The Legendary Encounter of RAVANA and Bali Chakravarthy - రావణుడికి బలి చక్రవర్తి హెచ్చరిక!


రావణుడికి బలి చక్రవర్తి హెచ్చరిక!
వామనుడి చేత తొక్కబడిన బలి చక్రవర్తి కాలానికీ రావణుడి కాలానికీ సంబంధముందా?

ఉత్తమోత్తమ పుత్రుడు.. ఆదర్శ సోదరుడు.. ప్రతి స్త్రీ కోరుకునే సర్వోత్తమ పతి.. గురువులందరూ కోరుకునే ఉత్తమ శిష్యుడు.. మర్యాద పురుషోత్తముడు.. ప్రపంచ మానవాళి పాటించాల్సిన జీవివన విధానాన్ని తానాచరించి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన యుగపురుషుడు, రామచంద్ర ప్రభువు. అటువంటి స్వామి చరితం ఎన్ని సార్లు విన్నా, ఎంత మంది ఎన్ని విధాలుగా సినిమాలు తీసినా, ఎన్ని చూసినా తనివి తీరదు. వాల్మీకి మహర్షి కొన్ని యుగాల పూర్వమే ఎంతో చక్కగా, మరెంతో అద్భుతంగా, ఆ స్వామి చరిత్రను రామాయణంగా భావి తరాలకు అందించిన విషయం తెలిసిందే. ఇంత కాలంగా చాలా మంది కవులు, కళాకారులు, వాల్మీకి రామాయణాన్ని తమ తమ భాషలలో మళ్ళీ మళ్ళీ అనువదించారు. ఎన్నో నాటకాలు రచించి, రంగస్థలంపై కళ్ళకు కట్టినట్లు చూపించారు. బుర్ర కథలతో ప్రచారం చేశారు, పొడుపు కథలలో పొందు పరిచారు, పుస్తకాలలో ప్రచురించారు. ఈ ఆధునిక యుగంలో నాటకాలుగా, సినిమాలుగా, ప్రజల ముందుకు తీసుకువచ్చారు. అయినా ఈ నాడు అందరికీ రామాయణం సంపూర్ణంగా తెలుసా అని ప్రశ్నిస్తే.. తెలియదనే సమాధానమే వస్తుంది. మరీ ముఖ్యంగా ఈ తరం యువతకు అస్సలు తెలియదు. అటువంటి వారి కోసమే, రామాయణంలోని ఓ అద్భుత ఘట్టం, ‘బలి చక్రవర్తి దెబ్బకు బెదిరిన రావణుడు’.. ఈ మాటలు వినగానే, ఆశ్చర్యంతో పాటు ఎన్నో సందేహాలు కలుగుతాయి. బలి చక్రవర్తి కాలానికీ, రావణుడి కాలానికీ చాలా వ్యత్యాసం ఉందికదా! అనే ప్రశ్న ముందుగా తలెత్తుతుంది. ఈ ప్రశ్నలకు సమాధానంతో పాటు, చాలా మంది వినని ఓ అద్భుతమైన రామాయణ ఘట్టాన్ని తెలుసుకోవాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/MCAjZHwIDqU ]


రామాయణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఆ మాహా కావ్యం, రాముడి జననంతోనే కాదు, అంతకు చాలాముందు, రావణుడి పుట్టుకతో మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకో విధంగా చెప్పాలంటే, లోక కంటకుడిగా మారిన రావణుడిని వధించడమే ప్రధానమైన లక్ష్యంగా మొదలైన రాముడి జీవితం వెనుక, మరో లక్ష్యం కూడా ఉంది. అదే భూలోక వాసుల జీవన విధానంలో సరైన మార్గ నిరదేశన చేయడం. ఇచ్చిన మాట తప్పకపోవడం, సర్వదా పెద్దల మాట, గురువుల మాట, తల్లిదండ్రుల మాట శిరసావహించడం, వారు చెప్పిన మాటలను తూచా తప్పకుండా ఆచరించడం. ప్రతి మగాడు ఏక పత్నీ వ్రతుడిగా ఉండటం, ఉత్తమ భర్తగా, సోదరుడిగా, ఆదర్శ రాజుగా, బాధ్యతగల మహా విరుడిగా, సర్వోత్తమ నరుడిగా, ఇలా చెప్పకుంటూ పోతే, రాముడి సుగుణాలు వర్ణించడానికి, ఈ ప్రపంచంలో ఉన్న ఏ భాష సరిపోదు. ఇన్ని మంచి గుణాలను ఆ స్వామి మానవాళికి అందించాడు. ఇలా ఆయన గాధలో రాముడితో పాటు సర్వోత్తమ ఇల్లాలిగా సీతామాత, ఎంతటి భోగాలూ, మాహా వీరులు సైతం తన కాళ్లదగ్గరకు వచ్చినా, తన మెడలో తాళికట్టిన ప్రాణనాధుడి కోసం, ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధమైన మహా పతివ్రతగా నారీ లోకానికి ఆదర్శ ప్రాయమై నిలిచింది. ఒక సోదరుడి పాత్ర ఎలా ఉండాలని చెప్పడానికి, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులూ, తాను నమ్మిన యజమానితో ఎలా ఉండాలని చెప్పడానికి హనుమతుడూ, స్నేహ ధర్మం ఎలా పాటించాలని చెప్పడానికి సుగ్రీవుడూ.. ఇలా చెప్పుకుంటూ పోతే, రామ చరితంలో కనిపించే ప్రతి జీవితం, సమస్త మానవాళికి ఒక సందేశాన్నిచ్చింది.

అసలు ఒక మనిషి ఎలా ఉండకూడదు, అందులోనూ జ్ఞానం కలిగిన వ్యక్తులు అస్సలు ఉండకూడని పద్దతుల గురించి వివరించేటప్పుడు, రావణుడిని ఉదాహరణగా చెబుతారు. ఇప్పటికీ చాలా మంది రావణుడిపై ఎన్నో అపోహలు పెట్టుకుని బ్రతుకుతుంటారు. ఆయాన మహా జ్ఞాని, మహా వీరుడు, రాముడి కంటే గొప్పగా స్వర్ణ లంకను నిర్మించాడు, అధునాతన సాంకేతికతను వాడి పుష్పక విమానాన్ని తయారు చేశాడు, తన చెల్లికి జరిగిన అవమానం భరించలేకనే, సీతమ్మను అపహరించాడు వంటి అపోహలే ఆధునికుల మదిలో నాటుకుపోయి ఉన్నాయి.

ఈ అపోహలకు సమాధానం కూడా రామాయణంలోని ఈ ఘట్టం స్పష్టంగా చెబుతుంది. పూర్వం బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుడికీ, అతని భార్య మానినికీ పుట్టిన వ్యక్తి, ‘విశ్రవసుడు’. ఆయన కూడా తండ్రిలా ఉత్తమ గుణాలూ, మహా జ్ఞానం కలిగిన మహర్షి. ఆయన తేజస్సు, జ్ఞానం చూసి మెచ్చిన భరద్వాజ ముని తన కుమార్తె అయిన ఇలబిలనిచ్చి వివాహం చేయగా, వారికి సకల సంపదలకూ అధిపతి అయిన కుబేరడు పుట్టాడు. ఆ సుగుణాలను చూసి మెచ్చిన అసుర రాజు సుమాలి, ఓ వీరుడు, జ్ఞాని అయిన మనుమడిని పొందాలనే ఆశతో, తన కుమార్తె కైకసిని విశ్రవసుడికిచ్చి పెళ్లి చేయగా, ఆమె తండ్రి కోరిక మేరకు అసుర సంధ్య వేళలో తన భర్త చెంతకు చేరి తన కోరికను వెలిబుచ్చింది. ఆయన మహాజ్ఞాని కావడంతో, అందువలన కలగబోయే అనర్ధాన్నీ, దాని వెనుకగా జరగబోయే లోక కళ్యాణాన్ని ముందుగానే గ్రహించి, భార్యను హెచ్చరించాడు. కానీ తండ్రి మాట జవదాటలేనని ఆమె చెప్పడంతో, అసుర గుణాలు కలిగిన సంతానంతో పాటు, సుబుద్ది కలిగిన సంతానం కూడా కలుగుతుందని చెప్పి, ఆమె కోరికను మన్నించాడు. తత్ ఫలితంగా ఆమెకు, క్రూర స్వభావం కలిగిన రావణ, కుంభ కర్ణ, శూర్పణఖలతో పాటు, ఉత్తమ గుణాలు కలిగిన విభీషణుడు కూడా జన్మించాడు.

