ముక్తజీవులు! Supreme love and devotion (Mukta Jeeva) భగవద్గీత Bhagavad Gita Chapter 18


ముక్తజీవులు!
ముక్త-జీవులను కూడా ఆకర్షించే మహాద్భుతమైన గుణములు ఎటువంటివి?

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (51 – 54 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 51 నుండి 54 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/WRr3xsI1QLo ]


పరమ సత్యమును బ్రహ్మము రూపంలో, అనుభవపూర్వకంగా నేర్చుకోవటం ఎలాగో చూద్దాము..

00:48 - బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ ।
శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ।। 51 ।।

00:58 - వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః ।
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ।। 52 ।।

01:08 - అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ ।
విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే ।। 53 ।।

వ్యక్తి ఎప్పుడైతే - ఇంద్రియములను చక్కగా నిగ్రహించి, పరిశుద్ధమైన బుద్ధిగలవాడగునో, శబ్దము, మరియు ఇతర ఇంద్రియ విషయములను త్యజించి, రాగ ద్వేష రహితముగా ఉండునో, అప్పుడు బ్రహ్మమును పొందుటకు పాత్రుడగును. అటువంటి వ్యక్తి, ఏకాంతమును ఇష్టపడతాడు, మితంగా తింటాడు, శరీరమనోవాక్కులను నియంత్రిస్తాడు, నిత్యమూ ధ్యానములో నిమగ్నమౌతాడు, మరియు వైరాగ్యమును అభ్యాసం చేస్తాడు. అహంకారము, హింస, దురభిమానము, కోరికలు, ఆస్తిపాస్తులు తనవే అన్న భావన, స్వార్థము లేకుండా ఉన్నటువంటి వ్యక్తి, ప్రశాంతంగా ఉన్నవాడై, బ్రహముతో ఏకీభావ స్థితిని పొందుటకు అర్హుడవుతాడు.

మన విధులను సరైన దృక్పథంలో చేయటం ద్వారా, మనం పరిపూర్ణ సిద్ధిని ఎలా పొందవచ్చో, శ్రీ కృష్ణుడు చెబుతూ వచ్చాడు. ఇక ఇప్పుడు బ్రహ్మము సాక్షాత్కారానికి కావలసిన శ్రేష్ఠత గురించి వివరిస్తున్నాడు. ఆ యొక్క పరిపూర్ణ సిద్ధి స్థితిలో, మనకు అలౌకిక ఆధాత్మిక జ్ఞానంలోనే స్థితమై ఉన్న విశుద్ధ బుద్ధి పెంపొందుతుంది. ఇష్టాలు, మరియు అయిష్టాల భావనల యందు ఆసక్తి లేకుండా ఉండటంచేత, మనస్సు నియంత్రించబడుతుంది. ఇంద్రియములు నిగ్రహించబడి, శరీర-వాక్కుల ఉద్రేకాలు గట్టిగా నిగ్రహించబడతాయి. శరీర నిర్వహణ కోసం ఉన్న, భుజించటం మరియు నిద్ర వంటి పనులు, వివేకముతో, మితంగా క్రమబద్ధీకరించబడతాయి. అటువంటి యోగి, ధ్యానపరుడై ఉంటాడు. అందుకే ఏకాంతాన్ని ఇష్టపడతాడు. అహంకారము, మరియు దానికున్న అధికార-హోదాల కోసం, తపన నిర్మూలించబడుతుంది. నిరంతరం మనస్సును పరమాత్మ ధ్యానంలో నిమగ్నం చేస్తూ, ఆ యోగి ప్రశాంతముగా, మరియు కామ, క్రోధ, లోభముల బంధము నుండి స్చేచ్ఛతో ఉంటాడు. అటువంటి యోగి, పరమ సత్యమును, బ్రహ్మము రూపంలో తెలుసుకుంటాడు.

03:16 - బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి ।
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ।। 54 ।।

పరబ్రహ్మాంతో ఏకీభావ స్థితిలో ఉన్న వ్యక్తి, మానసికంగా ప్రశాంత చిత్తముతో ఉంటాడు, దేనికీ శోకింపడు, దేనినీ కాంక్షింపడు. సర్వ భూతముల పట్ల సమత్వ భావముతో ఉంటూ, అటువంటి యోగి నా పరాభక్తిని పొందుతాడు.

