. అలాగే దేవాలయ నిర్మాణం ఒక పద్ధతి ప్రకారం, శిఖరాలతో నిర్మించడం మొదలైంది గుప్తుల కాలంలోనే."
"ఏ వెలుగుకైనా చీకటి తప్పదు. కుమారగుప్తుడి పాలన చివరి నాటికి... భారతదేశంపై ఒక భయంకరమైన ముప్పు విరుచుకుపడింది. వారే హూణులు (The Hunas). మధ్య ఆసియా నుండి వచ్చిన ఈ తెగలు విపరీతమైన విధ్వంసాన్ని సృష్టించాయి.
అప్పుడు ఆపద్బాంధవుడిలా వచ్చాడు స్కందగుప్తుడు. హూణులను తరిమికొట్టి, దేశాన్ని రక్షించాడు. కానీ, ఈ నిరంతర యుద్ధాల వల్ల రాజకోశాగారం (Treasury) పూర్తిగా ఖాళీ అయిపోయింది. స్కందగుప్తుడి తర్వాత వచ్చిన రాజులు బలహీనులు. ఒక పక్క హూణుల దాడులు, మరోపక్క అంతర్గత కలహాలు, సామంతులు స్వతంత్రులుగా ప్రకటించుకోవడం... దీనికి తోడు బౌద్ధమతంపై రాజుల ఆసక్తి పెరిగి సైన్యంపై శ్రద్ధ తగ్గడం... వెరసి సా.శ 550 నాటికి ఆ మహా సామ్రాజ్యం చరిత్రలో కలిసిపోయింది."
"గుప్త సామ్రాజ్యం కూలిపోయి ఉండవచ్చు. కానీ ఆ 'స్వర్ణయుగం' తాలూకు వెలుగులు నేటికీ మనల్ని నడిపిస్తున్నాయి. మనం వాడే సంఖ్యల్లో, మనం ఆరాధించే దేవాలయాల్లో, మనం చదివే కావ్యాల్లో... గుప్తుల ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. భారతదేశం అంటే కేవలం మట్టి కాదు, అదొక గొప్ప విజ్ఞాన గని అని ప్రపంచానికి చాటిచెప్పిన కాలం అది.
ఆ చరిత్రను తెలుసుకోవడం, దానిని భావితరాలకు అందించడం మన బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.
ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న: గుప్తుల కాలంలో ముద్రించబడిన బంగారు నాణేలను ఏమని పిలిచేవారు? A) దీనారాలు (Dinars) B) రూపక (Rupaka) C) పణ (Pana) D) నిష్క (Nishka)
సమాధానం మన వీడియోలోనే ఉంది. తెలుసుకోగలిగితే కింద కామెంట్ చేయండి.
మరో చరిత్రతో మళ్ళీ కలుద్దాం... జై హింద్!"

Comments
Post a Comment