అయితే, తండ్రి దగ్గర నుంచి సకల వేదాలపై, సమస్త శాస్త్రాలపై పట్టు తెచ్చుకున్న రావణుడుకి, సకల లోకాలనూ ఏలే చక్రవర్తి కావాలనే బలమైన కోరిక ఉండేది. ఆ కోరిక వెనుక లెక్కలేనంత క్రూరత్వం కూడా దాగి ఉండేది. కానీ తాను అనుకున్నది సాధించాలంటే, సవతి తల్లికి పుట్టిన సోదరుడు కుబేరుడి సంపదతో పాటు, అద్భుతమైన వరాలను పొందాలని గ్రహించిన రావణుడు, గోకర్ణ క్షేత్రంలో దాదాపు పదివేల సంవత్సరాలు బ్రహ్మ దేవుడి కోసం ఘోర తపస్సు చేశాడు. ఈ క్రమంలో సంవత్సరానికి ఒక తల చొప్పున, ఒక్కో తలని నరికి బ్రహ్మ దేవుడికి అర్పిస్తూ, కఠిన తపస్సు చేశాడు. ఇక తన ఆఖరి తల కూడా నరుక్కోడానికి సిద్ధపడగా, బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమయ్యి, రావణుడి తలలన్నీ తిరిగి ఇచ్చేసి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు సంపూర్ణ అమరత్వం కావాలని కోరుకున్నాడు, రావణుడు. అది తాను ఇవ్వకూడదనీ, అది లోక విరుద్ధమనీ, మరేదైన వరం కోరుకోమనీ బ్రహ్మ దేవుడు చెప్పడంతో, దేవ, దానవ, కిన్నెర, కింపురుష, నాగ, గరుడ, సిద్ధ, సాధ్య, విద్యాధరాది జాతుల చేతిలో మరణం లేని వరాన్ని ఇవ్వమని కోరాడు, రావణుడు. తధాస్తు పలికాడు, బ్రహ్మ దేవుడు.

అప్పటి వరకు కేవలం జ్ఞానం, వీరత్వం మాత్రమే ఉన్న రావణుడికి కొండంత బలంగా ఈ వరాలు తొడవ్వడంతో, ముందుగా తన సోదరుడైన కుబేరుడు పాలిస్తున్న సువర్ణ లంకపై దాడి చేశాడు. రావణుడికి మొదటి నుంచీ సోదరుడి రాజ్యంపై కన్నుంది. సర్వ సంపదలకూ అధిపతి అయిన కుబేరుడు, సమస్త లోకాలలో ఎక్కడా లేని విధంగా, ఓ అద్భుతమైన నగరం కట్టదలచి, ఆ సువర్ణ లంకను నిర్మింపజేసినట్లు పురాణ విదితం. అలాంటి లంకపై మనసుపడ్డ రావణుడు, బ్రహ్మ వరం కారణంగా దేవతలను సైతం ఎదిరించే బలాన్ని సొంతం చేసుకోవడంతో, ముందుగా లంకను ఆక్రమించుకుని, సోదరుడిని తరిమేసి, తాను లంకాధిపతిగా గద్దెనెక్కాడు.

కొంత కాలానికి కుబేరుడు పుష్పక విమానం అనే ఓ అద్భుత విమానాన్ని తయారు చేయించుకున్నాడని తెలిసి, కుబేరుడు కైలాస పర్వతం దగ్గర నిర్మించుకున్న అలకాపురిపై దాడి చేసి, సోదరుడిని ఓడించి, ఆ పుష్పక విమానాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. అద్భుతమైన సాంకేతికతగల ఆ విమానంలో ఎంతమంది ఎక్కినా, ఇంకో వ్యక్తికి చోటుండేలా తయారు చేయబడిందది. అంతేకాకుండా, దానిని నడిపే వ్యక్తి కోరిన రూపంలోకి అది మారడమే కాకుండా, కాంతి వేగాన్ని మించిన వేగంతో ప్రయాణించడం దాని మరో ప్రత్యేకత. అసలే బ్రహ్మ వరంతో బలవంతుడైన రావణుడికి పుష్పక విమానం కూడా తొడవ్వడంతో, అన్ని లోకాలపై దండయాత్రలు చేయడం మొదలుపెట్టాడు.