సంపూర్ణ సిద్ధి స్థాయి యొక్క తన వివరణను, శ్రీ కృష్ణుడిక ఇప్పుడు ముగిస్తున్నాడు. బ్రహ్మ-భూతః అంటే బ్రహ్మమును తెలుసుకున్న స్థితి. దాని యందే స్థితమై ఉండి, ఒక వ్యక్తి సంక్లిష్టమైన, మరియు బాధాకరమైన పరిస్థితులలో కూడా, ప్రశాంతముగా మరియు వాటిచే ప్రభావితం కాకుండా ఉంటాడు. ఆ వ్యక్తి దేనికీ శోకింపడు, లేదా ఎటువంటి కొరతనూ తలంచడు. తన ఆనందం కోసం ఎటువంటి భౌతిక వస్తువునూ కాంక్షింపడు. అటువంటి యోగి, అన్నింటిలో ఉన్నది బ్రహ్మమే అని గ్రహించి, సర్వ భూతములనూ సమ దృష్టితో చూస్తాడు. ఈ స్థితిలో, వ్యక్తి అంతర్గత విజ్ఞాన జ్ఞానోదయ స్థితిలో ఉంటాడు. కానీ, ఇటువంటి జ్ఞానోదయ స్థితిలో ఉన్న వ్యక్తి, భగవంతుని దివ్య ప్రేమను పొందుతాడు. భక్తి అనేది, బ్రహ్మమనే జ్ఞానోదయమునకు ఒక మధ్యమ మెట్టుగా మాత్రమే చేయదగినదని, జ్ఞానులు తరచుగా అంటుంటారు. భక్తి అనేది, అంతఃకరణ శుద్ధికి మాత్రమే ప్రయోజనకారి అనీ, ఈ పథంలో చివరికి కేవలం జ్ఞానమే మిగిలిపోతుందనీ అంటుంటారు. అందుకే దృఢమైన బుద్ధీ, వివేకమూ ఉన్నవారు, భక్తిని పక్కకుపెట్టి, కేవలం జ్ఞానమునే పెంపొందించుకోవాలని, సిఫారసు చేస్తారు. కానీ, ఈ పై శ్లోకం ఇటువంటి దృక్పథాన్ని ఖండిస్తుంది.

అత్యున్నతమైన జ్ఞానోదయాన్ని పొందిన తరువాత, వ్యక్తి పరా భక్తిని పెంపొందించుకుంటాడు. వేద వ్యాసుడు ఇదే విషయాన్ని, శ్రీమద్భాగవతంలో పేర్కొన్నాడు. ‘ఆత్మ యందే రమించే ఆత్మారాములు, ఆత్మ జ్ఞానములోనే స్థితమై, భౌతిక బంధాలనుండి విముక్తులైనవారు.. ఇటువంటి సిద్ధులైన జీవులు కూడా, భగవంతుని పట్ల భక్తిని కలిగిఉండాలని కోరుకుంటారు. భగవంతుని మహాద్భుతమైన గుణములు ఎటువంటివంటే, అవి ముక్త-జీవులను కూడా ఆకర్షిస్తాయి.’ ఆత్మ జ్ఞానాన్ని పొంది, నిరాకార బ్రహ్మామును ఆచరణలో తెలుసుకున్న స్థితిలో, ప్రఖ్యాత జ్ఞానులు ఎందరో ఉన్నారు. కానీ, ఎప్పుడైతే వారికి అలౌకికమైన భగవంతుని దివ్య గుణముల క్షణ దర్శనము లభించిందో, వారు సహజంగానే భక్తి మార్గంలో ఆకర్షితులయ్యారు.