అలా ముందుగా అసురలకు చిరకాల స్వప్నమైన స్వర్గ లోకానికి వెళ్ళి, దేవేంద్రుడిని ఓడించి, స్వర్గాన్ని సొంతం చేసుకున్నాడు. అలా ఒక్కొక్క లోకాన్నీ జయిస్తూ రసాతల లోకం వెళ్ళాడు. నాగరాజు వాసుకి పాలించే భోగవతి పురం వెళ్ళి, నాగులను జయించాడు. అక్కడి నుంచి మణిమయ పురం అనే మాయా రాజ్యానికి వెళ్ళి, నివాత కవచులనే మహా క్రూరమైన రాక్షసులతో స్నేహ సంబంధాలు నెలకొల్పాడు. ఈ నివాత కవచ్చులనే, ద్వాపర యుగంలో అర్జునుడు చంపాడు. ఈ కథనం గురించి, మన next వీడియోలో తెలుసుకుందాము. ఇక ఆ తర్వాత అష్మ నగరం, లేదా విమాన నగరం అనే మరో వింత నగరానికి వెళ్ళి, అక్కడ ఉండే కాలకేయులనే రాక్షసులను ఓడించాడు. అలా చివరగా వరుణుడి నగరమైన శ్రద్ధావతికి వెళ్ళి వరుణ పుత్రులను జయించి, లంకకు పయనమయ్యాడు. సరిగ్గా ఇక్కడే, ఓ అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. ఈ ఘట్టం, అధర్మపు పనులు చేసేవారి జీవితం ఏమౌతుందో స్పష్టంగా తెలియజేస్తుంది. ధర్మంగా జీవించేవారిని ఆ శ్రీమహా విష్ణువు స్వయంగా ఎలా కాపు గాస్తాడో స్పష్టీకరిస్తుంది. రావణుడి భవిష్యత్తు ఏమిటో ఆయనకు తెలిసేలా చేసింది, ఈ ఘట్టం.

అలా ఆనాడు వరుణ కుమారులను జయించి, పుష్పక విమానంలో తన సమస్త సైన్యంతో బయలుదేరిన రావణుడికి ఒక చోట ధగధగ మెరిసిపోతున్న అద్భుతమైన భవంతి ఒకటి కనిపించింది. ఆ భవనం పూర్తిగా బంగారంతో, ఎంతో విలువైన వజ్రాలతో, సూర్య కాంతిలా మెరిసిపోతూ ఉంది. అంతటి అద్భుతమైన భవంతిని ముందెన్నడూ చూసి ఉండకపోవడంతో, రావణుడికి ఆ భవంతి ఎవరిదో తెలుసుకోవాలనే కుతూహలం పెరిగిపోయింది. వెంటనే తన పుష్పక విమానాన్ని ఆ భవంతి ముందున్న విశాలమైన ప్రాంగణంలో నిలిపాడు. తన మంత్రిని పిలిచి, ఆ భవనంలో ఎవరు ఉన్నారో తెలుసుకుని రమ్మని పంపాడు.

రాజాజ్ఞ మేరకు ఆ భవనం ముందుకు గర్వంగా వెళ్ళిన మంత్రికి, ఏదో తెలియని భయం మొదలైంది. అక్కడ ఎటువంటి ప్రాణీ కనిపించలేదు. స్వర్ణ, మణిమయమైన అంతపెద్ద భవంతి ముందు కాపాలాదారులు కూడా లేరనే సందేహం కలిగింది. అలా భయపడతూ, సందేహ పడుతూ, భవన ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్ళగానే, పెద్దగా నవ్వు వినిపించింది. అది విని మంత్రికి గుండె ఆగినంత పనైంది. కాస్త దూరంలో దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఓ మహా పురుషుడు కూర్చుని కనిపించాడు. ఆయనను చూడటం మంత్రి తరం కాలేదు. భయంతో వెనక్కి పరుగులు తీసి, రావణుడికి జరిగింది మొత్తం చెప్పాడు.

దాంతో రావణుడే స్వయంగా ఆ భవన ద్వారం వద్దకు వెళ్ళగానే, సౌందర్యం అంటే ఇలాగే ఉంటుందేమో అన్నట్లు ఉండే ఒక మహా కాయం కలిగిన వ్యక్తి కనిపించాడు. అయితే అతను అంత అందంగా ఉన్నా, రావణుడికి భయంకరమైన వ్యక్తిగా కనిపిస్తూ, అతని గుండె వేగాన్ని పెంచేశాడు. లోపల పట్టలేనంత భయం వేసినా, పైకి మాత్రం కనిపించకుండా, ఆ భవనంలో ఉండేది ఎవరని అడిగాడు. దానికి ఆ ద్వారపాలకుడు, ఆ భవనంలో ఉండేది దానవ చక్రవర్తి, మహా యోధుడు, దానాలలో శూరుడు అయిన బలి చక్రవర్తి అని సమాధానం ఇచ్చాడు. దాంతో రావణుడు, ఆయనను కలవాలని చాలా కాలంగా అనుకుంటున్నానని అన్నాడు. అది విన్న అతడు, రావణుడిని లోపలికి పంపించాడు.

ఇక్కడ మనకొక సందేహం కలగవచ్చు.. రావణుడి కాలానికీ, బలి చక్రవర్తి కాలానికి చాలా వ్యత్యాసం ఉంది కదా అని.. రావణుడి కంటే లక్షల సంవత్సరాల క్రితమే బలి చక్రవర్తి చరిత్ర ముగిసింది కదా అని, మనకు అనిపించవచ్చు. చాలా మంది, వామన మూర్తి బలిని చంపేశాడని కూడా అంటారు. ఇదంతా అర్ధ సత్యం. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడిన మాటలని చెప్పాలి. ఎందుకంటే, సప్త చిరంజీవులలో బలి చక్రవర్తి కూడా ఒకరు. వామన మూర్తి మూడవ అడుగుతో బలిని తొక్కే ముందే, ఆయనకి ఎన్నో వరాలను కూడా ఇచ్చారు. వాటిలో ప్రధానమైనవి, మరణం లేని జీవితం, ఇంద్ర పదవి. ప్రస్తుతం నడుస్తున్న వైవస్వత మన్వంతరం ముగిసెంత వరకూ పాతాళ లోకాన్ని పాలించమని చెప్పి, ఈ మన్వంతరం ముగిసిన తర్వాత స్వర్గాధిపత్యం వహించమని, వామన రూపుడైన విష్ణు మూర్తే స్వయంగా వరం ఇచ్చాడు. అలా సప్త చిరంజీవులలో ఒకరైన బలి చక్రవర్తి, నేటికీ ఈ భూమిపై సజీవంగా ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

అలా త్రేతాయుగంలో రావణుడు ఆ భావంతిలోకి వెళ్ళగా, లోకంలో ఎక్కడా కనిపించని అమూల్యమైన మణి మాణిక్యాలతో పొదగబడిన సువర్ణ సింహాసనంపై, మహా తేజోవంతంగా వెలిగిపోతున్న బలి చక్రవర్తి కనిపించాడు. రావణుడు అతడికి నమస్కరించగా, బలి ఆదరపూర్వకంగా రావణుడితో మాట్లాడాడు. ఈ క్రమంలో రావణుడు, ‘రాజా మీ గురించి, మీ పరాక్రమాల గురించి ఎంతో విన్నాను. విష్ణువు కపటంతో మీకు చేసిన అన్యాయం గురించి కూడా విన్నాను. ఇప్పుడు మీరు ఎలాంటి చింతా పెట్టుకొనవసరం లేదు.. మిమ్మల్ని నేను విడిపిస్తాను. ఆ విష్ణువు ఎలా అడ్డుపడతాడో చూస్తాను.. మీరు నాతో స్నేహం చేయండి చాలు’ అని అన్నాడు. దానికి బలి చక్రవర్తి, ‘సరే రావణా.. నీవన్నట్లుగానే చేద్దాము.. కానీ, దానికి ముందు నాదో మనవి. పక్కన ఉన్న గదిలో కొన్ని ఆభరణాలు ఉన్నాయి. వాటిని కాస్త తెచ్చిపెట్టు’ అని అన్నాడు. దానికి రావణుడు సరే అని, ఆ గదిలోకి వెళ్ళి అక్కడ ఉండే భారీ ఆభరణాలను సునాయాసంగా ఎత్తడానికి ప్రయత్నించాడు. కానీ అవి కదలలేదు. ఆశ్చర్యపోయిన రావణుడు, తన బలాన్ని మొత్తం ఉపయోగించి ప్రయత్నించగా, అవి కదలకపోగా, అతనిపైకి ఒరిగాయి. ఆ బరువును తట్టుకోలేక, నరాలు చిట్లి, కళ్ళలోనుంచీ, నాసికా రంధ్రాలలోనుంచీ రక్తం కారడం మొదలయింది. ఇంతలో అక్కడికి వచ్చిన బలి చక్రవర్తి, రావణుడు పడుతున్న తిప్పలు చూసి నవ్వుకుని, వెంటనే ఆ ఆభరణాలను పక్కకు నెట్టాడు.