నాలుగు యుగాలలో ప్రతి యుగం నుండీ ఇటువంటి జ్ఞానులున్నారు. సత్య యుగపు మహా జ్ఞానులు, బ్రహ్మ నలుగురు కుమారులైన సనత్ కుమారుడు, సనాతన కుమారుడు, సనక కుమారుడు, మరియు సనందన కుమారుడు. వారు పుట్టుకతోనే ఆత్మజ్ఞాన సంపన్నులు. వారి మనస్సులు నిత్యమూ నిరాకార బ్రహ్మము యందే నిమగ్నమై ఉండేవి. ఈ నలుగురు కుమారులు ఒకసారి విష్ణుమూర్తి నివాసమైన వైకుంఠాన్ని సందర్శించారు. అక్కడ భగవంతుని యొక్క పాదారవిందముల వద్ద నుండి, తులసి ఆకుల పరిమళం వారి ముక్కుపుటాలను తాకింది. అది వారి హృదయంలో అమితమైన ఆనందాన్ని రేకెత్తించింది. తక్షణమే, నిర్గుణ బ్రహ్మముపై వారి ధ్యానం అంతమై పోయింది. వారు విష్ణుమూర్తి యొక్క దివ్య ప్రేమానందములో మునిగి పోయారు. అప్పుడు వారొక వరం కోసం వేడుకున్నారు: ‘ఓ స్వామీ, నీ పాదారవిందముల నుండి జాలువారే దివ్య ప్రేమానందమును గ్రోలే అవకాశం మా మనస్సుకు లభించినంత కాలం, నీవు మమ్ములను నరకానికి పంపినా, మాకు సమ్మతమే.’ ఒక్కసారి ఊహించండి.. నిరాకార బ్రహ్మమును అనుభవించిన తరువాత కూడా, ఈ వరిష్ఠమైన జ్ఞానులు, భగవంతుని సగుణ రూపము యొక్క ఆనందమును అనుభవించుటకు, నరకములో కూడా ఉండటానికి వెనుకాడలేదు.

ఇక ఇప్పుడు, త్రేతాయుగములో చూసినట్లయితే, ఆ యుగపు మాహా జ్ఞాని, జనక మహారాజు. ఆయన శ్రీరామ చంద్ర ప్రభువు యొక్క నిత్యసఖి సీతమ్మవారి త్రండ్రి . ఆయనకే విదేహుడనే పేరు కూడా ఉన్నది. అంటే శారీరక దృక్పథానికి అతీతుడన్నమాట. ఆయన మనస్సు నిత్యమూ నిరాకార బ్రహ్మము పట్లనే రమిస్తూ ఉండేది. కానీ, ఒకరోజు విశ్వామిత్ర మహర్షి ఆయనను కలవటానికి, శ్రీ రామచంద్రుడు మరియు లక్ష్మణుడితో సహా వెళ్లారు. రామచంద్ర ప్రభువును చూసిన జనక మహారాజు, నిరాకార బ్రహ్మము యొక్క ఆనందముపై ఆసక్తిని కోల్పోయాడు. భగవంతుని సాకార రూపము పట్ల, గాఢంగా ఆసక్తుడై పోయాడు.’ ఈ విధంగా, తేత్రాయుగపు మోహోన్నత జ్ఞాని, భక్తి పథంలోకి వచ్చాడు.

ద్వాపర యుగపు మహోన్నత జ్ఞాని, వేద వ్యాసుని పుత్రుడు ‘శుకదేవుడు’. ఆయన ఎంత ఉన్నతుడంటే, బయటకు వస్తే, భౌతిక శక్తి మాయ తనను వశపరుచుకుంటుందని, తల్లి గర్భంలోనే పన్నెండు సంవత్సరములున్నాడని, పురాణములు మనకు చెబుతున్నాయి. చివరికి, నారద మహర్షి వచ్చి, తల్లి చెవుల ద్వారా ఆయనతో మాట్లాడి, బయటకు వస్తే ఏమీ కాదులే అని హామీ ఇచ్చి, తనను తల్లి గర్భం నుండి బయటకు రమ్మని వేడుకున్నాడు. ఆ తరువాత ఆయన బయటకు వచ్చి, తన యోగ శక్తి చే, తన శరీరాన్ని పన్నెండు సంవత్సరముల బాలుడిగా పెద్దదిగా చేసుకుని, ఇంటిని వదిలి, సన్యసించి అడవిలో నివసించటానికి వెళ్లిపోయాడు. అక్కడ, త్వరితగతిన అత్యున్నత సమాధి స్థితికి చేరుకున్నాడు. అలా సంవత్సరములు గడచిన పిదప, వేద వ్యాసుని శిష్యులు అడవిలో కట్టెలు కొడుతూ, ఆయనను సమాధి స్థితిలో చూశారు. వారు తిరిగివెళ్ళి వేదవ్యాసునికి ఆ విషయం చెప్పారు.

ఆయన శుకదేవుని చెవిలో, శ్రీ కృష్ణుడి స్వరూప అందాన్ని వివరించే ఒక శ్లోకాన్ని, ఈ విధంగా చెప్పాడు.. ‘శ్రీ కృష్ణుడు శిరస్సుపై నెమలి పింఛముతో ఉన్న కిరీటముతో అలంకరింపబడి ఉన్నాడు. తన స్వరూపాన్ని గొప్ప నర్తకుడిగా చూపిస్తున్నాడు. ఆయన చెవులు నీలి కర్ణికా పుష్పములచే అలంకరింపబడి ఉన్నవి. ఆయన శాలువా, బంగారు వర్ణముతో మెరిసిపోతున్నది. ఆయన వైజయంతీ పూసల మాలను మేడలో ధరించి ఉంటాడు. తన వేణువు యొక్క రంధ్రములను తన అధరామృతముతో నింపివేస్తాడు. ఆయన బృందావనము చేరగానే, గోపబాలురచే చుట్టుముట్టబడి, కీర్తించబడతాడు. ఆయన పాద గుర్తులు, ఆ నేల సౌందర్యాన్ని మరింత ఇనుమడింప చేస్తాయి.’ ఈ శ్లోకము తన చెవులలోనికి ప్రవేశించిన సమయంలో, శుకదేవుడు నిరాకార బ్రహ్మములో లీనమై ఉన్నాడు. అకస్మాత్తుగా ఆయన ధ్యాన విషయం, మైమరిపించే శ్రీ కృష్ణ భగవానుని స్వరూపంపైకి మళ్ళింది. భగవంతుని సాకార రూపం పట్ల ఎంత గాఢంగా ఆకర్షింపబడ్డాడంటే, తన సమాధిని వదిలి, తండ్రి వేద వ్యాసుని దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆయన నుండి, సంపూర్ణ భక్తి మాధుర్యముతో నిండినటువంటి శ్రీమద్ భాగవతమును విన్నాడు. తదుపరి కాలంలో, గంగానదీ తీరంలో, అర్జునుడి మనుమడైన పరీక్షిత్తు మహారాజుకు దానిని వివరించాడు. ఈ విధంగా, ద్వాపర యుగపు అత్యున్నత జ్ఞాని, భక్తి పథంలో ఆకర్షింపబడ్డాడు.

చివరికి, ఇక కలి-యుగానికి వద్దాము. జగద్గురు శంకరాచార్య, కలియుగపు అత్యున్నత జ్ఞానిగా పరిగణించబడతాడు. అద్వైత వాద తత్త్వమును ప్రాచుర్యం లోనికి తెచ్చినది ఆయనే. దీని ద్వారా ఆయన చెప్పినది, సృష్టిలో ఉన్నది ఒక్కటే అనీ, అదే నిర్గుణ అంటే గుణములు లేకుండా ఉన్నది, నిర్విశేష అంటే, లక్షణములు లేకుండా, నిరాకార అంటే, ఆకారము లేకుండా ఉన్న బ్రహ్మమని చెప్పారు. కానీ, ఎంతోమందికి తెలియని విషయం ఏమిటంటే, ఇరవై సంవత్సరాల వయస్సు నుండి, ముప్పైరెండు సంవత్సరాల వయస్సులో ఆయన శరీరాన్ని విడిచిపెట్టే వరకూ, శ్రీకృష్ణ భగవానుడు, శ్రీరామ చంద్ర ప్రభువు, శివుడు, మరియు దుర్గామాతలపై వందల శ్లోకాలను రచించారు. నాలుగు ధామాలను కూడా దర్శించి, భగవంతుని యొక్క సాకార రూప విగ్రహాలను కూడా ఆరాధించారు. ఈ విధంగా, మహోన్నత జ్ఞానోదయ స్థితికి చేరినవారు, ఆ తదుపరి భక్తిలో నిమగ్నమయ్యారనటానికి, కలియుగంలో శంకరాచార్యుల వారు ఒక ఉదాహరణ.

11:40 - ఇక మన తదుపరి వీడియోలో, భగవానుడి కృపచే ఎటువంటి వారు నిత్యశాశ్వతమైన, మరియు అనశ్వరమైన ధామమును పొందుతాతో, శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History

మనిషి శరీరాన్ని పోలిన మెత్తటి శరీరం గల నరసింహ స్వామి విగ్రహం ఎక్కడుంది? Hemachala Lakshmi Narasimha Swamy Mallur