బాధతో నేల కూలబడి, రక్తమోడుతున్న రావణుడిని చూసి బలి చక్రవర్తి, ‘ ఏం దానవ రాజా, అలా నేలపై పడిపోయావే.. నువ్వు కదిలించలేకపోయిన ఆ ఆభరణాలు స్వయానా మా ముత్తాత గారైన హిరణ్యకశిపుడివి. నాడు ఆయన 14 లోకాలు జయించిన మాట నీకు తెలిసే ఉంటుంది.. ఆ సమయంలో దేవతలతో యుద్ధ చేస్తున్నప్పుడు, ఆయన శరీరంపై ఉన్న ఆభరణాలు కొన్ని విరిగి ఇక్కడ పడ్డాయి. అటువంటి వ్యక్తి ఆభరణాలను కనీసం కదిలించలేకపోయావు.. కానీ అంతటి బలమైన వ్యక్తిని సైతం పైకి లేపి, తన తొడలపై కూర్చోపెట్టుకుని, చీల్చి చంపిన వ్యక్తి ఆ శ్రీ మహా విష్ణువు.. ఒక్క మా ముత్తాతనే కాదు, మనం ఎంతో గొప్పగా చెప్పుకునే దైత్యులనూ, దైత్య రాజులనూ, వారి తండ్రి తాతలను కూడా సునాయాసంగా సంహరించిన వ్యక్తి ఆ విష్ణువే.. ఇలా లోక కంటకులను సంహరించి, భూమిని ఉద్ధరించిన మహా శక్తివంతుడు ఆ నారాయణుడు. అంతేకాదు, రెండడుగులతో సమస్త లోకాలనూ కొలిచి, మూడవ అడుగు నా తలపై మోపి నన్నిక్కడికి చేర్చినది ఆయనే. నాకు ఎటువంటి హానీ జరగకుండా కాపు కాస్తున్నది కూడా ఆయనే. కొంత సేపటి క్రితం ద్వారం దగ్గర ఎవర్నైతే చూసి భయపడ్డావో, ఆయనే శ్రీ మహా విష్ణువు. నీకు పోయేకాలం వచ్చినప్పుడు, మరో మారు ఆయన దర్శన భాగ్యం కలుగుతుంది. ఇక బయలు దేరు’ అని చెప్పాడు.

దానితో రావణుడికి తన బలం, విష్ణువు బలంతో పాటు, భవిష్యత్తులో జరగబోయేది కూడా అర్ధం అయ్యింది. అయితే, బలి చక్రవర్తి వల్ల కలిగిన జ్ఞాననాన్ని, అతడి వక్రబుద్ధి కప్పేసింది. అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిన రావణుడు, కాలగమనంలో శ్రీ మహా విష్ణువు శక్తిని మరచి, చేయకూడని పనులన్నీ చేశాడు. రామచంద్రుడు తన లంకకు వచ్చి, సమస్త పరివారాన్నీ గడ్డిపోచలను తుంచినట్లు తుంచేస్తుంటే, వచ్చినది ఆ శ్రీ మహా విష్ణువే అని పరిపూర్ణంగా అర్ధమైనా, అతడి అహంకారం ఆ జ్ఞానాన్ని మళ్ళీ కప్పేసింది. దాంతో రాముడి చేతిలో రావణ సంహారం అనివార్యం అయ్యింది. లోక కళ్యాణం జరిగింది.. నేటికీ ఆ మహా చరిత్ర మన మనసుల్లో పదిలంగా నిలిచింది.

ఓం నమో నారాయణాయ!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas